రెండునెలల్లో కమల పీఠం | Sakshi
Sakshi News home page

రెండునెలల్లో కమల పీఠం

Published Wed, Jul 12 2017 3:42 AM

రెండునెలల్లో కమల పీఠం - Sakshi

పుదుచ్చేరిపై అమిత్‌షా వ్యూహం
కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు యత్నం

పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పతనం, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. మరో రెండు నెలల్లో కమలనాధుడు అధికార పగ్గాలు చేపట్టడం తథ్యమని ఢిల్లీ వర్గాల సమాచారం.
సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుచ్చేరి రాజకీయం రసకందాయంగా మారింది. అధికారం కోసం బీజేపీ ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే తగిన రీతిలో ఢీకొనేందుకు మాజీ ఐపీఎస్‌ అధికారిణి, బీజేపీ నేత కిరణ్‌బేడీని కేంద్రం లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా నియమించింది.

కేంద్రం ఏ ఉద్దేశ్యంతో పంపిందో దానిని ఆమె అక్షరాల అమలుచేస్తున్నారు.గవర్నర్, సీఎంల నేతృత్వంలో పుదుచ్చేరిలో రెండు తరహా పాలనలు సాగుతున్నాయి.బొటాబొటి బలంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను బలహీనం చేయడం ద్వారా అధికారం చేపట్టాలని కృతనిశ్చయంతో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా తన రాజకీయ చతురతను పణంగా పెట్టారు.

30 మంది ఎమ్మెల్యేలు కలిగిన పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ తన 15 మంది ఎమ్మెల్యేలతో ఇద్దరు డీఎంకే, ఒక స్వతంత్య్ర ఎమ్మెల్యేని కలుపుకుని అధికారంలోకి వచ్చింది.8మంది ఎన్‌ఆర్‌ కాంగ్రెస్, నలుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు బీజేపీ పక్షాన ఉన్నారు. ఇటీవల ముగ్గురిని ఎమ్మెల్యేలుగా బీజేపీ నామినేట్‌ చేసింది. దీంతో ప్రతిపక్ష బలం 15కు చేరుకుంది. ఎమ్మెల్యేలుగా ఉన్నవారు మరే ప్రభుత్వ పదవిలోనూ ఉండకూడదనే నిబంధనను కారణంగా చూపి ఢిల్లీలోని 21 మంది ఆమ్‌ఆద్మీ ఎమ్మెల్యేలను అనర్హులుగా చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.

ఇదే నిబంధనను పుదుచ్చేరిలో కూడా అమలుచేసి 9 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను అనర్హులుగా చేయాలనేది అమిత్‌షా వ్యూహంగా ఉంది.పనిలోపనిగా కాంగ్రెస్‌లోని కొందరు అసంతృప్తి ఎమ్మెల్యేలపై ఆకర్‌‡్ష మంత్రం ప్రయోగించాలని, ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎన్‌.రంగస్వామిని బీజేపీలోకి చేర్చుకోవడం ఎత్తుగడగా ఉంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ తరపున ముఖ్యమంత్రిగా ఉండిన బీమాఖండ్‌ తన మద్దతుదారులతో బీజేపీలో చేరిపోయి సీఎంగా కొనసాగుతున్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు, స్వాతంత్య్ర దినోత్సవం ముగియగానే  పుదుచ్చేరిలో సైతం ఇదే ప్రయోగాన్ని అమలు చేయాలని బీజేపీ భావిస్తోంది.           

ఢిల్లీలో ప్రత్యర్థుల మకాం
పుదుచ్చేరిలోని కాంగ్రెస్, డీఎంకే కూటమి ప్రభుత్వాన్ని కబళించేందుకే నామినేషన్‌ పద్ధతిలో ముగ్గురిని ఎమ్మెల్యేలుగా నియమించిందని బీజేపీపై విమర్శలు వచ్చాయి. ఎమ్మెల్యేలను ఏకపక్ష ధోరణిలో ఎంపిక చేశారని కాంగ్రెస్‌ తప్పుపట్టగా, వారిచేత పదవీ ప్రమాణం చేయించేందుకు స్పీకర్‌ నిరాకరించారు. దీంతో గవర్నర్‌ కిరణ్‌బేడీ ఆ ముగ్గురిని రాజ్‌భవన్‌కు రప్పించుకుని మమ అనిపించారు.

గవర్నర్‌ చేయించిన ప్రమాణం చెల్లదని ఆక్షేపించిన స్పీకర్‌ వారిని అసెంబ్లీలోకి అనుమతించబోమని స్పష్టంచేశారు. నామినేటెడ్‌ ఎమ్మెల్యేల వ్యవహారం ఇరుపక్షాలకూ ప్రతిష్టాత్మకంగా మారడంతో గవర్నర్‌ కిరణ్‌బేడీ సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రపతి, హోంమంత్రి, కేంద్ర హోంశాఖను కిరణ్‌బేడీ కలవనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలుసుకున్న స్పీకర్‌ వైద్యలింగం సైతం నామినేటెడ్‌ ఎమ్మెల్యేల వివాదంపై తాడోపేడో తేల్చుకునేందుకు సోమవారం రాత్రి ఢిల్లీ విమానం ఎక్కేశారు. పుదుచ్చేరి రాజకీయాల్లోని ఇద్దరు ప్రత్యర్థులు ఢిల్లీ ఒకేసారి మకాం వేయడం రాష్ట్రంలో రసవత్తరమైన చర్చకు దారితీసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement