ఢిల్లీతో సామరస్యంగా.. | Sakshi
Sakshi News home page

ఢిల్లీతో సామరస్యంగా..

Published Wed, May 3 2017 2:27 AM

ఢిల్లీతో సామరస్యంగా..

► పళని సర్కారు నిర్ణయం
►  కేంద్రాన్ని విమర్శించ వద్దు
►  కేబినెట్‌లో మంత్రులకు సీఎం హితవు
►  రెండో వారంలో అసెంబ్లీ
► శాఖల వారీగా సమీక్షల వేగం


ఢిల్లీ పెద్దలతో సామరస్యంగా ముందుకు సాగేందుకు సీఎం కే పళనిస్వామి ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రాన్ని విమర్శించే విధంగా వ్యాఖ్యల తూటాల్ని పేల్చవద్దని మంత్రులకు సీఎం ఉపదేశించారు. మంగళవారం జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో ఢిల్లీతో సన్నిహితంగా మెలిగేందుకు తగ్గ చర్చ సాగించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అసెంబ్లీని ఈనెల రెండో వారంలో సమావేశ పరిచేందుకు నిర్ణయించారు. సమీక్షల వేగం పెంచనున్నారు.

సాక్షి, చెన్నై : అమ్మ జయలలిత మరణం తదుపరి చోటు చేసుకున్న పరిణామాలతో ఏ మూహూర్తాన సీఎంగా ఎడపాడి కే పళని స్వామి పగ్గాలు చేపట్టారో అన్నీ అడ్డంకుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. పాలనాపరంగా అడ్డంకులు, నిధుల కేటాయింపుల్లో చిన్న చూపులు ఓ వైపు , ఐటీ దాడులు, అన్నాడీఎంకే వర్గాల మీద కేసుల మోత మరో వైపు,  మాజీ సీఎం పన్నీరు సెల్వం రూపంలో చిక్కులు ఇంకో వైపు వెరసి ఉక్కిరి బిక్కిరి కాక తప్పలేదు. ఈ వ్యవహారాలన్నీ కమలం కనుసనల్లో సాగుతున్నట్టు సంకేతాలే కాదు, ప్రచారం సైతం ఊపందుకుంది.

గత వారం నీతిఅయోగ్‌ సదస్సుకు వెళ్లిన సీఎంకు అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దర్శనం కూడా దక్కలేదని చెప్పవచ్చు. తమకు వ్యతిరేకంగా కేంద్రం అడుగులు వేస్తుండటాన్ని పరిగణించి, ఇక, తామే సామరస్యంగా వారితో మెలిగేందుకు సిఎం నిర్ణయించడం గమనార్హం. ఢిల్లీ పెద్దల ఆగ్రహానికి గురి కాకుండా, వారి మెప్పు పొంది పాలనను సజావుగా సాగించుకునేందుకు సిద్ధమైనట్టున్నారు. ఇందుకు అద్దం పట్టే రీతిలో కెబినెట్‌ మీటింగ్‌లో సీఎం ప్రస్తావన సాగినట్టు సంకేతాలు వెలువడ్డాయి.

ఢిల్లీతో సామరస్యంగా : మూడు రోజులుగా సొంత జిల్లా సేలంలో తిష్ట వేసిన సీఎం, ఆగమేఘాలపై కెబినెట్‌ మీటింగ్‌కు పిలుపు నిస్తూ సోమవారం ప్రకటన చేశారు. దీంతో సొంత జిల్లాల్లో ఉన్న మంత్రులందరూ చెన్నై బాట పట్టారు. మంగళవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో మంత్రి వర్గం సమావేశం అయింది. సిఎం ఎడపాడి పళని స్వామి నేతృత్వంలో జరిగిన సమావేశానికి మంత్రులు అందరూ హాజరు అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, హోం శాఖ కార్యదర్శి నిరంజన్‌ మర్టిన్‌లు ఈ భేటిలో ఉన్నారు.

రాష్ట్రంలో పాలనను విస్తృతం చేయడం, పథకాలకు నిధుల్ని రాబట్టడం, ఢిల్లీని «ధిక్కరించకుండా సామరస్యంగా ముందుకు సాగడం గురించి చర్చించినట్టు తెలిసింది. పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయని, ఇక, కేంద్రాన్ని విమర్శించే విధంగా ఏ ఒక్కరూ వ్యాఖ్యలు చేయవద్దని సిఎం ఆదేశాలు ఇచ్చిన సమాచారం బయటకు పొక్కడం గమనార్హం.  కేంద్ర పథకాల విస్తృతంతో  ఢిల్లీలోని పెద్దల మెప్పుతో , వారితో సన్నిహితంగా మెలిగడం, వారికి అనుగుణంగా నడుచుకునే  విధంగా ముందుకు సాగుతూ ప్రభుత్వాన్ని మరో నాలుగేళ్లు నడిపించుకుందామన్న సూచనను మంత్రులకు  ఇచ్చినట్టు తెలిసింది.

అసెంబ్లీకి కసరత్తు : గత నెల అసెంబ్లీలో బడ్జెట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, శాఖల వారీగా నిధుల కేటాయింపులు, సమీక్షలు సాగ లేదు. దీంతో ఈనెల రెండో వారం అసెంబ్లీని సమావేశ పరిచి, నిధుల కేటాయింపులు, చర్చలకు తగ్గ కసరత్తులకు  కెబినెట్‌మీటింగ్‌లో నిర్ణయించి ఉన్నారు.

అలాగే, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ, గుర్తింపు లేని ఇంటి స్థలాల వ్యవహారం, ఆగిన రిజిస్ట్రేషన్ల పర్వం, మూత పడ్డ టాస్మాక్‌లకు ప్రత్యామ్నాయంగా ప్రైవేటుకు అప్పగింత, అగ్ని నక్షత్రం ఆరంభం, తాగు నీటి ఎద్దడి, నీట్‌ , కరువు పరిస్థితులు, రైతులకు సాయం, తగ్గని ఆదాయాన్ని పెంచుకోవడం లక్ష్యంగా కొత్త కార్యచరణ తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక, ఆయా శాఖల వారీగా సమీక్షలు విసృతం చేయడంతో పాటుగా సభలో ప్రధాన ప్రతి పక్షాన్ని ఢీ కొట్టేందుకు మంత్రులు అన్ని ఆధారాలు, లెక్కలతో సహా సిద్ధంగా ఉండాలన్న ఆదేశాల్ని సీఎం ఇచ్చి ఉండటం గమనార్హం.

Advertisement

తప్పక చదవండి

Advertisement