పశ్చిమ రైల్వేకి 150 ఏళ్లు | Sakshi
Sakshi News home page

పశ్చిమ రైల్వేకి 150 ఏళ్లు

Published Fri, Nov 29 2013 2:29 AM

150 years to  Western railway

 ముంబై:  ఒక నాటి జాలర్ల గ్రామం దేశ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి కావడానికి కారణమైన పశ్చిమ రైల్వేకి 150 ఏళ్లొచ్చాయి. పశ్చిమ సముద్ర తీరంలో రవాణా అవసరాలను తీర్చడానికి ఆంగ్లేయులు ఏర్పాటు చేసిన రైల్వే మార్గంలో నవంబర్ 28న, 1864న తొలి రైలు నడిచింది. అదే నేడు విస్తరించి ఆరేబియా సముద్ర తీరం వెంట ముంబై నుంచి గుజరాత్‌కు ఆ తరువాత మొత్తం ఉత్తరాదిని కలుపుతూ విస్తరించింది. 150 సంవత్సరాల కిందట ఈ రైలు మార్గాన్ని ముంబై-బరోడాలను కలుపుతూ బరోడా అండ్ ఏఎంపీ;ఏఎంపీ ఆధ్వర్యంలో తొలినాళ్లలో మొదలయిన ప్రయాణం సెంట్రల్ ఇండియా రైల్వే (బీబీ అండ్ ఏఎంపీ;ఏఎంపీ)గా గుజరాత్‌లోని ఉట్రాన్ నుంచి ముంబైకి రవాణా నిర్వహించింది. తరువాత క్రమంలో పశ్చిమ రైల్వేగా ఊపిరి పోసుకుంది అని ఓ రైల్వే అధికారి వివరించారు.

 ఈ మార్గంలో తొలి టర్మినస్‌గా గ్రాంట్ రోడ్డు రోడ్డు స్టేషన్ ఏర్పడింది. తొమ్మిదేళ్ల తరువాత 1873 నాటికి అది కొలాబా వరకు విస్తరించింది. 1930 నాటికి కొలబాను మూసివేసిన అధికారులు టర్మినస్‌ను చర్చి గేట్‌కు మార్చారు. ఇప్పటికీ ఇది శివారు రైల్వే సర్వీస్‌లకు కేంద్రంగా కొనసాగుతోంది. కాలక్రమంలో ముంబై సెంట్రల్, దాదర్‌లు అభివృద్ధి అయ్యాయి. బీబీ అండ్ ఏఎంపీ;ఏఎంపీ సెంట్రల్ ఇండియా రైల్వేగా మారిన తర్వాత 1855లో అంకాలేశ్వర్ నుంచి గుజరాత్ రాష్ట్రంలోని ఉట్రాన్‌కు 47 కిలోమీటర్ల మేర బ్రాడ్‌గేజ్ మార్గాన్ని ఏర్పాటు చేసింది. ఇదే 1864 వరకు ఇది ఇటు ముంబై వరకు విస్తరించింది. అయితే తొలినాళ్లలో ఇది ప్రధానంగా రవాణా అవసరాలనే తీర్చింది. భారత సామాజిక సమస్యలపై అనన్యమైన ప్రభావం చూపిన రైల్వే ప్రజా రవాణా సాధనంగా తొలిసారి ఏప్రిల్ 16, 1853న అవతరించింది. తొలిసారి ముంబై-ఠాణేల మధ్య ప్రయాణికుల రైలు నడిచింది.
 
ఆనాటికి వివిధ రాష్ట్రాల ఆధ్వర్యంలో ఉన్న వివిధ రైల్వే విభాగాలను కలిపి నవంబర్ 5, 1951 నాటికి పశ్చిమ రైల్వే ఏర్పాటయింది. పశ్చిమ రైల్వే ఏర్పాటయిన తరువాత భారత ద్వీకల్పం కటి సీమకు వడ్డానంలా రూపుదిద్దుకొంది. పట్టణంగా రూపుదిద్దుకున్న ముంబై శివారు ప్రాంతాలకు విస్తరించడంతో ఏప్రిల్ 1867లో ఆవిరి ఇంజన్‌తో సబర్బన్ రైలు సర్వీస్ ప్రారంభమయింది. అదే ఇంతింతై విస్తరిస్తూ పోతూ నేడు రోజుకు 35 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తోంది. ఈ చారిత్రక సందర్భాన్ని స్మరించుకోవడానికి పశ్చిమ రైల్వే జనరల్ మేనేజర్ హేమంత్‌కుమార్ ఓ ప్రదర్శనను ప్రారంభించారు. ‘‘ముంబైలో 150వ సంవత్సర వార్షికోత్సవం’ పేరుతో  రెండు రోజుల ప్రదర్శనను గురువారం ప్రారంభించారు. ఇది నేడు కూడా కొనసాగుతోంది. పశ్చిమ రైల్వేగా అభివృద్ధి చెందిన వివిధ దశలకు చెందిన అరుదైన ఛాయా చిత్రాలు ఈ ప్రదర్శనలో ఉంచారు. దేశ పశ్చిమ భాగంలో, ముంబైలో రైల్వే విస్తరించిన క్రమానికి ఈ ప్రదర్శన అద్దంపట్టింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement