బీజేపీలో జోష్ | Sakshi
Sakshi News home page

బీజేపీలో జోష్

Published Mon, Dec 23 2013 11:04 PM

బీజేపీలో జోష్ - Sakshi

సాక్షి, ముంబై: వాణిజ్య రాజధాని వేదికగా ఎన్నికల సమరశంఖాన్ని పూరించిన నరేంద్ర మోడీ సభ విజయవంతమవడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో జోష్ వచ్చింది. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ(ఎమ్మెమ్మార్డీయే) మైదానంలో ఆదివారం సాయంత్రం జరిగిన మహాగర్జన ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సభకు ఊహించిన దానికంటే అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో ఇక ప్రజాస్వామ్య కూటమి పాలనకు అంతిమ ఘడియలు దగ్గరపడుతున్నాయనే సంకేతాలు వెళ్లినట్టైందని ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
 
 మిత్రపక్షాలైన శివసేన, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సహకారం లేకుండానే ఒంటరిగా సభ నిర్వహించి సక్సెస్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు నాందిగా నిలుస్తుందనే భావన నెలకొంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి ఉన్న క్రేజ్‌ను ఆసరాగా తీసుకొని నిర్వహించిన మహాగర్జనకు ఐదు లక్షలకుపైగా ప్రజలు రావడం ఆ పార్టీకి మంచి ఊపును తెచ్చిపెట్టింది. ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీలతోపాటు ఇటు మిత్రపక్షాలైన శివసేన నాయకులను ఆలోచించేలా చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా ప్రతిపక్షాల గుండెల్లో మోడీ గర్జన గుబులు పుట్టించేలా చేసిందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించేందుకు ఇలాంటి సభలు మరిన్ని నిర్వహించాలనే యోచనలో బీజేపీ ఉన్నట్టు సమాచారం.
 
 శివసేన  ఊసేలేదు...
 చరిత్రాత్మకమైన సభగా పేర్కొనే మహాగర్జన సభలో శివసేన ఊసే కన్పించలేదు. నరేంద్ర మోడీతో పాటు ప్రముఖ నాయకుల ప్రసంగాల్లో ఎక్కడా కనీసం శివసేన పేరు కూడా తీసుకురాలేదు.  ఇది కావాలని చేశారా? లేదా? తమ బలాన్ని నిరూపించుకుని ఒక విధంగా ప్రత్యర్థులతోపాటు మిత్రపక్షాలకు కూడా పరోక్షంగా ఒక సందేశాన్ని ఇచ్చేందుకు చేశారా అనే విషయంపై ప్రస్తుతం చర్చలకు ఊతం ఇచ్చినట్టైంది. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ మాత్రం దివంగత శివసేన నాయకుడు బాల్ ఠాక్రేకు శ్రద్ధాంజలి ఘటించారు. అయితే ఈ సభ కోసం రాష్ట్ర బీజేపీతోపాటు ముంబై పార్టీ శాఖ భారీగా శ్రమించింది. 1.57 లక్షల మందికి ఆహ్వానాలను పంపింది. వీరిలో 35 వేల మంది వీవీఐపీలు ఉండగా, పదివేల మంది టీ వాలాలు ఉన్నారు. అయితే ఇంతమందికి ఆహ్వానాలు పంపినప్పటికీ తమ మిత్రపక్షాలైన శివసేన, ఆర్‌పీఐలను మాత్రం ఆహ్వానించలేదు. దీనికితోడు సభ వేదికపై, బ్యానర్లపై శివసేన పార్టీ, నాయకుల ఫొటోలు ఎక్కడా కన్పించలేదు. కనీసం మోడీ కూడా తన ప్రసంగంలో ఎక్కడ శివసేన పార్టీ గురించి మాట్లాడకపోవడంపై రాజకీయ విశ్లేషకులు భిన్నవాదనలు వినిపిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement