రసవత్తరంగా.. | Sakshi
Sakshi News home page

రసవత్తరంగా..

Published Fri, Feb 10 2017 2:05 AM

AIADMK legislators are staying in MLA Hostel and free to move

► వేడెక్కిన రాజకీయం
► శశి వర్సెస్‌ పన్నీరు
► అధికారంలో చిక్కేదెవ్వరికో
►  గవర్నర్‌ నిర్ణయం ఎటో

అన్నాడీఎంకేలో అధికార వార్‌ రసవత్తరంగా మారింది. రాజకీయం వేడెక్కడంతో శశి వర్సెస్‌ పన్నీరు మధ్య సమరంలో గెలుపు ఎవరిని వరిస్తుందోనన్న ఎదురుచూపులు పెరిగాయి. ఇన్ చార్జ్‌ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు నిర్ణయం ఎలా ఉంటుందో, అధికార పగ్గాలు ఎవరి చేతికి చిక్కుతాయోనన్న ఉత్కంఠ రెట్టింపు అయింది.

సాక్షి, చెన్నై : అన్నాడిఎంకేలో అపద్దర్మ సీఎం  పన్నీరు సెల్వం  సృష్టించిన అలజడి తాత్కాళిక ప్రధాన కార్యదర్శి  చిన్నమ్మ శశికళకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పోయేస్‌ గార్డెన్  వేదికగా చిన్నమ్మ రాజకీయ చక్రం తిప్పుతున్నా, గ్రీన్  వేస్‌రోడ్డు వేదికగా ఊహించని రీతిలో పన్నీరు ట్విస్టులు ఇస్తుండటం రాజకీయ సమరాన్ని వేడెక్కించి ఉన్నది. మెజారిటీ శాతం  ఎమ్మెల్యేలను చిన్నమ్మ సేన బలవంతంగా తమ క్యాంప్‌లో ఉంచితే, పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్న ప్రిసీడియం చైర్మన్  మదుసూదనన్ ను తన వైపుకు తిప్పుకుని రాజకీయ ఎత్తుగడలో ఓ మెట్టు పైకి పన్నీరు చేరడం గమనార్హం. ఇక,  రెండో రోజు గురువారం  అన్నాడిఎంకేలో    రాజకీయ  పరిణామాలు రసవత్తరంగా సాగాయి. అన్నాడిఎంకేలో వేడెక్కిన  శశి వర్సెస్‌ పన్నీరు సమరంలో రేసు గుర్రంగా అవతరించే వారెవ్వరో అన్న ఉత్కంఠ తప్పడం లేదు.

పన్నీరు ఇంటా మద్దతు జోరు...: తొలి రోజు బుధవారం   పన్నీరుకు మద్దతుగా సింగిల్‌ డిజిట్‌లో ఎమ్మెల్యేలు ముందుకు వచ్చినా, రెండో రోజు ఆ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉండొచ్చన్నభావన సర్వత్రా నెలకొంది.  మన్నార్‌గుడి సేనల నిఘా నీడ నుంచి తప్పించుకుని పలువురు ఎమ్మెల్యేలు  గ్రీన్  వేస్‌ రోడ్డులోని పన్నీరు నివాశంకు వచ్చే అవకాశాలతో అందరి దృష్టి అటు వైపుగా మరలింది. గ్రీన్ సే రోడ్డులో  ఉదయాన్నే హడావుడి పెరిగింది. ఎక్కడికక్కడ భద్రతను సైతం పోలీసులు పెంచారు. పన్నీరుకు మద్దతుగా వివిధ ప్రాంతాల నుంచి వాహనాల్లో నేతలు దూసుకొచ్చారు. వస్తున్న నేతలు ఎ వరోనని ఆత్రూతతో కెమెరాల్లో బంధించేందుకు మీడియా సైతం ఎగబడింది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పలువురు పన్నీరుతో భేటీ అవుతూ వచ్చారు. 

అయితే, చిన్నమ్మ శిబిరానికి గట్టి షాక్‌ ఇచ్చే రీతిలో పన్నీరు వేసిన ఎత్తుగడం పోయేస్‌ గార్డెన్ లో టెన్షన్ వరణాన్ని నింపింది. పార్టీలో కీలక నేతగా ఉన్న ప్రిసీడియం చైర్మన్  మదు సూదనన్  పన్నీరు ఇంటి మెట్లు ఎక్కడంతో రాజకీయం వేడెక్కింది. పార్టీ వర్గాలకు నిత్యం అందుబాటులో ఉండే మదుసూదనన్  రాక పన్నీరు శిబిరంలో బలాన్ని కల్గించినట్టు అయింది.  కాగా, పన్నీరుకు మద్దతుగా నిలిచిన గౌండంపాళయం ఎమ్మెల్యే ఆరు కుట్టిని అభినందిస్తూ ఆయన నియోజకవర్గ ప్రజలు పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం. ఊత్తంకరై మహిళా ఎమ్మెల్యే మనోరంజితం నాగరాజ్‌ను అక్కడి మహిళా లోకం అభినందనలతో ముంచెత్తుతున్నాయి. ఇక, పన్నీరు , మాజీ మంత్రి నత్తం విశ్వనాథన్ ల తనయులు సైతం రంగంలోకి దిగి మద్దతు సేకరణలో నిమగ్నం కావడం ఆహ్వానించ దగ్గ విషయం. పన్నీరుకు మద్దతుగా యువ శక్తి జల్లికట్టు తరహా ఉద్యమాన్ని సాగించే అవకాశాల ప్రచార నేపథ్యంలో మెరీనా తీరం మళ్లీ పోలీసుల భద్రతా వలయంలోకి చేరింది.

పోయేస్‌ గార్డెన్ లోనూ తగ్గని  జోరు :
 పన్నీరు ఇంట మద్దతు జోరు పెరిగినా, పోయేస్‌ గార్డెన్ కు అదే స్థాయిలో మద్దతు హోరెత్తడం గమనార్హం. చిన్నమ్మకు మద్దతుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలి వచ్చే నాయకులు పన్నీరుకు వ్యతిరేకంగా దుమ్మెత్తి పోశారు. చిన్నమ్మ ఫోటోలను చేతబట్టి మద్దతు నినాదాల్ని హోరెత్తించారు. మాజీ మంత్రులు గోకుల ఇందిర, వలర్మతిలు పోయేస్‌ గార్డెన్  ప్రవేశ మార్గం వద్ద మీడియాకు ఎప్పటికప్పుడుసమాచారాల్ని అందిస్తూ వచ్చారు. తమ చిన్నమ్మ  సీఎం పగ్గాలుచేపట్టడం ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గవర్నర్‌ రాకతో  రెట్టింపు ఉత్కంఠ :
 పన్నీరుకు ప్రజా మద్దతు, మాజీల మద్దతు హోరెత్తుతున్నా, మెజారిటీ ఎమ్మెల్యేలు చిన్నమ్మ చేతిలో ఉండటంతో అధికారం చిక్కేదెవ్వరికో అన్న చర్చ రెట్టింపు అయింది. గవర్నర్‌ (ఇన్ ) సీహెచ్‌ విద్యా సాగర్‌ రావు ముంబై నుంచి చెన్నైలో అడుగు పెట్టడంతో రాజకీయ వాతావరణం మరింతగా వేడెక్కింది. రాజ్‌ భవన్  వద్ద హడావుడి పెరిగింది. అపద్దర్మ సీఎం పన్నీరు సెల్వం ఇన్ చార్జ్‌ గవర్నర్‌తో భేటీ కావడం, అంతా మంచే జరుగుతుందని మద్దతు దారులకు భరోసా ఇచ్చే ప్రకటన చేయడంతో ఆ శిబిరంలో మరింతగా జోష్‌...పెరిగి ఉన్నది. ఇక, పన్నీరు తదుపరి చిన్నమ్మ శశికళ గవర్నర్‌తో భేటీ కావడం ప్రభుత్వ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాలతో ఇక, గవర్నర్‌ సిహెచ్‌ విద్యా సాగర్‌రావు మున్ముందు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారోనన్న ఉత్కంఠ   నెలకొని ఉన్నది.  శుక్ర లేదా, శనివారాల్లో అధికారం లక్ష్యంగా సాగుతున్న సమరంలో ఏదేని స్పష్టత వచ్చేనా అన్న ఎదురు చూపుల్లో సర్వత్రా  ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement