ఖుర్షీద్ అన్వర్ ఆత్మహత్యకు..మీడియా అతే కారణమా ? | Sakshi
Sakshi News home page

ఖుర్షీద్ అన్వర్ ఆత్మహత్యకు..మీడియా అతే కారణమా ?

Published Sat, Dec 28 2013 11:19 PM

Activist Khurshid Anwar's suicide: Was media trial responsible?

న్యూఢిల్లీ: సామాజిక సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేసి మంచిపేరు తెచ్చుకున్న ఎన్జీఓ ‘సోషల్ డెమోక్రసీ’ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఖుర్షీద్ అన్వర్ ఆత్మహత్యకు మీడియా అతే కారణమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తాను అత్యాచారానికి పాల్పడ్డట్టు మీడియాలో ప్రముఖంగా కథనాలు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీనికితోడు ఫిర్యాదు చేసిన మహిళ వాదనను టీవీ చానళ్లు పదేపదే చూపించడంతో ఆయన తీవ్ర ఆవేదన చెందారని ఖుర్షీద్ స్నేహితులు, జర్నలిస్టులు చెబుతున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా రెండు చానళ్లు సదరు యువతి మాటలను పదేపదే ప్రసారం చేశాయని ఆరోపించారు. దీంతో అంతులేని వేదనకు లోనైన బాధితుడు వసంత్‌కుంజ్‌లోని తన నివాసం మూడో అంతస్తు నుంచి దూకి ఈ నెల 18న ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే ఎన్జీఓలో పనిచేసే మణిపూర్‌కు చెందిన 23 ఏళ్ల యువతి ఖుర్షీద్ తనపై గత నెల 12న అత్యాచారం చేశారని ఆరోపించింది.
 
 ‘మీడియానే సొంతగా దర్యాప్తు చేసి ఇబ్బందులపాలు చేయడంతో ఖుర్షీద్ ప్రాణాలు తీసుకున్నారు. ఎలాంటి నిబంధనలను పాటించకుండా కథనాలను ప్రసారం చేశారు. కనీసం ఆయన వివరణ కూడా అడగలేదు. ఫేస్‌బుక్‌లోనూ ఆయన వ్యతిరేకంగా ప్రచారం మొదలయింది. ఇవన్నీ ఆయన మరణానికి కారణాలు’ అని సీనియర్ జర్నలిస్టు సయీద్ నఖ్వీ అన్నారు. అనేక సందర్భాల్లో న్యూస్ చానళ్లు బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ‘కోర్టు జోక్యానికి ముందే మీడియా వ్యక్తులను దోషులుగా చూపిస్తోంది. ఒక ఘటనలో మీడియా అంత త్వరగా తుది నిర్ణయానికి వచ్చి సదరు వ్యక్తి తప్పు చేశాడని ఎలా చెప్పగలదు ?’ అని ఆయన ప్రశ్నించారు. మీడియా సొంత దర్యాప్తు కారణంగానే ఖుర్షీద్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన సోదరుడు, డీయూ ప్రొఫెసర్ అలీ జావెద్ కూడా ఆరోపించారు. ఖుర్షీద్ అమాయకుడని, కనీసం అతని వాదన వినిపించేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement