మంతనాల్లో అమిత్ షా | Sakshi
Sakshi News home page

మంతనాల్లో అమిత్ షా

Published Mon, Jan 19 2015 2:25 AM

By-election: BJP's allies non-committal on support

శ్రీరంగం ఉప ఎన్నికల సందడి ఆరంభమైంది. సోమవారం నుంచి నామినేషన్ల పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు. మిత్రుల సహకారంతో అభ్యర్థుల్ని నిలబెట్టేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగారు. డీఎండీకే అధినేత విజయకాంత్ మాత్రం మెట్టు దిగడం లేదు. పీఎంకే ఎంపీ అన్భుమణి భేటీ సాగినా, కేవలం మర్యాదేనని వివరణ ఇచ్చుకున్నారు. ఇక, ఎన్నికలకు తాము దూరం అని టీఎంసీ అధ్యక్షుడు జీకే వాసన్ ప్రకటించారు.
 
 సాక్షి, చెన్నై :  అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు జైలు శిక్ష నేపథ్యంలో శ్రీరంగం అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఫిబ్రవరి 13న ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో అన్నాడీఎంకే అభ్యర్థిగా వలర్మతి, డీఎంకే అభ్యర్థిగా ఆనంద్ రేసులో ఉన్నారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలబెట్టి సత్తా చాటాలని బీజేపీ ఉవ్విళ్లూరుతున్నది. డీఎండీకే, పీఎంకే, కొంగునాడు మద్దతును కూడగట్టుకునే పనిలో పడింది. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఆడిటర్ గురుమూర్తి ఇంటి వివాహ వేడుకకు హాజరైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తన వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డారు.
 
 సద్వినియోగం : రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ ఈ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థిని నిలబెట్టి, తన సత్తాను చాటుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అంది వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో ఆమె పడ్డారు. వివాహ వేడుక నిమిత్తం చెన్నైకు వచ్చిన జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దృష్టికి ఉప ఎన్నికల్లో పోటీ అంశాన్ని తీసుకెళ్లారు. హార్బర్ అతిథి గృహంలో అమిత్ షాతో తమిళి సై, కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్, నేతలు ఇలగణేషన్, హెచ్ రాజ, మురళీధరరావు భేటీ అయ్యారు. ఉప ఎన్నికల చుట్టూ ఈ భేటీ సాగింది. రాష్ట్ర పార్టీ నాయకుల విన్నపాలను పరిగణనలోకి తీసుకున్న అమిత్ షా మరో రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నట్టు కమలనాథులు పేర్కొంటున్నారు. ఈ విషయమై తమిళి సైను కదిలించగా, శ్రీరంగం ఉప ఎన్నికల్లో పోటీ గురించి చర్చించామని, మిత్రులందరితో చర్చించేందుకు నిర్ణయించామన్నారు.  కూటమి నిబంధనల మేరకు నడుచుకుంటామని, కూటమి అభ్యర్థి ఈ ఉప ఎన్నికల్లో పోటీలో ఉంటారని పేర్కొనడం గమనార్హం.
 
 మౌనంగా కెప్టెన్ : బీజేపీ కూటమికి ఎండీఎంకే బహిరంగానే టాటా చెప్పింది. ఇక పీఎంకే వ్యతిరేక  వ్యాఖ్యలు చేస్తుంటే, డీఎండీకే మౌనాన్ని పాటిస్తున్నది. ఈ సమయంలో అమిత్ షా చెన్నై రాకతో మిత్రులందరూ ఆయన్ను కలుస్తారన్న సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలో ఆ కల్యాణ వేడుకలో అమిత్ షాతో పీఎంకే నేత రాందాసు తనయుడు, ఎంపీ అన్భుమణి భేటీ అయ్యారు. ఈ పలకరింపుతో పీఎంకే తమ వెంటే అన్న ఆనందం కమలనాథుల్లో నెలకొన్నా, చివరకు మర్యాద పూర్వక సంప్రదింపు మాత్రమే అని మీడియా ముందు అన్భుమణి స్పష్టం చేశారు. ఈ వివాహ వేడుకలో అమిత్ షాను విజయకాంత్ కలసినట్టు కొందరు, కలవనట్టు మరి కొందరు పేర్కొంటున్నారు. వివాహ వేడుకు విజయకాంత్ వచ్చిన సమయంలో అమిత్ షా భోజనానికి వెళ్లినట్టు, నేరుగా వధువరుల్ని ఆశీర్వదించినానంతరం విజయకాంత్ తన దారి తాను వెళ్లినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, కమలనాథులు మాత్రం విజయకాంత్ అమిత్ షాను పలకరించినట్టుగా పేర్కొంటున్నారు. అదే సమయంలో తమ నేత విజయకాంత్ ఎట్టి పరిస్థితుల్లో మెట్టు దిగరని డీఎండీకే వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం.
 
 ఎన్నికల బరిలో అభ్యర్థుల్ని రంగంలోకి దించి ప్రచారంలో డీఎంకే, అన్నాడీఎంకేలు ఉరకలు తీస్తుంటే, మంతనాల్లో బీజేపీ బిజీగా ఉంది. తాము ఉప ఎన్నిక రేసులో లేమని తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ ప్రకటించారు. రెండు రోజుల్లో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్ పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం ఎన్నిక కసరత్తుల్ని వేగవంతం చేసింది. నియోజకవర్గం పరిధిలో ఆంక్షల్ని అమల్లోకి తెచ్చింది. 91 రకాల నిబంధనల్ని విధించింది. నగదు బట్వాడా అడ్డుకట్ట లక్ష్యంగా తనిఖీలు వేగవంతం అయ్యాయి. వేరే రాష్ట్రం నుంచి ప్రత్యేక అధికారి రంగంలోకి దిగబోతున్నారు. ఈ సమయంలో నామినేషన్ల పర్వం సోమవారం నుంచి ఆరంభం కానుంది. నియోజకవర్గం పరిధిలోని ఆర్డీవో, తాలుకా కార్యాలయంలో నామినేషన్లు సమర్పించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈనెల 26న రిపబ్లిక్ డే మినహా తక్కిన అన్ని రోజుల్లో 27వ తేదీ వరకు నామినేషన్లు సమర్పించవచ్చు.  
 

Advertisement
Advertisement