ఆ(ప్) మాటల్లో మర్మమేంటి? | Sakshi
Sakshi News home page

ఆ(ప్) మాటల్లో మర్మమేంటి?

Published Wed, Dec 18 2013 11:18 PM

డా.హర్షవర్ధన్ - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పదేపదే మాటలు మారుస్తూ ఢిల్లీవాసులను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మోసగిస్తోందని బీజేపీ శాసనసభ పక్షనాయకుడు డా.హర్షవర్ధన్ ధ్వజమెత్తారు. ఎవరితోనూ పొత్తుపెట్టుకోబోమని ఒకరోజు, ప్రజల నిర్ణయానికి వదిలేస్తున్నామని మరోరోజు.. ఇలా ఆప్ నేతలు మాటలు మార్చడంలో అంతరార్థం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. ఆప్ నాయకులు కాంగ్రెస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారన్నది స్పష్టమైందని బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విరుచుకుపడ్డారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌పార్టీతో ఆప్ నాయకులు రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు.

ఎన్నికల తర్వాత ఎలాగూ ఓడిపోతామని ముందే పసిగట్టిన కాంగ్రెస్ నాయకులు ఆప్‌తో అనధికారిక పొత్తు పెట్టుకున్నారన్నారు. లేదంటే ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పార్టీనేతలు ప్రభుత్వ ఏర్పాటుపై వైఖరి చెప్పలేకపోవడానికి కారణం ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఎవరికి మద్దతు ఇవ్వబోం, తీసుకోం అని పేర్కొన్న అరవింద్ కే జ్రీవాల్ 28 స్థానాలు గెలిచిన తర్వాత స్టాండ్ మార్చారన్నారు. క్రమంగా కాంగ్రెస్‌పార్టీకి అనుగుణంగా అడుగులు వేస్తున్నారని దుయ్యబట్టారు. ఆప్ ఢిల్లీవాసుల అభిప్రాయాన్ని సేకరించే ముందు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, అప్పుడు ప్రజలకు స్పష్టత వస్తుందన్నారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్‌కి హర్షవర్ధన్ పలు ప్రశ్నలు సంధించారు.

 ?    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 11 రోజులు గడుస్తోంది. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలిసి ఐదు రోజులు గడువు అడిగారు. నేటికీ ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వకుండా ఢిల్లీవాసులతో దోబూచులాడుతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపైనే తేల్చుకోలేకపోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ. ఎన్నికల హామీలు నె రవేరుస్తుందా?
 ?    కాంగ్రెస్ పార్టీ ఎనిమిది మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా?
 ?    ఢిల్లీలో ప్రభుత్వం లేని కారణంగా ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఢిల్లీలో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. ఇందుకు ఆప్ బాధ్యత వహిస్తుందా?
 ?    ఆప్‌కి మద్దతు ఇవ్వడం వెనుక రెండు పార్టీల మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏమిటో కేజ్రీవాల్, సోనియాగాంధీ వెల్లడించాలి.
 ?    32 స్థానాలు గెలుచుకున్న తర్వాత బీజేపీ ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధపడింది. కేవలం నలుగురి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. అయినా రాజకీయ లబ్ధి పక్కనపెట్టి, ప్రజాతీర్పును గౌరవించాం. ఈ విషయంలో ఆప్ వైఖరి భిన్నంగా ఉండడానికి కారణం?
 ?    కాంగ్రెస్, ఆప్ మధ్య రాజకీయ నాటకం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో ప్రజలకు చెప్పాలి. ఢిల్లీలో ప్రభుత్వం లేని కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 ?    {పస్తుతం ఆమోదం పొందిన లోక్‌పాల్‌బిల్లుపై అభ్యంతరాలు ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ మరో లోక్‌పాల్ బిల్లుకోసం ఎందుకు ఉద్యమించడం లేదు?
 ఇలా ఆప్ వైఖరిని ప్రశ్నిస్తూ బీజేపీ శాసనసభ పక్ష నేత డాక్టర్ హర్షవర్ధన్ విరుచుకుపడ్డారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్, ఆప్‌ల మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆరోపించారు.

Advertisement
Advertisement