రామ్‌లీలాలో తారల తళుకులు | Sakshi
Sakshi News home page

రామ్‌లీలాలో తారల తళుకులు

Published Tue, Oct 8 2013 2:03 AM

Bollywood actors preparing for her campaign in Ramleela

సాక్షి, న్యూఢిల్లీ: సాంప్రదాయం, ఆధ్యాత్మికత, వినోదం ప్రధానోద్దేశాలుగా  నవరాత్రుల సమయంలో ప్రజలను అలరించే రామ్‌లీలా ప్రదర్శనల్లో ఈసారి బాలీవుడ్ తారలు తళుక్కుమననున్నారు. వీటిని వేదికగా చేసుకొని తమ సినిమాలకు ప్రచారం కల్పించుకునేందుకు సిద్ధమవుతున్నారు.  ఇటీవల ముంబైలో వినాయక  ఉత్సవాలను షారూక్ ఖాన్ చెన్నై ఎక్స్‌ప్రెస్ ప్రచారానికి ఉపయోగించుకోవడాన్ని దృష్టిలో ఉంచుకున్న కొందరు బాలీవుడ్ నటులు తమ అదృష్టాన్ని కూడా పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇదే దారిలో అక్షయ్‌కుమార్, సంజయ్‌లీలా భన్సాలీ నడవనున్నారు. 
 
 తమ సినిమాల ప్రచారం కోసం వారు నగరంలో జరుగుతోన్న రామ్‌లీలా ప్రదర్శనలను  ఉపయోగించుకోనున్నారు. బాస్  సినిమా ప్రచారంలో  భాగంగా అక్షయ్‌కుమార్ అక్టోబర్ 13న రావణ దహనం చేస్తారని లవ్‌కుశ్ రామ్‌లీలా కమిటీ సభ్యుడు తెలిపారు.  సంజయ్‌లీలా భన్సాలీ  రూపొందిస్తున్న రామ్‌లీలా సినిమా ప్రచారం కోసం ఆ చిత్ర నాయికానాయకులు దీపికా పడుకోనే, రణ్వీర్‌సింగ్ ఈ నెల 12న రామ్‌లీలా ప్రదర్శనలో పాల్గొంటారని ఆయన చెప్పారు. 
 
 సామాజిక సమస్యలపై జాగృతం
 రామ్‌లీలా ప్రదర్శనలు సామాజిక సమస్యలపై ప్రజలను జాగృతం చేస్తున్నాయి. దసరా రోజున  రావణున్ని వధించి రాముడు సాధించిన విజయాన్ని చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం విజయదశమిని జరుపుతున్నాయి. దీంతోపాటు  రామ్‌లీలా ప్రదర్శనలో రావణ, కుంభకర్ణ, మేఘనాథుల  ప్రతిమలను దహనం చేయడం సాంప్రదాయంగా వస్తోంది.  రావణ కుంభకర్ణ, మేఘనాథుల బొమ్మలతో పాటు  సమాజాన్ని పట్టిపీడించే సమస్యల దిష్టిబొమ్మను కూడా దహనం చేయడం ద్వారా అనేక రామ్‌లీలా కమిటీలు ఈ సాంప్రదాయానికి సామాజిక సందేశాన్ని కూడా జోడిస్తున్నాయి. ఈసారి కూడా రామ్‌లీలా కమిటీలు ఉగ్రవాదం, ద్రవ్యోల్బణం, మహిళల భద్రత తదితర సామాజిక సమస్యలపై ప్రజలను జాగృతం చేయడానికి సిద్ధమవుతున్నాయి. 
 
 దీనికి తోడు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న  దృష్ట్యా ఓటు హక్కు ప్రాధాన్యతను కూడా రామ్‌లీలా ప్రదర్శనల సమయంలో ప్రజ లకు సందేశంగా అందించనున్నారు.  ఓటు హక్కు ప్రాధాన్యతను నగరవాసులకు తెలిపే రీతిలో రూపొందించిన  కవితలు, సందేశాలు, కవ్వాలీలను నాటకాల మధ్య ప్రదర్శిస్తున్నట్లు కడ్కడూమా సీబీడీ గ్రౌండ్‌లో రామ్‌లీలాను ప్రదర్శించే కమిటీ తెలిపింది. రావణ, కుంభకర్ణ, మేఘనాథుల ప్రతి మలతో పాటు 80 అడుగుల ఉగ్రవాది దిష్టిబొమ్మను కూడా దహనం చేస్తామని చెప్పింది.
 
 కాగా, ఆశారామ్ బాపు వివాదం నేపథ్యంలో పంజాబీ బాగ్‌కు చెందిన శ్రీరామ్‌లీలా కమిటీ  దొంగసాధువులు  చేసే  మోసాలను నాటక  రూపంలో ప్రదర్శించనుంది. ప్రజల మత విశ్వాసాలను దొంగసాధువులు ఎలా సొమ్ము చేసుకుంటున్నారనేది ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు నాటక రూపంలో రామ్‌లీలా సమయంలో ప్రదర్శిస్తారు. అవినీతి రాజకీయ నాయకుల దిష్టిబొమ్మలను కూడా దసరా రోజున రావణుడితో పాటు దహనం చేయడానికి ఈ రామ్‌లీలా కమిటీ సన్నాహాలు చేస్తోంది.
 

Advertisement
Advertisement