తెగిన లింక్ | Sakshi
Sakshi News home page

తెగిన లింక్

Published Wed, Mar 12 2014 1:51 AM

Broken link

బెంగళూరు : రాష్ట్ర వ్యాప్తంగా పాత పద్ధతిలోనే వంట గ్యాస్ సరఫరాను చమురు కంపెనీలు పునరుద్ధరించాయి. అయితే ఏడాదికి 12 సిలిండర్లను మాత్రమే రూ.423 చొప్పున సరఫరా చేస్తారు. తొలుత సబ్సిడీపై తొమ్మిది సిలిండర్లను మాత్రమే సరఫరా చేస్తామని ప్రకటించిన కేంద్రం, దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో 12 సిలిండర్లకు పెంచింది.

ఇప్పటి వరకు వినియోగదారులు ఆధార్ నంబరు (విశిష్ట గుర్తింపు సంఖ్య)ను తీసుకుని, దానిని గ్యాస్ డీలర్లు, బ్యాంకులకు అనుసంధానం చేయాలని చమురు కంపెనీలు ఆదేశించాయి. అలా చేసిన వారికే సబ్సిడీ లభిస్తుందని, ఆ మొత్తం కూడా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతుందని చెబుతూ వచ్చాయి. మైసూరు, తుమకూరు, ధార్వాడ జిల్లాల్లో ఈ పద్ధతిని తప్పనిసరి చేశారు. బెంగళూరులో వచ్చే నెల నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.

అయితే కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ‘ఆధార్ అనుసంధానం తప్పనిసరి’ అనే నిబంధన రాష్ట్రంలో మంగళవారం నుంచి తొలగిపోయింది. అంటే... ఇకమీదట పాత పద్ధతిలోనే చమురు కంపెనీలు వినియోగదారులకు సిలిండర్లను సరఫరా చేస్తాయి. కాకపోతే సబ్సిడీపై ఏడాదికి 12 సిలిండర్లు మాత్రమే అనే నిబంధన ఉన్నందున, గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసే సమయంలో సరఫరాదార్లు గ్యాస్ కంపెనీకి సంబంధించిన బ్లూ బుక్కులో నమోదు చేస్తారు.
 

 సుప్రీం కోర్టు ఆదేశించినా....

వంట గ్యాస్‌తో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేయడం సరికాదని సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ, చమురు కంపెనీల వ్యవహార శైలిలో మార్పు రాలేదు. వంట గ్యాస్ కోసం ఎస్‌ఎంఎస్‌లు  చేసినా చెల్లుబాటు అయ్యేవి కావు. ఆధార్ సంఖ్యను ఇవ్వాల్సిందిగా గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌లు పంపడం మానలేదు. దీని వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలను ఈ ఏజెన్సీలు పట్టించుకోవా... అనే ప్రశ్నలు తలెత్తాయి. దీనికి తోడు ఆధార్ సంఖ్యను గ్యాస్ ఏజెన్సీలు, బ్యాంకులతో అనుసంధానం చేసిన వారికి సబ్సిడీ మొత్తం బ్యాంకుల్లోనే జమ కావాల్సి ఉంది.

అయితే ఇలా జమ కాకపోవడంతో చాలా మంది వినియోగదారులు లబోదిబోమనేవారు. ఇప్పుడా సంకటం తొలగిపోయింది. ఇదివరకే సిలిండర్‌కు మార్కెట్ ధరను చెల్లించిన వినియోగదారులకు సైతం త్వరలోనే సబ్సిడీ మొత్తాన్ని చెల్లిస్తామని గ్యాస్ ఏజెన్సీలు ప్రకటించాయి.
 
 

Advertisement
Advertisement