ముసలం మొదలు | Sakshi
Sakshi News home page

ముసలం మొదలు

Published Sun, May 24 2015 5:54 AM

AS Patil, Congress leader to fall back on

- 35 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది
- వెనక్కు తగ్గని కాంగ్రెస్ నేత ఏఎస్ పాటిల్
సాక్షి, బెంగళూరు :
దేవర హిప్పర్గి నియోజకవర్గ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత ఏఎస్ పాటిల్ నాడహళ్లి వెనక్కు తగ్గడం లేదు. తన అడుగుజాడల్లో నడవడానికి ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన 35 మంది శాసనసభ్యులు సిద్ధంగా ఉన్నారని రాజకీయ బాంబు పేల్చారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు స్వపక్ష పాలనా విధానంపై నాడహళ్లి బహిరంగ విమర్శలు చేశారు. దీంతో ఆయన్ను సీఎల్పీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయన్ను ఏకంగా కాంగ్రెస్ పార్టీ నుంచే తొలగించడానికి కేపీసీసీ అధ్యక్షుడు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు వెలువుడుతున్నాయి. ఈ క్రమంలో నాడహళ్లి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

బీదర్‌లో స్థానిక మీడియా ప్రతినిధులతో ఆయన శనివారం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర కర్ణాటక ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో ప్రకటించిన ఎటువంటి సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఇప్పటి వరకూ ఉత్తర కర్ణాటక ప్రాంతంలో అమలు కాలేదన్నారు. ‘‘సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కావడానికి ఉత్తర కర్ణాటక భాగంలోని 65 మంది ఎమ్మెల్యేలు కారణం. నన్ను సీఎల్పీ నుంచి బహిష్కరించినా నాకు 35 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఈ విషయాన్ని ఆయనతోపాటు కేపీసీసీ గుర్తిస్తే మంచిది’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి జరుగుతున్న అక్రమాలపై ప్రజలను జాగృతం చేస్తానని నాడహళ్లి స్పష్టం చేశారు. 

Advertisement
Advertisement