ఏటీఎం క్యాష్ డిపాజిట్ కంపెనీలకు మార్గదర్శకాలు | Sakshi
Sakshi News home page

ఏటీఎం క్యాష్ డిపాజిట్ కంపెనీలకు మార్గదర్శకాలు

Published Tue, Apr 21 2015 10:48 PM

ATM Cash Deposit guidelines for companies

జారీ చేసిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలని హెచ్చరిక

 
సాక్షి, ముంబై : ఏటీఎం కేంద్రాలకు డబ్బులు తరలించే కంపెనీలకు, ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలకు అసిస్టెంట్ పోలీసు కమిషనర్ అతుల్ చంద్ర కులకర్ణి కొన్ని మార్గదర్శక సూచనలు జారీ చేశారు. వాటిని అమలు చేయని సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేటి పోటీ ప్రపంచంలో ఖాతాదారులను అకట్టుకునేందుకు బ్యాంకులు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నాయి. అందులో ఏటీఎం సౌకర్యం ప్రధానమైనది. అయితే నగరంలోని అనేక సొసైటీ, బహుళ అంతస్తుల భవనాలు, ఫుట్‌పాత్‌లపై ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వాటిని ఏర్పాటు చేస్తున్నారు.

వాటిలో డబ్బు నింపే బాధ్యతను ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలు, కంపెనీలు స్వీకరించాయి. కాని బ్యాంకు నుంచి డబ్బు తీసుకెళ్లే వ్యాన్లు మార్గమధ్యలో లేదా ఏటీఎం సెంటర్ వద్ద దోపిడీకి గురవుతున్నాయి. అత్యధిక శాతం చోరీ కేసుల్లో ఆ కంపెనీల సిబ్బంది హస్తమున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఇలాంటి సంఘటనలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని అసిస్టెంట్ పోలీసు కమిషనర్ (నేర శాఖ) అతుల్ చంద్ర కులకర్ణి నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఏటీఎంలలో నగదు అమర్చే సంస్థలతో సమావేశం నిర్వహించారు. 37 సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్యాష్ వ్యాన్లలో నగదు తరలించే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? వాహనాల్లో ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచాలి..? అందులో పనిచేసే సిబ్బందికి సబంధించిన వివరాలు తదితర అంశాలపై ఆయన మార్గదర్శకాలు జారీ చేశారు.

అవేంటంటే..
ప్రతి సిబ్బంది పూర్తి వివరాలను కంపెనీ సేకరించాలి.
సిబ్బందికి గతంలో నేర చరిత్ర ఉందేమో పరిశీలించాలి.
ప్రతీ క్యాష్ వ్యాన్‌లో జీపీఎస్ సేవలతోపాటు సీసీ టీవీ కెమెరాలు అమర్చుకోవాలి.
నగదు చేరవేసే వాహనం పూర్తి వివరాలు ఉండాలి.
సిబ్బంది గుర్తింపు కార్డు, ఫొటో క్యాష్ వాహనంలో ఉంచాలి.
ఏటీఎంలో నగదు జమ చేసే సమయంలో ఎంతమంది బయట ఉండాలి...? ఎంత మంది లోపల ఉండాలనేది ముందుగానే ప్రణాళిక రూపొందించుకోవాలి.
క్యాష్ వ్యాన్‌లో పనిచేసే సిబ్బందిని స్వయంగా కంపెనీలే నియమించుకోవాలి.
క్యాష్ వాహనం ఏ రూట్లో వెళుతుందనే వివరాలు గోప్యంగా ఉంచాలి.

Advertisement
Advertisement