కన్నీటి సంద్రం | Sakshi
Sakshi News home page

కన్నీటి సంద్రం

Published Fri, Apr 10 2015 3:47 AM

20 woodcutters from TN gunned by AP police

వీరప్పనూరుగా నామకరణం
 ఒకప్పుడు వీరప్పన్ వద్ద అనుచరులుగా ఉంటూ ఎర్ర చందనం తరలిస్తున్న వారు వీరప్పన్ గుర్తుగా జవ్యాది కొండపై వీరప్పనూర్‌గా నామకరణం చేశారు. నేటికీ ఆ గ్రామంలో దాదాపు 90 శాతం ప్రజలు కట్టెలు కొట్టడంలోనే నిమగ్నం అయ్యారు. వీరప్పన్ ఉండే సమయంలో ఈ గ్రామంలోని ప్రజలందరూ వీరప్పన్ వద్ద పనిచేసే వారు. ప్రస్తుతం చిన్నచిన్న కట్టెలు కొట్టి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు.
 
 వేలూరు: తిరుపతి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం తరలిస్తున్నట్లు తమిళనాడుకు చెందిన 20 మంది కూలీలను ఆంధ్ర పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం విదితమే. వీరిలో 12 మంది తిరువణ్ణామలై జిల్లా కన్నమంగళం, జవ్యాది కొండవాసులుగా గుర్తించారు. మృతి చెందిన వారి వివరాలను ఆంధ్ర పోలీసులు వాట్సాప్ ద్వారా తమిళనాడు పోలీసులకు సమాచారం అందించి అటవీ ప్రాంతాల్లో విచారణ చేపట్టారు.
 
 మృతి చెందిన వారి వివరాలు
 తిరువణ్ణామలై జిల్లా పోలూరు తాలుకా అనంతపురం సమీపంలోని మురుగంబాడి గ్రామానికి చెందిన గోపాల్ కుమారుడు మునస్వామి(38), అదే గ్రామానికి చెందిన మూర్తి(36), గాంధీనగర్‌కు చెందిన శివాజీ కుమారుడు మహేంద్రన్(23), కళశ ముత్తు గ్రామానికి చెందిన వేలు కుమారుడు పయణి(38), పడవేడు సమీపంలోని వేటగిరి బానయత్త గ్రామానికి చెందిన పెరుమాల్(38), వేటగిరిపాళ్యంకు చెందిన మురుగన్(36), అదే గ్రామానికి చెందిన శశికుమార్(35) గా గుర్తించారు. జవ్యాది కొండ సమీపంలోని మేల్ కనవనూర్ గ్రామానికి చెందిన రామస్వామి కుమారుడు పన్నీర్‌సెల్వం(25), మేల్‌కుప్పసనూర్‌కు చెందిన గోవిందన్ కుమారుడు రాజేంద్రన్(32), అదే గ్రామానికి చెందిన  సడయాన్ కుమారుడు గోవిందస్వామి(38), వెల్లయ్యన్ కుమారుడు వళ్లిముత్తు(22), చిన్నపయ్యన్ కుమారుడు చిన్నస్వామి(47)గా ఉన్నారు. ప్రస్తుతం మృతి చెందిన వారిలో నలుగురు మేల్‌కుప్పసనూర్ గ్రామానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామంలోని ప్రజలు శోక సముద్రంలో మునిగి పోయారు.
 
 బందోబస్తు నడుమ మృత దేహాలు అప్పగింత
 ఆంధ్ర పోలీసులు తిరుపతిలో పోస్టుమార్టం నిర్వహించిన మృత దేహాలను వేలూరు, తిరువణ్ణామలై, తిరువ ళ్లూరు జిల్లాలకు చెందిన అధికారులకు అప్పగించారు. ఈ మృత దేహాలను ఆంధ్ర పోలీసులు తమిళనాడు అంబులెన్స్ ద్వారా ఆంధ్ర సరిహద్దు వరకు తీసుకొచ్చారు. ఆంధ్ర సరిహద్దులో ఉన్న తమిళనాడు పోలీసులు మృత దేహాలను పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ తిరువణ్ణామలైకి తీసుకొచ్చారు.
 
 కన్నీరు మున్నీరు
 మృత దేహాలను చూసిన బంధువులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీర య్యారు. మృత దేహాల కోసం, భార్య పిల్లలతో సహా తల్లులు, బంధువులు రాత్రంగా ఎదురు చూస్తూ తీవ్ర శోకంలో మునిగిపోయారు. మృత దేహాలను  అంబులెన్స్ ద్వారా పోలీసులు తీసుకు రావడంతో ఒక్కసారిగా బిగ్గరగా రోదించారు.
 
 మృతదేహాలతో రాస్తారోకో
 ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వేటగిరి పాళ్యంకు చెందిన శశికుమార్, మురుగన్, పెరుమాల్ బంధువులు మృత దేహాలను చూసి బోరున విలపించారు. అనంతరం ఆ మృత దేహాలను తీసుకొని పడవేడు మెయిన్ రోడ్డుకు ఊరేగింపుగా వెళ్లి మృత దేహాలను నడిరోడ్డుపై పెట్టి రాస్తారోకో చేశారు. ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ చేపట్టాలని, మృత దేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించాలని, మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం అందజేయాలని నినాదాలు చేశారు. మృత దేహాలను చూసేందుకు మంత్రు లు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ రాలేదని తెలిపారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు గ్రామస్తులతో చర్చలు జరిపి రాస్తారోకోను విరమింప జేశారు.
 
 మృతదేహాలకు కాళ్లు, చేతులు మాయం

 సొంత గ్రామాలకు చేరుకున్న మృత దేహాలను పరిశీలించారు. కన్నమంగళం సమీపంలోని కాళ సముద్రం గ్రామానికి చెందిన పయణి బీఎడ్ పట్టభద్రుడు. ఇతనికి మూడు నెలల మగ బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డను చేతిలో పెట్టుకొని భార్య లోగనాయగి కన్నీరు మున్నీరయింది. ఆ సమయంలో పయణి కుడి కాలు కనిపించక పోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. బుల్లెట్ శరీరంలో తగిలి ఉంటే ఒక కాలు లేకుండా పంపడం ఎందుకని అనుమానం వ్యక్తం చేశారు. అదే విధంగా పుదూర్ కొళ్లమేడుకు చెందిన మహేంద్రన్ మృత దేహంలో కూడా కుడి కాలు లేకపోవడంతో బంధువులు ఆశ్చర్య పోయారు. వీటిపై సీబీఐ విచారణ చేపట్టాలని తల్లి చిత్ర, సోదరుడు మాధవన్ డిమాండ్ చేశారు. కూలీలను చిత్ర హింసలు పెట్టి కాల్చి చంపి ఉంటారని ఆంధ్ర పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  
 
 కన్న మంగళంలో దుకాణాలు మూసివేత
 మృతి చెందిన 12 మంది కూలీలు కన్నమంగళం, జవ్యాది కొండ సమీపంలోని గ్రామాలకు చెందిన వారు కావడంతో వారి ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఒక్కరోజు దుకాణాలు మూసివేసి వ్యాపారులు ధర్నా చేశారు. పార్టీలకు అతీతంగా వ్యాపారులు దుకాణాలు మూసి వేసి నిరసన తెలిపారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.  
 
 శోక సంద్రంలో అటవీ ప్రాంతవాసులు
 ఒక్కసారిగా పక్కపక్క గ్రామాలకు చెందిన అటవీ ప్రాంత వాసులు 12 మంది మృతి చెందడంతో జవ్యాది కొండ, కన్నమంగళం వంటి చుట్టు పక్కల గ్రామస్తులు శోక సముద్రంలో మునిగి పోయారు. అటవీ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరూ మృత దేహాలను చూసి కన్నీరు పెట్టుకున్నారు. పొట్ట కూటి కోసం వెళ్లి మృత దేహాలుగా మిగిలి పోయారని వాపోయారు.
 
 కూలీలను తరలించే ఏజెంట్ల కోసం గాలింపు
 తిరువ ణ్ణామలై, వేలూరు జిల్లాల నుంచి ఎర్ర కూలీలను తీసుకెళ్లే ఏజెంట్ల కోసం తమిళనాడు పోలీసులు గాలిస్తున్నారు. కూలీలను ఏ ప్రాంతానికి చెందిన ఏజెంట్‌లు తీసుకెలుతున్నారు. వారిని ఎలా అడవికి తరలిస్తున్నారు. కూలీలు తీసుకొచ్చే ఎర్ర చందనాన్ని ఎక్కడికి తీసుకెళ్లి విక్రయిస్తున్నారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. వేలూరు, జవ్యాది కొండ, కన్నమంగళం, పోలూరు, తిరుపత్తూరు వంటి అటవీ ప్రాంతాల గ్రామస్తుల వద్ద పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement
Advertisement