ఇక చాలు! | Sakshi
Sakshi News home page

ఇక చాలు!

Published Mon, Aug 21 2017 6:26 AM

ఇక చాలు!

చిన్నమ్మకు టాటా
నేడు తీర్మానం
►  అత్యవసర భేటీకి పిలుపు
తేలనున్న విలీనం
చట్టపర చర్యలకు దినకరన్‌ కసరత్తు


మీ సేవలు.. ఇక చాలు..’ అంటూ చిన్నమ్మ శశికళను అన్నాడీఎంకే నుంచి శాశ్వతంగా సాగనంపేందుకు ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి. అన్నాడీఎంకే నియమనిబంధనల్లో ఇందుకు తగ్గ చట్ట సవరణలతో ప్రత్యేక తీర్మానానికి నేతలు సిద్ధం అయ్యారు. ఇరు శిబిరాల విలీనం వ్యవహారాన్ని తేల్చనున్నారు. ఆమేరకు  సోమవారం పార్టీ కార్యవర్గం అత్యవసర భేటీకి సీఎం పళని పిలుపు నివ్వడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక, ఈ భేటీకి మాజీ సీఎం పన్నీరు శిబిరానికి చెందిన ప్రిసీడియం చైర్మన్‌ మధుసూదనన్‌ అధ్యక్షత వహించబోతున్నట్టుగా సంకేతాలు వెలువడడం గమనార్హం.

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అమ్మ, పురట్చి తలైవి శిబిరాలు ఒకే వేదిక మీదకు వచ్చేందుకు తగ్గ ప్రయత్నాలు వేగవంతమైన విషయం తెలిసిందే. చర్చలు ఆశాజనకంగా సాగడం, సీట్ల పందేరాలు కొలిక్కి రావడంతో సీఎం పళని, మాజీ సీఎం పన్నీర్‌ నేతృత్వంలోని శిబిరాలు ఇక, ఒకే వేదికగా ముందుకు సాగే అవకాశాలు ఎక్కువేనన్న ధీమా కేడర్‌లో పెరిగింది. అయితే, విలీ నం విషయంగా ఇరు శిబిరాల మధ్య అధికారిక ప్రకటనకు తగ్గ ముహూర్తం కుదరనట్టుగా పరిస్థితులు ఉన్నాయి.

ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన విడుదల కావచ్చన్న సంకేతాలు వెలువడుతూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఆదివా రం సాగిన అన్నాడీఎంకే ధారావాహిక  కొత్త మలుపు తిరిగింది. అత్యవసర భేటీకి పళని పిలుపునివ్వడం ప్రాధాన్యతకు దారితీసింది. ఈ సమావేశం వేదికగా చిన్నమ్మ శశికళను పార్టీ నుంచి సాగనంపబోతున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఈ చర్యల్ని అడ్డుకునే రీతిలో న్యాయ పోరాటానికి దినకరన్‌ కసరత్తుల్లో పడడంతో ఉత్కంఠ పెరిగింది.

అత్యవసర భేటీ
రాయపేట కార్యాలయం నుంచి అన్నాడీఎంకే కార్యవర్గంలోని ప్రధాన సభ్యులందరికీ సోమవారం అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నట్టు సీఎం పళని ఆదేశాల మేరకు ఆహ్వానం వెళ్లడంతో, అందరూ చెన్నైకి చేరుకునే పనిలో పడ్డారు. ఉదయం పదిన్నర గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. పన్నీరు పెట్టిన షరతుల్లో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ తొలగింపు ప్రధానంగా ఉన్నాయి. ఈ రెండింటినీ నెరవేర్చడం లక్ష్యంగా చట్ట పరంగా అన్నాడీఎంకే నిబంధనల్లో సవరణలకు సిద్ధం అవుతూ ఈ సమావేశానికి పిలుపునిచ్చినట్టు సమాచారం. అదే సమయంలో పన్నీరు శిబిరంలో ఉన్న మధుసూదనన్‌ అన్నాడీఎంకే నిబంధనల మేరకు పార్టీ  ప్రిసీడియం చైర్మన్‌గా వ్యవహరిస్తున్న దృష్ట్యా, ఆయన అధ్యక్షతన తాజా సమావేశానికి ఏర్పాట్లు చేసినట్టుగా తెలిసింది.

తేలనున్న విలీనం
చిన్నమ్మను సాగనంపుతూ తీర్మానం వెలువడ్డ కొన్ని క్షణాల్లో పన్నీరు పార్టీ కార్యాలయంలో అడుగు పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. సోమవారం అమావాస్య రావడం. ఈ రోజును తమిళులు శుభకరంగా భావిస్తుండడంతో విలీనం కూడా ఇదేరోజు సాగడం ఖాయం అన్న ప్రచారం ఊపందుకుంది. మధుసూదనన్‌ అధ్యక్షతన చట్ట సవరణలు సాగినా, విలీనం ప్రక్రియ జరిగినా, దానికి అడ్డు తగలడం ఎవరి తరం కాదన్న విషయాన్ని పరిగణించే అత్యవసర భేటీకి చర్యలు తీసుకున్నట్టు సమాచారం. ఇక, పన్నీరుకు పార్టీ నిర్వాహక అధ్యక్ష పదవి, డిప్యూటీ సీఎం, మరో ఇద్దరికి మంత్రి పదవుల శాఖలు సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ విషయంగా పన్నీరును కదిలించగా, చర్చల్లో ఓ మెట్టు పైకి ఎక్కినట్టు పేర్కొన్నారు. అందరూ ఆశించినట్టుగా మంచి ఫలితం వెలువడుతుందన్నారు. మంత్రి జయకుమార్‌ను కదిలించగా, దాపరికాలు లేవు, ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతామని, మంచే జరుగుతుందని ఆకాంక్షించారు.

చట్టపర చర్యల్లో దినకరన్‌
చిన్నమ్మతో పాటుగా తనను తొలగిస్తూ తీర్మానాలు చేస్తే, చట్టపరంగా ఎదుర్కొనేందుకు దినకరన్‌ సిద్ధం అయ్యారు. ఆదివారం మద్దతుదారులతో మంతనాల్లో మునిగారు. ఈ సమావేశం గురించి ఆ శిబిరం ఎమ్మెల్యే వెట్రివేల్‌ మాట్లాడుతూ, జరగనున్నది విలీనం కాదని, రెండు కంపెనీల ఏకం అని ఎద్దేవా చేశారు. దుబాయ్‌ వేదికగా రూ.500 కోట్లు పన్నీరుకు ముట్టినట్టు ఆరోపించారు. ఈ సమాచారం తమ స్లీపర్‌ సెల్స్‌ ద్వారా అందినట్టు పేర్కొన్నారు. సెటిల్‌మెంట్లు అన్నీ ముగిసిన దృష్ట్యా, ఏకం అయ్యేందుకు తగ్గ ఒప్పందాలకు సిద్ధం అయ్యారని మండి పడ్డారు. అన్నాడీఎంకేపి తాకట్టు పెట్టే ప్రయత్నాల్ని అడ్డుకుని తీరుతామని వ్యాఖ్యానించారు. కాగా, దినకరన్‌ దూకుడు పెంచేందుకు సిద్ధం అవుతున్న సంకేతాలతో, ఆయన మద్దతుదారుల ద్వారా సీఎం పళని ఓ హెచ్చరిక చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. పిల్లిలా తోక ముడుచుకుని పడి ఉంటే మంచిదని, లేకుంటే.. తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందన్న హెచ్చరికలు చేసి ఉండడం గమనించదగ్గ విషయం.

Advertisement
Advertisement