Sakshi News home page

ఢిల్లీలో ‘బాంబు’లాట

Published Fri, Mar 4 2016 2:46 PM

ఢిల్లీలో ‘బాంబు’లాట

వసంత్ విహార్ స్కూలుకు బెదిరింపు కాల్
అర్ధ గంట తనిఖీల తర్వాత
ఉత్తుత్తి కాల్ అని నిర్ధారణ
ఊపిరిపీల్చుకున్న యాజమాన్యం
బాంబు కాల్‌తో ఢిల్లీలో దిగిన విమానం
ఇదీ బెదిరింపు కాలేనని వెల్లడి
ఆకతాయిల కోసం పోలీసుల వేట


న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని గురువారం రెండు ‘బాంబు కాల్స్’ భయపెట్టాయి. దక్షిణ ఢిల్లీ వసంత్ విహార్‌లోని మోడ్రన్ స్కూళ్లో, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేయడంతో ఆయా యంత్రాంగాలు పరుగులు పెట్టాయి. చివరికి ఇవి బూటకపు కాల్స్ అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ బెదిరింపు కాల్స్ చేసిన ఆకతాయిలను పట్టుకునేందుకు పోలీసులు వేట ప్రారంభించారు.

స్కూల్లో కలకలం

దక్షిణ ఢిల్లీ వసంత్ విహార్‌లోని మోడ్రన్ స్కూళ్లో బాంబు ఉందంటూ గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు ఓ గుర్తు తెలియని వ్యక్తి యాజమాన్యానికి వ్యక్తి చేశాడు. ఓ బ్యాగ్‌లో బాంబు ఉందని, అది సరిగ్గా ఒంటి గంటకు పేలుతుందని చెప్పాడు. దీంతో స్కూలు యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించి బాంబు నిర్వీర్యం చేసే  బలగాన్ని రప్పించింది. వారు బ్యాగులను తనిఖీ చేసి అంతా బూటకమని తేల్చారు. ఈ మేరకు దక్షిణ జిల్లా డీసీపీ ప్రేమ్ నాథ్ వివరాలు వెల్లడించారు. ఫోన్ చేసిన వ్యక్తి తాను సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)కు చెందినవాడినని చెప్పుకున్నాడని డీసీపీ వివరించారు.

పరీక్షలకు లేని అంతరాయం

స్కూళ్లో 12వ త రగతి బోర్డు పరీక్షలు జరుగుతున్న సమయంలో ఈ కాల్ వచ్చింది. అయితే ఫోన్ కాల్ వచ్చే సమయానికే విద్యార్థులు పరీక్ష రాసి బయటకు వచ్చారని, మిగతా తరగతుల విద్యార్థులకు సెలవు కావడంతో వారు స్కూలుకు రాలేదని డీసీపీ ప్రేమ్‌నాథ్ తెలిపారు. ఫోన్ కాల్ వచ్చినప్పుడు పాఠశాల భవనంలో టీచర్లు, ఇతర సిబ్బంది మాత్రమే ఉన్నారు. వారిని భవనం నుంచి బయటకు పంపించి, బాంబు, డాగ్ స్క్వాడ్‌లతోనూ సోదాలు జరిపించాం. అర్ధ గంట సోదాల తర్వాత ఏమీ కనిపించకపోవడంతో అది ఉత్తుత్తి బెదిరింపు కాల్ అని తేల్చాం’ అని డీసీపీ వివరించారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉందని వెల్లడించారు. ఈ బెదిరింపు కాల్ ఓ ల్యాండ్‌లైన్ నుంచి వచ్చిందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కాల్ జాడ కనిపెట్టేందుకు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశాయి.

ఎయిర్‌పోర్టులో గోరక్‌పూర్ విమానం

గోరక్‌పూర్‌కు వెళ్లాల్సిన జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంలో బాంబు ఉన్నట్లు గురువారం బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో విమానాన్ని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసి క్షుణ్నంగా పరిశీలించారు. అనంతరం బెదిరింపు కాల్ అని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ‘జైపూర్-గోరక్‌పూర్ జెట్ విమానం (9 డబ్ల్యూ 2647 నంబర్) మధ్యాహ్నం 3.30 గంటలకు గోరక్‌పూర్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే విమానంలో బాంబు ఉన్నట్లు మధ్యాహ్నం 12.08 గంటలకు గోరక్‌పూర్ ఎయిర్ డెరైక్టర్ కార్యాలయానికి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో మధ్యాహ్నం 12.57 గంటలకు విమానాన్ని ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్ చేసి క్షుణ్నంగా పరిశీలించాం’ అని పోలీస్ డిప్యూటీ కమిషనర్ (ఐజీఐ) దినేష్ కుమార్ గుప్తా వెల్లడించారు. అలాగే విమానంలోని 61 మంది ప్రయాణికులతో పాటు నలుగురు సిబ్బందిని చెక్ చేసినట్లు ఆయన వివరించారు. అనంతరం అది కేవలం బెదిరింపు కాల్ అని వెల్లడికావడంతో మధ్యాహ్నం 3.18 గంటలకు విమానం గోరక్‌పూర్‌కు బయలుదేరింది.

Advertisement

What’s your opinion

Advertisement