సజీవ దహనం! | Sakshi
Sakshi News home page

సజీవ దహనం!

Published Sun, Aug 31 2014 11:50 PM

సజీవ దహనం!

సాక్షి, చెన్నై : పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బర్గూర్, ఉక్కులి, మిడ్నాపూర్ ప్రాంతాలకు చెందిన 70 మంది ఆగస్టు 22వ తేదీ విహార యాత్రకు వచ్చారు. మిడ్నాపూర్ నుంచి బస్సులో విహారయాత్రకు బయలు దేరిన ఈ బృందంలో అత్యధిక శాతం మంది 50 ఏళ్లకు పైబడ్డ వారే. అనేక ప్రాంతాలను సందర్శించిన ఈ బృందం శనివారం రామనాథపురం చేరుకుంది. రామనాథపురంలోని రామనాథ స్వామి దర్శనానంతరం అక్కడే వంటా వార్పుతో రాత్రి భోజనం ముగించారు. రాత్రి 11 గంటల సమయంలో కన్యాకుమారికి బయలుదేరారు. ఉదయాన్నే కన్యాకుమారిలో సూర్యోదయాన్ని వీక్షించాలన్న తపనతో వీరందరూ బయల్దేరారు.
 
 బస్సులో మంటలు
 అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో తిరుప్పులాని సమీపంలో బస్సు వెళుతుండగా, ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. దీన్ని గుర్తించిన డ్రైవర్ బస్సును హఠాత్తుగా నిలిపి వేసి, కిందకు దూకేశాడు. గాధ నిద్రలో ఉన్న ప్రయాణికుల్ని అప్రమత్తం చేశాడు. బస్సు నుంచి దూకేయాలంటూ పెద్దఎత్తున అతడు పెట్టిన కేకలకు కొందరు అప్రమత్తం అయ్యారు. తొలుత స్వల్పంగానే మంటలు చెలరేగడంతో కొందరు హుటాహుటిన బయటకు దూకేశారు. వృద్ధులు కిందకు దిగడంలో ఇబ్బందులు తప్పలేదు. అదే సమయంలో వంటావార్పునకు ఉపయోగించే సిలిండర్ బస్సులో ఉండడం, నిప్పురవ్వలు దాని మీద పడడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఆ సిలిండర్ పేలుడు దాటికి మంటలు పూర్తిగా బస్సును ఆవహించాయి. లోపల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. కొందరు కాలిన గాయాలతో బయట పడ్డారు. అర్ధరాత్రి కావడంతో ఆ మార్గంలో ఎవ్వరూ లేకపోవడం, అగ్నిమాపక కేంద్రానికి ఎలా సమాచారం ఇవ్వాలో తెలియని పరిస్థితుల్లో ప్రమాదం నుంచి బయటపడ్డ వారు అయోమయూనికి గురయ్యూరు. గాయపడ్డవారు నరకయూతన పడ్డారు. చివరకు అటు వైపుగా వచ్చిన ఓ మోటార్ సైకిలిస్టు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించాడు.
 
 సజీవ దహనం
 హుటాహుటీన తిరుప్వులాని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. తమిళనాడు ముస్లిం మున్నేట్ర కళగం, స్వచ్ఛంద సంస్థలకు చెందిన అంబులెన్స్‌లు అక్కడికి పరుగులు తీశాయి. గాయపడ్డ వాళ్లను ఆగమేఘాలపై రామనాథపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంటల్లో బస్సు లోపలి భాగం పూర్తిగా దగ్ధమైంది. అలాగే, పర్యాటకుల వస్తువులన్నీ బుగ్గి పాలయ్యాయి. మంటలను అదుపులోకి తెచ్చినానంతరం ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. వీరిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు.
 
 భాష సమస్య
 ఊరు గాని ఊరొచ్చి ప్రమాదంలో చిక్కుకున్న పశ్చిమ బెంగాల్‌వాసుల రోదన వర్ణనాతీతం. ఐదుగురు మృతి చెందగా, 8 మంది ఆసుపత్రి పలయ్యారు. మిగిలిన 50 మందిని అధికారులు అక్కున చేర్చుకున్నారు. అయితే, భాషా సమస్యతో నానా తంటాలు తప్పలేదు. మృతుల వివరాలు సేకరించడంలో పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు ప్రమాదం నుంచి బయటపడ్డ వారు ఇచ్చిన సమాచారం మేరకు మృతులు, గాయపడ్డ వారిలో కొందరి పేర్లను పోలీసులు ప్రకటించారు. మృతుల్లో విశ్వనాథ దాసు(68), విశ్వనాథ అతుల్(78), దుర్గా శ్యామాదార్( 48), మాలతి(60), గోపాల్ శతృబాగాల్(70) ఉన్నారు. గాయపడ్డ వారిలో సుబాన్ మాల్ సతీమణి గపూర్ రాణి(40), నిఘార్ చంద్ర పాల్ సతీమణి బిజి బియాపాల్(50),  కరుపొత్తమకాల్(68), శక్తి సుగన్(43), గాయత్రి బాగల్( 50), శైలేంద్ర రాజకుమార్ భార్య సూర్య రాజా తదితరులు ఉన్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బస్సులో చెలరేగిన మంటల తీవ్రత తక్కువేనని, అయితే, సిలిండర్ పేలడంతోనే భారీ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు పేర్కొన్నారు.
 
 స్వగ్రామాలకు తరలింపు ఏర్పాట్లు
 బస్సు మంటల్లో సర్వం కోల్పోయి, చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా రోడ్డున పడ్డ 50 మందికి పైగా పశ్చిమ బెంగాల్ వాసులను ఆదుకునేందుకు రామనాధపురం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. వీరందర్నీ తిరుప్పులానిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉంచారు. తినేందుకు తిండి, కట్టుకునేందుకు బట్టలను అందజేశారు. వీరిని వారి స్వగ్రామాలకు తరలించేందుకు రామనాథపురం ఎంసీ అన్వర్‌రాజా ఏర్పాట్లు చేస్తున్నారు. రైల్వే ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పశ్చిమ బెంగాల్‌కు రైలు ద్వారా వీరందరినీ పంపించేందుకు చర్యలు వేగవంతం చేశారు తమ వద్ద ఉన్న వివరాల మేరకు  పశ్చిమ బెంగాల్ పోలీసు యంత్రాంగానికి సమాచారం అందించారు.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement