పన్నీరు ‘బడ్జెట్’ | Sakshi
Sakshi News home page

పన్నీరు ‘బడ్జెట్’

Published Mon, Mar 9 2015 2:38 AM

పన్నీరు ‘బడ్జెట్’

 సాక్షి, చెన్నై : రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సీఎం పన్నీరు సెల్వం సిద్ధం అవుతున్నారు. ఇందుకు తగ్గ కసరత్తుల్ని వేగవంతం చేశారు. ఆదివారం మంత్రి వర్గం భేటిలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెలాఖరులో అసెంబ్లీలో బడ్జెట్ దాఖలు చేయబోతున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలు శిక్ష నేపథ్యంతో సీఎంగా పన్నీరు సెల్వం బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలు కావస్తున్నది. ఈ కాలంలో ప్రభుత్వ పరంగా చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు చెప్పుకోదగ్గవి లేవు. ఈ ఏడాది తొలి అసెంబ్లీ సమావేశంలో సీఎం పన్నీరు సెల్వం గవర్నర్ ప్రసంగం ద్వారా వరాలు ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. అయితే, గవర్నర్ కొణిజేటి రోశయ్య ప్రసంగం ప్రజల్ని నిరాశ పరిచింది. ఈ పరిస్థితుల్లో 2015-16కు గాను రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. బడ్జెట్ సమావేశాలను ఈ నెలాఖరులో ఆరంభించే విధంగా అధికార వర్గాలు కార్యాచరణను సిద్ధం చేసి ఉన్నాయి.
 
  ఈ సమయంలో అసెంబ్లీలో బడ్జెట్ దాఖలు, ప్రతి పక్షాల విమర్శలు, ఆరోపణల్ని తిప్పికొట్టే విధంగా కసరత్తులకు సీఎం పన్నీరు సెల్వం సిద్ధం అయ్యారు. శాఖల వారీగా ఇప్పటికే ఆయా మంత్రులు సమీక్షించి నివేదికల్ని సిద్ధం చేశారు. ఆయా శాఖల్లో సాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, మున్ముందు అవసరమయ్యే నిధుల వివరాల్ని సీఎం పన్నీరు సెల్వంకు సమర్పించారు. దీంతో సమగ్ర బడ్జెట్ నివేదికను సిద్ధం చేయడం లక్ష్యంగా, ఆయా శాఖలకు జరిగిన కేటాయింపులపై సమీక్షించేందుకు ఆదివారం మధ్యాహ్నం రాష్ర్ట కేబినెట్ భేటీ అయింది. సచివాలయంలో మూడు గంటల నుంచి గంటన్నరకు పైగా సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో అన్ని శాఖల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. బడ్జెట్ తుది ప్రతిని సిద్ధం చేసి, అందుకు ఆమోద ముద్ర పడే రీతిలో ఈ సమావేశం సాగింది.
 
  అలాగే, ప్రతి పక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణల్ని తిప్పికొట్టే విధంగా ప్రతి మంత్రి సిద్ధమయ్యే విధంగా సూచనలు, సలహాలు ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య, పెండింగ్‌లో ఉన్న ఉచిత పథకాల అమలు వేగవంతం లక్ష్యంగా నిధుల కేటాయింపులు పెంచే విధంగా బడ్జెట్ రూపకల్పనకు చర్యలు తీసుకున్నారు. అలాగే, బడ్జెట్ తేదీ, ఎన్ని రోజులు నిర్వహించాలో అన్న అంశంతో పాటుగా పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీ అనంతరం అసెంబ్లీ బడ్జెట్ ముహూర్తాన్ని ఖరారు చేసి రాజ్ భవన్ ఆమోదానికి పంపించనున్నారు. ఉద్వాసనకు గురైన మంత్రి అగ్రి కృష్ణమూర్తి రూపంలో అసెంబ్లీలో చిక్కులు ఎదురయ్యే పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్న దృష్ట్యా, ముందస్తు చర్యలకు సిద్ధమైనట్టు సమాచారం. ఆత్మహత్య చేసుకున్న వ్యవసాయ శాఖ అధికారి కేసును విచారించేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ దాఖలుకు సిద్ధం కావడంతో ప్రతి ఏటా ప్రవేశ పెట్టే విధంగా ఈ ఏడాది కూడా పీఎంకే నేతృత్వంలో మాదిరి బడ్జెట్‌ను ప్రకటించారు.  

 

Advertisement
Advertisement