‘బీప్’ తొలగించడానికి యూట్యూబ్ నిరాకరణ | Sakshi
Sakshi News home page

‘బీప్’ తొలగించడానికి యూట్యూబ్ నిరాకరణ

Published Sun, Dec 27 2015 2:14 AM

‘బీప్’ తొలగించడానికి యూట్యూబ్ నిరాకరణ

తమిళసినిమా: తమిళనాడునే ఊపేస్తున్న శింబు బీప్ పాటను యూ ట్యూబ్ నుంచి తొలగించడానికి ఆ సంస్థ నిర్వాహకులు నిరాకరించడంతో సమస్య మరింత జఠిలంగా మారింది. బీప్ సాంగ్ గత 11వ తేదీ నుంచి వాట్సాప్,ఫేస్‌బుక్, ఇంటర్నెట్,యూట్యూబ్ అంటూ హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే 10 లక్షల మంది ఈ పాటను లైక్ చేశారు.

 దీంతో శింబు బీప్ పాటకు సంబంధించిన వివాదానికి త్వరగా పుల్‌స్టాప్ పెట్టాలని భావించిన నగర నేరపరిశోధన శాఖ అధికారులు ఆ సాంగ్‌ను యూట్యూబ్ నుంచి తొలగించే చర్యలు చేపట్టాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.  దీంతో పోలీసులు ఆగమేఘాలపై యూట్యూబ్ అధికారులను కలిసి శింబు సాంగ్‌ను నిలిపివేయాల్సిందిగా కోరారు.అయితే ఆ సాంగ్ అర్థం ఏమిటో ఆంగ్లంలో తర్జుమా చేసి తమకు వివరించాల్సిందిగా యూట్యూబ్ నిర్వాహకులు పోలీసులకు చెప్పారు.

 దీంతో అతి కష్టం మీద అరకొర అర్థాలతో బీప్ సాంగ్‌ను పోలీసులు ఆంగ్లంలోకి అనువదించి చెప్పగా అందులో పెద్దగా తప్పు పట్టాల్సిన విషయం ఏమీ లేదని యూట్యూబ్ నిర్వాహకులు తేల్సి చెప్పడంతో పోలీసులు కంగు తిన్నారు. దీంతో అసలు ఇంతగా కలకలం సృష్టిస్తున్న ఆ పాట యూట్యూబ్‌లోకి ఎలా వచ్చింది? దీనికి కారకులెవరు?అన్న విషయాలపై పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం.

Advertisement
Advertisement