ఆటో నడిపేందుకు కనీస అర్హత 8వ తరగతి | Sakshi
Sakshi News home page

ఆటో నడిపేందుకు కనీస అర్హత 8వ తరగతి

Published Mon, Feb 17 2014 11:09 PM

8th class is minimum qualification for auto drivers

   ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
     ఆందోళనలో ఆటోవాలాలు
 పింప్రి, న్యూస్‌లైన్: ఆటో నడిపేందుకు కనీస అర్హత 8వ తరగతి అయినా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొదట పదో తరగతి ఉండాలని పేర్కొన్న ప్రభుత్వం కొంత మినహాయించి 8వ తరగతి ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
 
 ఇదిలాఉండగా రాష్ట్ర ప్రభుత్వం 69 వేల ఆటో డ్రైవింగ్ లెసైన్సులను లాటరీ పద్ధతి ద్వారా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అంతేగాకుండా డ్రైవింగ్ లెసైన్సుల కోసం ఇప్పటి వరకు లక్షా 60 వేలకు పైగా దరఖాస్తులు అందాయని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. అయితే వీటిని దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 15వ తేదీ చివరి గడువు కావడంతో దరఖాస్తుల వెల్లువ కొనసాగిందన్నారు. ఇకమీదట ఆటో వాలాలు లెసైన్సుతోపాటు బ్యాడ్జీలు తప్పనిసరిగా కలిగి ఉండాలి. వీటితోపాటు పదో తరగతి ఉత్తీర్ణతకు సంబంధించిన సర్టిఫికెట్ ఉండాలి.
 అయితే పదో తరగతి వారు దరఖాస్తు చేయని పక్షంలో 8వ తరగతి వరకు విద్యార్హత కలిగిన వారికి అవకాశం కల్పించనున్నట్లు అధికారి వెల్లడించారు. కాగా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారిలో 69,979 మంది 8వ తరగతి ఉత్తీర్ణులైనవారు ఉండగా, 10వ తరగతి ఉత్తీర్ణులైనవారు 45,077, 12వ తరగతి ఉత్తీర్ణులైనవారు 15,818, డిగ్రీ చదివిన వారు 3,603, పోస్టుగ్రాడ్యుయేటర్లు 352 మంది ఉన్నారని అధికారి వెల్లడించారు.
 
 వ్యతిరేకిస్తున్న రిక్షా పంచాయత్
 లెసైన్సు పొందడానికి 10వ తరగతిని కనీస విద్యార్హతగా నిర్ణయించడంపై రిక్షా పంచాయత్ సంఘటన మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉంది. ఈ విషయంపై త్వరగా నిర్ణయాన్ని తెలిపేందుకు రిక్షా సంఘాలు సమావేశం అవుతున్నాయి. ఆటోలనే జీవనాధారంగా భావిస్తున్న తక్కువ విద్యార్హత కలిగిన వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
 
 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement