Sakshi News home page

రైతు రక్ష....

Published Sat, Aug 29 2015 1:45 AM

రైతు రక్ష.... - Sakshi

అన్నదాతల కోసం కార్పొరేట్ సంస్థల సహకారంతో ముందుకు సెప్టెంబర్ 1న ప్రారంభం
పెలైట్ ప్రాజెక్ట్‌గా తుమకూరు జిల్లాలో తొలి దశలో 40 వేల రైతు కుటుంబాలకు లబ్ధి

 
బెంగళూరు :రాష్ట్రంలో కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు కార్పొరేట్ సంస్థల సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోంది. సీఎస్‌ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) నిధులను అన్నదాతలను ఆదుకునేందుకు వినియోగించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం పెలైట్ ప్రాతిపదికన తుమకూరు జిల్లాలో వచ్చేనెల 1 నుంచి  ‘రైతు రక్ష’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని అమలు చేయడానికి  అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల ఇటీవల  రైతుల బలవన్మరణాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. వీటికి అడ్డుకట్ట వేయడంతో పాటు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు  వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా తుమకూరు, శిరా, పావగడ తాలూకాల్లో దాదాపు 40 వేల రైతు కుటుంబాలను ఎంపిక చేయనుంది. ఒక్కొక్క కుటుంబానికి వేర్వేరు నేపథ్యం ఉంటుంది. అందువల్ల తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఒక్కొక్క రైతు కుటుంబానికి కార్పొరేట్ సంస్థల సీఎస్‌ఆర్ నిధుల నుంచి రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.20 వేల వరకు సహాయధనాన్ని అందజేస్తారు.

అటుపై రాష్ట్ర పశు సంవర్ధకశాఖ, మత్స్యశాఖ, ఉద్యానశాఖల సంయుక్త సహకారంతో వర్మీకంపోస్ట్ ఎరువు, పుట్టుగొడుగుల పెంపంకం, మేకలు, గొర్రెల పెంపకం  వంటి వ్యవసాయ ఆధారిత పనులను చేపట్టడానికి వీలుగా రుణాలను అందజేస్తారు.  ఆయా కుటుంబ నేపథ్యం సభ్యుల ఆసక్తిని అనుసరించి పనులను కేటాయిస్తారు. మొత్తంగా సీఎస్‌ఆర్ నిధులను ప్రభుత్వ పథకాలకు తోడుగా రైతు రక్ష పథకం కింద దయనీయ స్థితిలో ఉన్న అన్నదాతలకు అందించి మూడేళ్లలోపు వారిని ఆర్థికంగా గట్టెంక్కించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏడాది పాటు ఈ జిల్లాలో రైతు రక్షను అమలు చేసి అటు పై రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకూ ఈ పథకాన్ని విస్తరించే ఆలోచన ఉన్నట్లు తుమకూరు జిల్లా ఇన్‌ఛార్జ్ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ షాలినీ రజినీష్ తెలిపారు.
 
 

Advertisement

What’s your opinion

Advertisement