తీరని విషాదం | Sakshi
Sakshi News home page

తీరని విషాదం

Published Fri, Jun 23 2017 3:28 AM

తీరని విషాదం - Sakshi

జర్మనీలోని హ్యాంబర్గ్‌లో బాగల్‌కోట విద్యార్థి ఆత్మహత్య!
గత ఆదివారం అదృశ్యం
స్థానిక నది పక్కన పాదరక్షలు, లేఖ
కుటుంబానికి జర్మనీ అధికారుల వర్తమానం


బాగల్‌కోటకు చెందిన మంజునాథ్‌ చూరి ఉన్నత చదువులు చదివి గొప్ప స్థానం అందుకోవాలని అతని కుటుంబం కలలుకంది.  అందుకు తగినట్లుగానే చేస్తున్న ఐటీ ఉద్యోగం వదిలి జర్మనీలోని హ్యాంబర్గ్‌ వెళ్లి  ఇంజినీరింగ్‌లో ఎంఎస్‌ కోర్సు చేరాడు. కానీ విధి వక్రించింది. ఏం జరిగిందో కానీ గత ఆదివారం హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. అతని కోసం గాలిస్తున్నట్లు జర్మనీ కాన్సులేట్‌ విద్యార్థి కుటుంబానికి తెలిపింది. ఈలోగా గురువారం సాయంత్రం పిడుగులాంటి వార్త వచ్చింది. అతడు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని, ఆచూకీ కోసం గాలిస్తున్నామని స్థానిక ఎంపీకి సమాచారమిచ్చారు. ఇటీవలే భర్తను కోల్పోయి విలపిస్తున్న తల్లి మహానంది తనయుడికి ఇలా జరిగిందని తెలిసి తల్లడిల్లిపోతోంది.

సాక్షి, బెంగళూరు: ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లిన బాగల్‌కోటె తాలూకా సేమికేరి గ్రామ విద్యార్థి అనుమానాస్పద పరిస్థితుల్లో అదృశ్యం కావడం, ఆ తరువాత ఆత్మహత్య చేసుకున్నట్లు తేలడం కలకలం రేపుతోంది. అతని చెప్పులు, సైకిల్, అతను కన్నడలో రాసిన లేఖ హ్యాంబర్గ్‌ నది పక్కన దొరకడంతో కుటుంబంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. హ్యాంబర్గ్‌ విశ్వ విద్యాలయంలో ఎంఎస్‌ చదువుతున్న మంజునాథ్‌ చూరి (27) ఆదివారం నుంచి కనిపించడం లేదు. అతని కోసం జర్మనీ పోలీసులు గాలింపు చేపట్టారు.

విషయాన్ని జర్మనీ రాయబార కార్యాలయం ద్వారా బాగలకోటె జిల్లాలో ఉన్న అతని తల్లి మహానందికి తెలియజేశారు. దీంతో అప్పటినుంచీ ఆమె కన్నీరు మున్నీరు అవుతోంది. హ్యాంబర్గ్‌లోని అపార్ట్‌మెంటులో నివాసం ఉంటున్న  మంజునాథ్‌ అదృశ్యం కావడం, అక్కడ కన్నడలో రాసిన లేఖ లభించడంతో ఈ విషయాన్ని పోలీసులు అతని స్నేహితుడు అనిష్‌దేశ్‌ పాండేకు మొబైల్‌లో మెసె‹జ్‌ పంపించారు.  మంజునాథ్‌ మొబైల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయి ఉంది. అనిష్‌ విశ్వవిద్యాలయం పరిపాలన మండలికి తెలిపారు. అక్కడి పోలీసులు భారతదేశం జర్మనీ కాన్సులేట్‌కు సమాచారం అందజేశారు.

నా కొడుకును తెచ్చివ్వండి
తమ కుమారుడు ఎక్కడఉన్నా తీసుకొచ్చి ఇవ్వాలని మంజునాథ్‌ చూరి తల్లి మహానంది బోరున విలపిస్తుండడంతో బంధుమిత్రుల కళ్ళల్లో సైతం నీళ్ళు తిరుగుతున్నాయి. మహానంది జిల్లా ఎస్పీ రిశ్వంత్‌ను కలిసి తమ కుమారుని ఆచూకీ కనిపెట్టాలని మొరపెట్టుకున్నారు. ఎస్పీ రిశ్వంత్‌ మాట్లాడుతూ తాము కూడా ఇక్కడి నుంచి జర్మనీలోని  హ్యాంబర్గ్‌ పోలీసులతో చర్చిస్తున్నామని, మంజునాథ్‌చూరిని వెతకడం కోసం వారు అన్ని చర్యలను తీసుకుంటున్నారని అన్నారు.

రెండేళ్ల కిందట జర్మనీ పయనం
 4 సంవత్సరాల క్రితం బాగలకోటెలో బీవీవీ సంఘం బసవేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాల్లో చదివిన మంజునాథ్‌ బెంగళూరులోని మైండ్‌ట్రీ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. అనంతరం దేవరాజు అరసు వెనుకబడిన వర్గాల అభివృద్ధి మండలి సహకారంతో ఆర్థిక సాయం పొంది ఉన్నత చదువుల కోసం 2015లో జర్మనీకి వెళ్లాడు. ఇటీవలే తండ్రి సిద్దన్నచూరి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అప్పుడు వచ్చి వెళ్లాడు. అప్పుడు తండ్రి మరణంపై తీవ్రంగా బాధపడ్డాడు.

ఆత్మహత్య చేసుకున్నాడు
– ఎంపీ గద్దిగౌడ
మంజునాథ్‌చూరి హ్యాంబర్గ్‌ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు భారత రాయబార అధికారుల నుంచి సమాచారం అందిందని బాగలకోటె ఎంపీ గద్దిగౌడ వెల్లడించారు. గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 18వ తేది నుంచి కనిపించకుండాపోయిన మంజునాథ్‌ హ్యాంబర్గ్‌ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని, అతని ఆచూకీ కోసం స్థానిక పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. నదిలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో గాలింపు నిల్చిపోయిందని, నదిలో నీరు తగ్గిన చేపడతారని సమాచారం పంపారన్నారు. మంజునాథ్‌ ఆత్మహత్య సంగతి తెలిసి తల్లితో పాటు బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.  
 

Advertisement
Advertisement