త్వరలో బస్సు చార్జీల మోత | Sakshi
Sakshi News home page

త్వరలో బస్సు చార్జీల మోత

Published Sat, Feb 14 2015 12:03 AM

త్వరలో బస్సు చార్జీల మోత - Sakshi

* పెంపు ప్రతిపాదనను
* ఆమోదించిన  టీఎంటీ కమిటీ
* కనీస చార్జీ రూ.5 నుంచి రూ. 7కు
సాక్షి, ముంబై: ఠాణే, నవీముంబై ప్రజలపై త్వరలో ఠాణే మున్సిపల్ ట్రాన్స్‌పోర్టు (టీఎంటీ) బస్సు చార్జీల భారం మోపనుంది. నగర మేయర్ సంజయ్ మోరే, స్థాయి సమితి అధ్యక్షుడు సుధాకర్ చవాన్, సభాగృహం నాయకుడు నరేష్ మస్కే, ప్రతిపక్ష నాయకుడు హనుమంత జగ్దాలే, టీఎంటీ మేనేజర్ దేవిదాస్ టొకాలే తదితరులు పాల్గొన్న సమావేశంలో చార్జీల పంపు ప్రతిపాదనను టీఎంటీ కమిటీ ఆమోదించింది. చార్జీలను రూ. 2నుంచి రూ. 6కు  పెంచాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కనీస చార్జీ రూ.5 ఉండగా పెంపుతో రూ.7 వసూలు చేయనున్నారు.

రూ. 150 కోట్ల పెండింగ్ బకాయిలు, పెరిగిన ఇంధన ధరలు, రోజుకు రూ. 6.50ల క్షల నష్టం వస్తుండటంతో సంస్థ ఆర్థికంగా దెబ్బతింటోంది. దీనికి తోడు టీఎంటీ ఉద్యోగులకు చెల్లించే భత్యాలు, ప్రయాణ పన్ను, సీఎన్‌జీ, పెన్షన్, బీమా, కాంట్రాక్టర్ల బిల్లులు తదితరాలు దాదాపు రూ.53.51 కోట్లుకు పైగా ఉన్నాయి. డీఏ, ఓటీ, మెడికల్ అలవెన్స్‌లు రూ.76.56 కోట్లు ఉన్నాయి. రోజూ టీఎంటీ ఖజానాకు రూ. 27 లక్షలు జమా అవుతుండగా...ఖర్చు మాత్రం రూ.33 లక్షలకు పైగానే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ పేర్కొంది.

ఈ నెల 20న జరిగే సర్వ సాధారణ సభలో ప్రతిపాదన అమోదం పొందిన వెంటనే కొత్త చార్జీలు అమలులోకి రానున్నాయి. టీఎంటీ గతంలో 2013 మార్చి 21న చార్జీలు పెంచింది. అప్పుడు లీటరు డీజిల్ ధర రూ.54.32 ఉండగా ఇప్పుడు రూ.67.39కు చేరుకుంది.

Advertisement
Advertisement