Sakshi News home page

రాష్ట్రంలో ఆమ్‌ఆద్మీ పాగా

Published Wed, Dec 25 2013 12:37 AM

Aam Aadmi Party recruits one thousand members in Chennai

చెన్నై, సాక్షి ప్రతినిధి: వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఒక్క ఏడాది కూడా పూర్తి చేసుకోని ఆమ్ ఆద్మీ పార్టీ మట్టికరిపించింది. ఢిల్లీ కాంగ్రెస్ పీఠాన్ని కూల్చిన ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ సంచలనంగా మారారు.  ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలపై దేశ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూసినా ఢిల్లీ ఫలితాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో దశాబ్దాల తరబడి ప్రజలతో మమేకమైన కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరుసాగితే, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ కొత్త పార్టీగా గట్టిపోటీనివ్వడం, కాంగ్రెస్‌ను మూడో స్థానంలోకి నెట్టడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలన్న ఆలోచనతో భాగంగా రాష్ట్రంలో ప్రయత్నాలు ప్రారంభమయ్యూయి. 
 
రెండురోజుల క్రితం ఢిల్లీ పెద్దల ఆదేశాలతో సమావేశమై 1300 మంది నాయకులను ఎంపిక చేసుకున్నారు. వీరిలో 600 మందిని పార్టీ పనుల నిమిత్తం వినియోగించుకుంటున్నారు. ఈ 1300 మంది బృందంలో 90 శాతం మంది 22-32 ఏళ్ల కుర్రకారు ఉన్నారు. వీరి నేతృత్వంలో చెన్నైలోని 120 కాలేజీల్లో విద్యార్థి సంఘాలు ఏర్పాటయ్యూరుు. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలపై విద్యార్థి సంఘం నేత గణేష్ మాట్లాడుతూ, తమ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తమ ప్రధాన కర్తవ్యమని తెలిపారు. ఇందు కోసం విద్యార్థి సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు. విద్యార్థులతోపాటూ 10 మంది 50 ఏళ్ల పైబడిన ఆటోడ్రైవర్లను, రిటైర్డు ఉద్యోగులను పూర్తిస్థాయిలో పార్టీకి పని చేసేలా ఎంపిక చేసుకున్నామని తెలిపారు.
 
15 కళాశాలలకు ఒక ప్రతినిధిని ఎన్నుకుంటామని, ఈ ఎన్నిక సైతం కాలేజీ విద్యార్థులతోనే జరుపుతామని తెలిపారు. ప్రతి కాలేజీ నుంచి ఒక ప్రతినిధి ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ నెల 28వ తేదీన వేలూరులో ప్రతినిధుల ఎంపిక కార్యక్రమాలను ప్రారంభిస్తామని, ఆ తరువాత నాగర్‌కోయిల్‌లో ఒకరోజు, చెన్నైలో రెండురోజుల పాటూ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేత సమావేశాలను నిర్వహిస్తామని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల యువత ప్రభావితమైనందున విద్యార్థి సంఘాల ఏర్పాటుపై ముందుగా దృష్టి కేంద్రీకరించామని తెలిపారు. 10 శాతం ఉన్న అనుభవజ్ఞులు, విద్యార్థి సంఘాలను మార్గనిర్దేశనం చేస్తారని తెలిపారు. 
 

Advertisement
Advertisement