హత్యకేసులో నటి శృతి చంద్రలేఖ కోసం గాలింపు | Sakshi
Sakshi News home page

హత్యకేసులో నటి శృతి చంద్రలేఖ కోసం గాలింపు

Published Wed, May 14 2014 9:32 AM

హత్యకేసులో నటి శృతి చంద్రలేఖ కోసం గాలింపు

తిరువొత్తియూరు : నటుడు పీటర్ ప్రిన్స్ హత్య కేసులో నటి శృతి చంద్రలేఖ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఈ కేసులో పోలీసులు ముఖ్య నిందితుడిని సోమవారం అరెస్టు చేశారు. నెల్లై జిల్లా పరప్పాడికి చెందిన రొనాల్డ్ పీటర్ ప్రిన్స్ (35) కొన్ని సినిమాల్లో సహాయ నటుడిగా నటించాడు. ఇతనికి బెంగళూరుకు చెందిన నటి శృతి చంద్రలేఖతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు చెన్నై మదురవాయల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.

జనవరి 13న నెల్లైకి వచ్చి అక్కడి నుంచి చెన్నైకి వస్తున్న పీటర్ ప్రిన్స్ హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. ఫిబ్రవరి 1వ తేదీ ఆయన కనబడలేదని శృతి మదురవాయల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలాగే తన తమ్ముడు కనబడలేదని పీటర్ ప్రిన్స్ సోదరుడు జస్టిన్ పాళయంకోట్టై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీ సులు జరిపిన విచారణలో శృతి, కిరాయి ముఠా ద్వారా పీటర్‌ను హత్య చేసి పాళయంకోటైలో పాతిపెట్టినట్లు తెలిసింది.

దీనికి సంబంధించి కిరాయి ముఠాకు చెందిన ఆన్సట్రాజ్, గాంధిమదినాథన్ రబీక్ ఉస్మాన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వారు అందించిన సమాచారం మేరకు ఆశీర్వాద నగర్‌లో పాతిపెట్టిన పీటర్ ప్రాన్సెస్ మృతదేహాన్ని తవ్వి బయటకు తీసి శవ పరీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో ఈ కేసులో ముఖ్య నిందితుడైన జాన్ ప్రిన్సెస్‌ను పాళయంకోట పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

జాన్‌ప్రిన్సెస్ పోలీసులకు అం దించిన వివరాలు ఇలా ఉన్నాయి. తాను, పీటర్, ఉమాచంద్రన్ కలిసి ఆన్‌లైన్ వ్యాపారంలో నగదు డిపాజిట్ చేశామని, అయితే అందులో నష్టం రావడంతో పీటర్  తమని వదలి బెంగళూరుకు వెళ్లి కోట్ల రూపాయలు సంపాదించినట్లు తెలిపాడు. అనంతరం నటి శృతితో పీటర్‌కు పరిచయం ఏర్పడి మదురవాయల్‌లో కాపురం పెట్టారు. ఈ క్రమంలో పీటర్‌కు మరికొంతమంది యువతులతో పరిచయం ఏర్పడింది. దాంతో పీటర్, శృతిల మధ్య విభేదాలు వచ్చాయి.

పీటర్‌కు చెందిన కోట్ల రూపాయలు దక్కించుకోవాలని శృతి పథకం వేసింది. దీనికి శృతి తమను ఆశ్రయించినట్లు జాన్ ప్రిన్సెస్ తెలిపాడు. తాముకూడా పీటర్ వల్ల నష్టపోవడంతో అతన్ని కిడ్నాప్ చేసి  పాలులో విషం కలిపి ఇచ్చి తరువాత విషం కలిపిన ఇంజెక్షన్ వేసినట్లు వెల్లడించాడు. అనంతరం అతని గొంతును నైలాన్ దారంతో బిగించి హత్య చేశామన్నాడు. ఆ తర్వాత ఉమాచంద్రన్, ఆన్‌స్టడ్ రాజ్‌ సాయంతో పీటర్ మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి ఆశీర్వాదం అనే ప్రాంతంలో పాతి పెట్టినట్టు తెలిపాడు. కాగా ఈ కేసులో పరారీలో వున్న ఉమాచంద్రన్, నటి శృతి చంద్రలేఖ, నిర్మల తదితరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement
Advertisement