అందరూ అందరే.. | Sakshi
Sakshi News home page

అందరూ అందరే..

Published Tue, Aug 5 2014 10:05 PM

అందరూ అందరే.. - Sakshi

అసెంబ్లీని రద్దుచేసి మళ్లీ ఎన్నికలు జరపాలనే డిమాండ్ పెరుగుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలదాడిని విస్తృతం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఒకరు మరొకరితో ములాఖత్ అవుతున్నారని ఆరోపిస్తున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతోందో సామాన్యుడికి ఏమాత్రం అర్థం కావడంలేదు..
 
 న్యూఢిల్లీ: ఆమ్‌ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆప్, కాంగ్రెస్ పార్టీలు తోడుదొంగలని ఆరోపించారు. ఆప్ గతంలో కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. వారిద్దరూ పాత స్నేహితులు. అధికారం కోసం ఆ రెండు పార్టీలూ తమపై పుకార్లు సృష్టించి బురదజల్లేందుకు యత్నిస్తున్నాయి. మేం మొదటినుంచి ఒకే మాట మీద ఉన్నాం.. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడ్డాం..’ అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ యత్నిస్తోందని సోమవారం కాంగ్రెస్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
 
 ఆప్‌లో చీలిక తెచ్చి, ఆ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఆరోపించారు. దీనిపై ఉపాధ్యాయ్ స్పందిస్తూ..‘ఆ రెండుపార్టీల ఎత్తుగడలు అందరికీ తెలిసిందే. కాంగ్రెస్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు చేరుతున్నారని ఆప్ ఇంతకుముందు విమర్శిస్తే, ఇప్పుడు ఆప్ ఎమ్మెల్యేలు చేరుతున్నారని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.. దీన్ని బట్టి వారిద్దరి మధ్య ఉన్న  సంబంధాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు..’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను జరిపేందుకు బీజేపీ, లెఫ్టినెంట్ జనరల్ భయపడుతున్నారని ఆదివారం జరిగిన భారీ ర్యాలీలో ఆప్ ఆరోపించింది.
 
 కాగా, ప్రస్తుత పరిస్థితికి ఆప్ నిర్వాకమే కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. ‘లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆప్ అప్పట్లో ఎల్జీకి లేఖ రాసింది. దాన్ని ఇప్పటివరకు ఆ పార్టీ వెనక్కి తీసుకోలేదు. ప్రస్తుత అనిశ్చితికి వారిదే బాధ్యత..’ అంటూ ఆప్‌పై మండిపడింది.  ఆప్ ప్రభుత్వం రాజీనామా చేసినప్పటి నుంచి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన నడుస్తోన్న విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తం గా మోడీ ప్రభంజనంతో బీజేపీ మెజారిటీ స్థానాలు సాధించి కేంద్రం లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఇదే క్రమంలో ఢిల్లీలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిపిస్తే బీజేపీకి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశముం దని ఆ పార్టీ భావిస్తోంది.
 
 అందులో భాగంగానే పార్లమెంట్‌లో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఢిల్లీ రాష్ట్ర బడ్జెట్‌పై విస్తృత ప్రచారం చేపట్టాలని  బీజేపీ రాష్ట్ర శాఖ నాయకత్వం కార్యకర్తలను ఆదేశించింది. అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు రాష్ట్ర శాఖలోనూ భారీ మార్పులు చేయనున్నారు. దీని నిమిత్తం అప్పుడే కసరత్తు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 9వ తేదీన జరగనున్న బీజేపీ జాతీ య సమావేశం అనంతరం రాష్ట్ర శాఖలో ఎంపికలపై పూర్తి దృష్టి పెట్టనున్నారు. ‘కొత్త టీంలో అందరూ కొత్తవారే ఉంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి, పార్టీలో చురుకుగా లేనివారికి మా కొత్త టీంలో స్థానం ఉండదు. ఈ టీంలో అనుభవానికి, నూతనత్వానికి సమాన ప్రాధాన్యమివ్వనున్నాం..’ అంటూ ఉపాధ్యాయ్ ప్రకటించారు.
 

Advertisement
Advertisement