చెస్ టూ క్రికెట్! | Sakshi
Sakshi News home page

చెస్ టూ క్రికెట్!

Published Thu, Feb 2 2017 12:05 PM

చెస్ టూ క్రికెట్!

నాగ్పూర్:'రెండో ట్వంటీ 20లో సత్తా చాటుతా. నాగ్పూర్లోని వీసీఏ స్టేడియం పెద్దదిగా ఉండటంతో దాన్ని నాకు అనుకూలంగా మార్చుకుంటా. సాధ్యమైనన్ని వికెట్లు సాధించడానికి యత్నిస్తా' అని కాన్పూర్ లో జరిగిన తొలి మ్యాచ్లో రెండు వికెట్లు తీసిన అనంతరం భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ చెప్పిన మాట ఇది. అయితే నాగ్ పూర్ లో చాహల్ కు వికెట్ కూడా లభించలేదు.నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్ వేసి 33 పరుగులిచ్చాడు. అయితే నాగ్పూర్లో రాణించని చాహల్.. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో చెలరేగిపోయాడు. ఆరు వికెట్లతో ఇంగ్లండ్ వెన్నువిరిచి టీమిండియా భారీ విజయంలో ముఖ్య భూమిక పోషించాడు.


గతేడాది జూన్లో భారత్ జట్టులోకి ప్రవేశించిన చాహల్.. ఇప్పుడు కీలక ఆటగాడు.ఇప్పటివరకూ భారత్ తరపున మూడు వన్డేలు, ఆరు ట్వంటీ 20లు మాత్రమే ఆడిన చాహల్ మొత్తం 17 వికెట్లు తీశాడు. గత ఐపీఎల్లో యుజ్వేంద్ర చాహాల్ 19 వికెట్లతో ప్రథమ స్థానంలోనిలవడంతో సెలక్టర్ల దృష్టి అతనిపై పడింది. 2014లో తొలిసారి ఆర్సీబీ జట్టులోకి వచ్చిన చాహల్..  రెండు సంవత్సరాల వ్యవధిలోనే అత్యధిక వికెట్లను సాధించి 'టాప్' స్థానంలో నిలిచాడు. తనకు వచ్చిన అవకాశాన్ని అంచెలంచెలుగా అందిపుచ్చుకుని ఇప్పుడు ఆర్సీబీలో కీలక బౌలర్గా ఎదిగాడు. తన లెగ్ బ్రేక్లతో ప్రత్యర్థి ఆటగాళ్లను బోల్తా కొట్టిస్తున్న చాహల్.. ఐపీఎల్ నుంచి భారత్ కు లభించిన ఆణిముత్యం.

 

ఇదంతా పక్కకు పెడితే, చాహల్  క్రీడా ప్రస్థానం చాలా  విభిన్నం సాగింది. హరియాణాకు చెందిన  ఈ లెగ్ బ్రేక్ మాంత్రికుడు తన క్రికెట్ జీవితానికి ముందు చదరంగాన్ని ఎంచుకున్నాడు.  2003 లో జరిగిన ఆసియన్ యూత్ చాంపియన్ షిప్, ఆ తరువాత గ్రీస్ లో జరిగిన అండర్ -12 వరల్డ్ యూత్ చెస్ చాంపియన్షిప్లలో భారత్కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే కేవలం ఏడు చెస్ టోర్నమెంట్లలో మాత్రమే పాల్గొన్న చాహాల్.. ఆపై క్రికెట్ బంతిని అందిపుచ్చుకుని స్పిన్నర్గా అవతరించాడు. గత రెండు సీజన్ల నుంచి ఐపీఎల్ లో ఆడుతున్నా ఒక అనామక క్రికెటర్ మాదిరిగానే మిగిలిపోయిన చాహల్.. 2016 ఐపీఎల్ సీజన్ లో తనను నిరూపించుకుని అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. దాంతో పాటు గత ఫస్ట్  క్లాస్ సీజన్ లో కూడా చాహల్ అమోఘంగా రాణించాడు. గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకూ చూస్తే చాహల్ 29 ఫస్ట్ క్లాస్ వికెట్లు సాధించాడు. కాగా, ప్రస్తుతం ఇంగ్లడ్ తో మూడు ట్వంటీ 20 సిరీస్ లో చాహల్ అద్భుత ప్రదర్శన అతన్ని స్టార్ క్రికెటర్ను చేసేసింది.

Advertisement
Advertisement