ధోని సేనకు షాక్ | Sakshi
Sakshi News home page

ధోని సేనకు షాక్

Published Sat, Jun 18 2016 8:13 PM

ధోని సేనకు షాక్

హరారే: జింబాబ్వే పర్యటనలో భారత క్రికెట్ జట్టుకు తొలి షాక్ తగిలింది. మూడు టీ 20ల సిరీస్లో భాగంగా ఇక్కడ శనివారం జరిగిన మొదటి మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది.  జింబాబ్వే విసిరిన 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ధోని సేన రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది.  చివరి ఓవర్ లో భారత విజయానికి ఎనిమిది పరుగులు చేయాల్సిన తరుణంలో మ్యాచ్ ఫినిషర్ గా పేరున్న కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సింగిల్స్ కే పరిమితం కావడంతో ఓటమి తప్పలేదు. ఆఖరి ఓవర్ తొలి బంతికి ధోని సింగిల్ తీయగా, ఆ తరువాత బంతికి అక్షర్ పటేల్ అవుటయ్యాడు. మూడో బంతికి సింగిల్ ధోని మరో సింగిల్ తీయగా, నాల్గో బంతికి రిషి ధవన్ పరుగేమీ చేయలేదు. ఐదో బంతి వైడ్ కావడంతో భారత్ కు ఒక పరుగు వచ్చింది. ఆ తరువాత ధవన్ సింగిల్ తీసి ధోనికి స్ట్రైయికింగ్ ఇచ్చాడు. చివరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సిన తరుణంలో ధోని సింగిల్ తో సరిపెట్టుకున్నాడు. దీంతో భారత్ జట్టుకు ఓటమి తప్పలేదు.

భారత ఓపెనర్ కేఎల్ రాహుల్(0) పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరి తీవ్రంగా నిరాశపరిచాడు. ఆ తరువాత అంతర్జాతీయ అరంగేట్రం చేసిన మన్ దీప్ సింగ్(31;27 బంతుల్లో 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా, అంబటి రాయుడు(19) విఫలమయ్యాడు. దీంతో భారత జట్టు 54 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో మనీష్ పాండే(48;35 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించాడు. అయితే మరో ఎండ్ లో అతనికి సరైన సహకారం లభించకపోవడంతో భారత్ కు ఓటమి తప్పలేదు. భారత మిగతా ఆటగాళ్లలో  కేదర్ జాదవ్(19), కెప్టెన్ మహేంద్ర సింగ్(19 నాటౌట్)లు నిరాశపరిచారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే  నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది.

 
జింబాబ్వే ఆటగాళ్లలో చిబాబా(20), మసకద్జా(25)లు మోస్తరుగా రాణించగా, ముతాంబామి రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్ కు చేరాడు. ఆ తరువాత సికిందర్ రాజా(20), వాలర్(30)లు ఫర్వాలేదనిపించారు. ఈ జోడీ మూడో వికెట్ కు 47 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. అయితే చిగుంబరా (55 నాటౌట్; 26 బంతుల్లో 1 ఫోర్, 7 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. టీమిండియా బౌలర్లలో  బూమ్రా రెండు వికెట్లు సాధించగా, రిషి ధవన్, అక్షర్ పటేల్, చాహల్ లకు తలోవికెట్ దక్కింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement