Sakshi News home page

నష్టపరిహారం పిటిషన్‌ వేసిన ఐశ్వర్య ధనుష్‌

Published Tue, Aug 22 2017 8:23 AM

నష్టపరిహారం కోరుతూ ఐశ్వర్య ధనుష్‌ పిటిషన్‌

చెన్నై: ఆశ్రమ పాఠశాల వ్యవహారంపై రూ.6 కోట్లు పరువు నష్టం కోరుతూ రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్య ధనుష్‌ సోమవారం చెన్నై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వివరాల్లోకి వెళితే...స్థానిక గిండీ సమీపంలోని రేస్‌ కోర్స్‌ రోడ్డులో రజనీకాంత్‌ ఆశ్రమ పాఠశాలను నడుపుతున్నారు. ఈ పాఠశాల స్థల యజమాని  వెంకటేశ్వర్లు అద్దె ఇవ్వలేదని గత 15న పాఠశాలకు తాళం వేసిన  విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఐశ్వర్య హైకోర్టును ఆశ్రయించారు. నిన్న ఆమె దాఖలు చేసిన పిటిషన్‌లో శ్రీ రాఘవేంద్ర విద్యాసంఘాన్ని 1991లో రిజిస్టర్‌ చేసినట్లు తెలిపారు. ఈ సంఘం ద్వారా ఆశ్రమం పేరుతో వేలచ్చేరి, గిండీ, సైదాపేటలో పాఠశాలలు నడుపుతున్నట్లు పేర్కొన్నారు.

వీటిలో గిండీ రెస్‌కోర్స్‌ రోడ్డులో పాఠశాలను 2005లో స్థల యజమాని వెంకటేశ్వర్లు వద్ద లీజ్‌కు తీసుకుని పాఠశాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో గత మే వరకూ అద్దె చెల్లించినట్లు తెలిపారు. ఈ స్థితిలో ఈ నెల 15న వెంకటేశ్వర్లు ఆశ్రమంలోకి చొరబడి అద్దె ఇవ్వడం లేదంటూ పాఠశాలను మూసివేశారన్నారు. అద్దె చెల్లించని కారణంగా ఆశ్రమ పాఠశాలను తమ ఆధీనంలోకి తీసుకున్నామని మీడియాకు ప్రచారం చేశారని పేర్కొన్నారు.

పాఠశాల లోపలికి హద్దు మీరి ప్రవేశించినందుకు రూ.కోటి, తమ పాఠశాల సంఘం పేరుకు కళంకం కలిగించినందుకు రూ.5 కోట్లు నష్టపరిహారం చెల్లించేలా ఆదేశించాలని, ఇతరులు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించకుండా నిషేధాజ్ఞలు జారీ చేయాలనీ కోరారు.పిటిషన్‌ను స్వీకరించిన న్యాయమూర్తి సీవీ.కార్తీకేయన్‌ మంగళవారం (ఇవాళ) విచారణ జరపనున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్త...: రజనీకాంత్‌ కుటుంబానికి ఎదురుదెబ్బ!

Advertisement

తప్పక చదవండి

Advertisement