జయకు ప్రశంసల జల్లు | Sakshi
Sakshi News home page

జయకు ప్రశంసల జల్లు

Published Thu, Jul 3 2014 12:25 AM

జయకు ప్రశంసల జల్లు

సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలితపై ఆ పార్టీ ప్రశంసల జల్లు కురిపించింది. తీర్మానాల రూపంలో అభినందనల్ని ఆ పార్టీ కార్యవర్గం తెలిపింది. రాయపేటలోకి పార్టీ కార్యాలయానికి వచ్చిన జయలలితకు బ్రహ్మరథం పట్టారు. రాష్ట్ర కార్యవర్గంలో జాతీయ, రాష్ట్ర స్థాయి అంశాలు, పార్టీ పరంగా కీలక అంశాలపై చర్చించారు. అన్నాడీఎంకే రాష్ర్ట స్థాయి కార్యవర్గం సమావేశం బుధవారం సాయంత్రం రాయపేటలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశం నిమిత్తం పోయెస్ గార్డెన్ నుంచి బయలుదేరిన జయలలితకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
 
 సమావేశ మందిరంలోకి వచ్చిన జయలలితకు పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, సీనియర్ నేత ఓ పన్నీరు సెల్వం ఆహ్వానం పలికారు. ఈ సమావేశంలో 331 మంది రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు 28 మంది ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు. ఆహ్వానితుల్లో డీఎండీకే నుంచి ఇటీవల బయటకు వచ్చిన బన్రూటి రామచంద్రన్, డీఎంకే మాజీ ఎంపీ జేకే రితీష్, మాజీ డీజీపీ ఆర్ నటరాజ్ తదితరులు ఉండడం విశేషం. అనంతరం సమావేశంలో  తొమ్మిది తీర్మానాలు ప్రవేశ పెట్టారు. ఎనిమిది తీర్మానాల రూపంలో జయలలితను అభినందనలతో ముంచెత్తారు. లోక్‌సభ ఎన్నికల్లో 37 స్థానాలు చేజిక్కించుకోవడంలో జయలలిత చేసిన కృష్టి, కార్యకర్తలు, నాయకులు అందించిన సహకారాన్ని వివరిస్తూ ప్రత్యేక ప్రశంసలు కురిపించారు.
 
 ముల్లై పెరియార్ డ్యాం వ్యవహారం, అమ్మ క్యాంటీన్ల విస్తరణ, అమ్మ ఉప్పు, అమ్మ మెడికల్స్ ఏర్పాటును వివరిస్తూ అభినందనలు తెలిపారు. అలాగే ముల్లై పెరియార్ వ్యవహారంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. పేద, మధ్య తరగతి వర్గాల మీద భారాన్ని వేసే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపనగా తొమ్మిదో తీర్మానం చేయడం విశేషం.మౌళి వాకం మృతులకు సంతాపం:ఈ సమావేశంలో ముం దుగా నటి అంజలీ దేవి మృతికి సంతాపం తెలియజేశారు. అలాగే కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండేతో పాటుగా పలు ప్రాంతాల్లో ఆర్మీ సేవల్లో అశువులు బాసిన తమిళ వీర జవాన్లకు నివాళులర్పించారు. పార్టీకి సేవల్ని అందించి మరణిం చిన 137 మంది నాయకులు, కార్యకర్తలకు సంతాపం తెలి పారు. మౌళివాకం ప్రమాదంలో మరణించిన వారికి నివాళులర్పిస్తూ, వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.
 
 కీలక అంశాలపై చర్చ : పార్టీ పరంగా కీలక అంశాలపై చర్చ జరిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ మరింత బలం పుంజుకోవడం, పార్టీపరంగా మార్పులు చేర్పులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్రంతో సామరస్య పూర్వకంగా మెలగడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేలా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో మార్పులపై నిర్ణయాలు తీసుకున్న సమాచారంతో నేతల్లో ఆందోళన నెలకొంది. మున్ముందు రోజుల్లో ఎవ్వరిమీద వేటు పడనుందో, ఎవరికి పదవులు దక్కనున్నాయోనన్న ఉత్కంఠ నెలకొనడం గమనార్హం.
 

Advertisement
Advertisement