పౌర కార్మికులకు బయోమెట్రిక్ హాజరు | Sakshi
Sakshi News home page

పౌర కార్మికులకు బయోమెట్రిక్ హాజరు

Published Mon, Sep 14 2015 1:55 AM

పౌర కార్మికులకు బయోమెట్రిక్ హాజరు

కోలారు నగరసభలో అమలు
 
కోలారు : పౌర కార్మికుల అనధికార గైర్హాజరును తప్పించేందుకు కోలారు నగరసభ కార్యాలయంలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ విధానం ద్వారా సమయపాలన, క్రమశిక్షణ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. సుమారు 1.50లక్షల జనాభా ఉన్న కోలారు నగరసభ పరిధిలో 35 వార్డులు ఉన్నాయి. నిత్యమూ 62 టన్నుల చెత్త బయటపడుతోంది. స్వచ్ఛత, డ్రెయినేజీ నిర్వహణకు మొత్తం 193 మంది పౌరకార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 64 మంది శాశ్వత, 84 మంది ఒప్పంద, 32 మంది దినకూలీలు, 13 మంది సమాన వేతనంపై పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు. ఈ 193 మంది కార్మికులలో పది మంది నగరసభలోని వివిధ రకాల వాహనాలకు డ్రైవర్లుగాను, యూజీడీ వాహనాలకు ఐదుగురు, ప్రభుత్వ కార్యాలయాలు, బంగళాల్లో పనిచేసేందుకు ఐదుగురు, ఉద్యానవనాల నిర్వహణకు పది మంది పోగా స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొనేది కేవలం 140 మంది కావడం గమనార్హం. అధికారిక లెక్కల ప్రకారం ఈ 140 మందిలో నిత్యమూ వివిధ కారణాలతో 15 నుంచి 20 మంది సెలవులో వెళుతుంటారు. మరికొందరు అనధికారికంగా గైర్హాజరు అవుతుంటారు. మిగిలిన 90 నుంచి వంద మందితో నగరంలో స్వచ్ఛతా కార్యక్రమాలను చేపడుతుంటారు. విధుల్లో నిర్లక్ష్యం కనబరుస్తూ గైర్హాజరు అవుతున్న వారి సంఖ్య  ఎక్కువ అవుతుండడంతో బయోమెట్రిక్ హాజ రును తప్పనిసరి చేస్తూ నగరసభ అధికారులు చర్యలు తీసుకున్నారు.

మరో పది రోజుల్లో పూ ర్తి స్థాయిలో అమల్లో రానున్న ఈ విధానం వల్ల పౌరకార్మికులు నిత్యం ఉదయం 5.30 నుంచి 5.45 గంటల్లోపు హాజరు సమర్పించాల్సి ఉంది. ఇదే విషయాన్ని నగర సభ అధ్యక్షుడు బి.ఎం.ముబారక్ స్పష్టం చేశారు. ‘నగర సభలో ఇప్పటికే సిబ్బంది, అధికారులకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నాం. పౌరకార్మికులకు ప్రతినెలా 10న వేతనాలు చెల్లిస్తున్నాం. నిత్య మూ వారికి ఉదయమే టిఫన్ ఏర్పాటు చేస్తున్నాం. అయినా వారు అనధికారికంగా విధులకు డుమ్మా కొడుతుండడంతో పారిశుద్ధ్య పనులకు ఆటంకం కలుగుతోంది. ఈ సమస్య నివారణకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని పౌరకార్మిలకూ అమలు చేయాలని భావించాం’ అని కోలారు నగరసభ కమిషనర్ లక్ష్మినారాయణ తెలిపారు.
 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement