‘ఆప్’లో అసంతృప్తి | Sakshi
Sakshi News home page

‘ఆప్’లో అసంతృప్తి

Published Fri, Mar 21 2014 11:33 PM

‘ఆప్’లో అసంతృప్తి

 చెన్నై, సాక్షి ప్రతినిధి : ఆమ్ ఆద్మీ పార్టీ కొత్తదైనా పాతపార్టీల స్థాయిలో అసమ్మతి, అసంతృప్తులకు కొదవలేదు. తమిళనాడులో సైతం తన సత్తా చాటుకోవాలని ఆశపడుతున్న ఆప్‌కు అసంతృప్తుల మంటలు అంటుకున్నాయి. పార్టీ నుంచి వైదొలుగుతామని కొందరు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసంతృప్తి మంటలను చల్లార్చేందుకు ఆప్ అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్ వచ్చే నెల 1న రాష్ట్రంలో పర్యటించనున్నారు.

 పుట్టిన నెలల వ్యవధిలోనే ఢిల్లీ పగ్గాలు చేపట్టడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్త గుర్తింపు పొందింది. తమిళనాడులో సైతం పెద్ద సంఖ్యలో ప్రజలు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఢిల్లీ పీఠం మూన్నాళ్ల ముచ్చటైనా పార్టీ చెన్నై, ఏర్పడిన క్రేజ్ దృష్ట్యా ఔత్సాహిక సభ్యులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యూరు. తమిళనాడులో మొత్తం 39 స్థానాలకు గాను 25 స్థానాల్లో పోటీ చేయూలని నిర్ణరుుంచారు. ఈ క్రమంలో 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మిగిలిన స్థానాలకు శని, ఆదివారాల్లో పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.

 ఆర్‌ఎస్‌ఎస్ అభ్యర్థికి ఆప్ సీటా ?
 ఆప్ సిద్ధాంతాలు అంటూ ప్రచారం చేసుకుంటున్న పార్టీ శ్రేణులు అభ్యర్థుల పేర్లు వెల్లడికాగానే రాద్దాంతాలు సృష్టించడం ప్రారంభించారు. సెంట్రల్ చెన్నై స్థానానికి జే ప్రభాకరన్ పేరును ఎంపిక చేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ కార్యకర్తలు గురువారం రాత్రి చెన్నై టైలర్స్ రోడ్డులోని ఆప్ కార్యాలయాన్ని ముట్టడించారు. అభ్యర్థిని మార్చాల్సిందేనంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ దక్షిణ చెన్నై ఇన్‌చార్జ్ అహ్మద్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పోటీకి ఆసక్తి చూపుతున్నట్లుగా ప్రభాకరన్ పార్టీకి దరఖాస్తు చేసుకోలేదని, విజ్ఞప్తి చేయని వ్యక్తికి టికెట్టు ఇవ్వడం ఆప్ విధానాలు, సిద్ధాంతాలకు విరుద్ధమని అన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా పనిచేస్తున్న వ్యక్తికి ఆప్ టికెట్ ఇవ్వడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రభాకర్ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ సమావేశంలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపామని తెలిపారు. ఆప్ పెద్దలు తమ మొర వినకుంటే పార్టీ నుంచి వైదొలిగేందుకు సిద్ధమని పలువురు కార్యకర్తలు ప్రకటించారు.

 ఏప్రిల్ 1న కేజ్రీవాల్ తమిళనాడు రాక
 ఆప్‌లో అసంతృప్తుల సెగలు కమ్ముకుంటున్న వేళ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్ వచ్చే నెల 1వ తేదీన రాష్ట్ర పర్యటనకు రానున్నారు. తిరునెల్వేలి నియోజకవర్గంలో జరిగే ప్రచార సభల్లో ఆయన పాల్గొంటారని తెలిసింది. అసంతృప్తులను బుజ్జగించడంతోపాటు మరికొన్ని స్థానాల్లో ప్రచారం నిర్వహించే అవకాశం ఉందని ఆప్ కార్యకర్తలు చెబుతున్నారు.

Advertisement
Advertisement