ఏసీబీ ఏర్పాటు ఎందుకంటే... | Sakshi
Sakshi News home page

ఏసీబీ ఏర్పాటు ఎందుకంటే...

Published Wed, Mar 23 2016 3:09 AM

ఏసీబీ ఏర్పాటు ఎందుకంటే... - Sakshi

సోనియా, రాహుల్‌కు లేఖ రాసిన సీఎం సిద్ధరామయ్య

బెంగళూరు: రాష్ట్రంలో అవినీతి నిరోధక దళం(యాంటీ కరప్షన్ బ్యూరో-ఏసీబీ) ఏర్పాటు పై విపక్షాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఏసీబీని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందనే అంశంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాంగ్రెస్ హైకమాండ్‌కు వివరణ ఇచ్చుకున్నారు. రాష్ట్రంలో ఏసీబీని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఇతర రాష్ట్రాల్లో ఏసీబీ పనితీరు తదితర అంశాలను వివరిస్తూ ఏఐసీసీ అధ్యక్షరాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలతో పాటు లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, కర్ణాటక కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్‌లకు లేఖ రాశారు. ఈ లేఖలో ‘ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ఏసీబీ విధులు నిర్వర్తిస్తోంది.

అందులో భాగంగానే కర్ణాటకలో సైతం ఏసీబీని ఏర్పాటు చేశాం. ఇక అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ అవినీతిపై తన పోరాటాన్ని కొనసాగిస్తుందనే సందేశాన్ని ప్రజలకు అందించడానికే ఏసీబీని ఏర్పాటు చేశాము’ అని తన లేఖలో వివరించారు. ఈ లేఖతో పాటు ఏసీబీ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సైతం సీఎం సిద్ధరామయ్య జత చేసినట్లు సమాచారం. కాగా, లోకాయుక్తను బలహీనపరచడంలో భాగంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏసీబీని రద్దు చేయాల్సిందిగా సీఎం సిద్దరామయ్యకు సూచించండంటూ జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి సైతం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలకు లేఖలు రాశారు.
 
 

Advertisement
Advertisement