Sakshi News home page

15 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై

Published Sun, Apr 6 2014 12:45 AM

15 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై - Sakshi

భండారా: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ సుమారు 15 సంవత్సరాల తర్వాత కలిసి ఒకే వేదికను పంచుకున్నారు. సోనియా విదేశీయురాలని నిరసిస్తూ 1998లో కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన శరద్ పవార్ ఇటీవల కాలంలో ఎన్నికల పుణ్యమా అని ఆమెకు మరింత చేరువయ్యారు.
 
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థులను గెలిపించాలని రెండు పార్టీలు సంయుక్తంగా భండారా జిల్లా లక్నిలో చేపట్టిన ర్యాలీలో వారు పాల్గొన్నారు. మావోయిస్టుల ప్రాబల్యమున్న భండారా జిల్లాలో ఎన్సీపీ అభ్యర్థి ప్రఫుల్ పటేల్‌కు మద్దతుగా కాంగ్రెస్‌లు సంయుక్తంగా నిర్వహించిన ప్రచార ర్యాలీలో సోనియా, పవార్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీగా హాజరైన జనాన్ని ఉద్దేశించి సోనియా మాట్లాడుతూ గత పదేళ్లలో యూపీఏ అమలుచేసిన పథకాలను వివరించారు.
 
ఎప్పుడు వ్యవసాయ రంగానికి అండగా నిలబడ్డామని తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతంగానికి సహాయం కూడా అందించామని గుర్తు చేశారు. మావోయిస్టు ప్రాబల్యమున్న ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి పథకాలను అమలుచేయడం ద్వారా యువత హింసవైపు దృష్టి సారించకుండా చూస్తున్నామన్నారు. ఆహార భద్రతా బిల్లు తరహాలోనే ఆరోగ్య భద్రతా బిల్లును తేవాలనుకుంటున్నామని తెలిపారు.
 
తాము సాధించిన అభివృద్ధిని ప్రతిపక్షం చూడలేకపోతుందని విమర్శించారు. అనంతరం పవార్ మాట్లాడుతూ...బీజేపీ నేత నరేంద్ర మోడీ ప్రధాని పదవిని అందుకోవాలని అతృతతో ఉన్నారని మండిపడ్డారు. అన్ని విధాలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిని గెలిపించాలన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement