నేషనల్ ఉమెన్ పార్లమెంట్పై స్పీకర్ సమీక్ష | Sakshi
Sakshi News home page

నేషనల్ ఉమెన్ పార్లమెంట్పై స్పీకర్ సమీక్ష

Published Wed, Oct 19 2016 8:10 PM

నేషనల్ ఉమెన్ పార్లమెంట్పై స్పీకర్ సమీక్ష - Sakshi

- హాజరైన ఎంఐటీ ప్రతినిధులు
 
అమరావతి : నేషనల్ ఉమెన్ పార్లమెంట్ నిర్వహణపై అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బుధవారం చర్చించారు. విజయవాడలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి చర్చా వేదికలో అమరావతి వేదికగా సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. ఎంఐటీ ప్రతినిధి రాహుల్ కరాడ్, స్పెషల్ ఆఫీసర్ రామలక్ష్మిలు చర్చలో పాల్గొన్నారు. 
 
పూనేలోని ఎంఐటీ స్కూల్‌ ఆఫ్ గవర్నమెంట్ మొత్తం కార్యక్రమాన్ని సమన్వయపరుస్తుంది. 110 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సభల్లో దేశవ్యాప్తంగా మహిళా పార్లమెంటు, శాసనసభ సభ్యులు పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల మంది విద్యార్థినులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. మూడు రోజుల వసతి, ఇతర అంశాలపై విజయవాడ మునిసిపల్ కమిషనర్ వీరపాండ్యన్, బస్ కలెక్టర్ లక్ష్మీషాలతో సభాపతి కోడెల చర్చించారు. యునెస్కో కూడా ఈ సదస్సులో భాగస్వామి కాబోతున్నది. మహిళా పార్లమెంటేరియన్లు, వివిధ రంగాల్లో నిష్నాతులైన మహిళా ప్రముఖులను కూడా స్పీకర్ ఆహ్వానిస్తారు.
 
కామన్‌వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్, భారతీయ ఛాత్ర సంసాద్ పౌండేషన్, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్‌ల సహకారంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ సమావేశాలు నిర్వహిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం కీలక భాగస్వామి కానుంది. ఇప్పటి వరకు సిద్ధం చేసిన తాత్కాలిక కార్యాచరణను అనుసరించి ‘మహిళా ప్రోత్సాహం- ప్రజాస్వామ్యం పటిష్టత’ అనే అంశంపై మూడు రోజులు మహాసభలు జరగనున్నాయి. విభిన్న అంశాలు కూడా ఈ సభల్లో చర్చకు రానున్నాయి. తొలిరోజు ‘మహిళా సాధికారిత-రాజకీయ సవాళ్ళు, వ్యక్తిత్వ నిర్మాణం, భవిష్యత్ దార్శనికత, గురుశిశ్యుల సంబంధాలు’ అన్న అంశాలపై చర్చ జరుగుతుంది. రెండో రోజు ‘మహిళల స్థితి-నిర్ణయాత్మక శక్తి, మీకు మీరే సాటి’ అనే అంశంపై ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయి. మూడో రోజు మహిళా సాధికారిత కోసం పరుగు నిర్వహిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం సాంస్కతిక కార్యక్రమాలు ఉంటాయి. 
 
ఈ కమిటీకి ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ను చైర్మన్‌గా నియమించాలని సభాపతి నిర్ణయించారు. కార్యక్రమం విజయవంతానికి తగిన సమయం కావాలని ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ప్రతినిధులు డాక్టర్ కోడెలకు విజ్ఞప్తి చేశారు. సమావేశాలకు చైర్మన్‌గా స్పీకర్, చీఫ్ ప్యాట్రన్‌గా సీఎం చంద్రబాబునాయుడు వ్యవహరించనున్నారు. ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ పేరుతో ప్రజాపాలన రంగంలో శిక్షణను ఇచ్చే విద్యా సంస్థ కూడా ఇందులో ఉంది. మహారాష్ట్రలో రాహుల్‌కు చెందిన గ్రూప్ 79 విద్యాసంస్థలను నిర్వహిస్తున్నది. స్పీకర్ నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం ఘాట్ వద్ద సభలు నిర్వహిస్తే బాగుంటుందనే నిర్ణయానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement