ఎటూ తేల్చుకోలేని కెప్టెన్ | Sakshi
Sakshi News home page

ఎటూ తేల్చుకోలేని కెప్టెన్

Published Sat, Nov 9 2013 12:43 AM

captain in dilemma

 ఏర్కాడు ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ శనివారం ప్రారంభం కానుంది. పోటీపై డీఎండీకే తేల్చుకోలేక పోతోం ది. మరోవైపు పార్టీల ప్రచారం జోరందుకుంది. సేలం కలెక్టర్‌పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు వెళ్లింది.      
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి: ఏర్కాడు ఉప ఎన్నిక పోరు వేడెక్కింది. గెలుపును అన్నాడీఎంకే, డీఎంకే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారుు. ఆ పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేశారు. అదే సమయంలో డీఎండీకే డోలాయమానంలో పడింది. ఏర్కాడులో పోటీపై పార్టీలోనే భిన్నస్వరాలు వినిపిస్తుండడం పార్టీ అధినేత విజయకాంత్‌ను అయోమయానికి గురిచేస్తోంది. సేలం జిల్లా పార్టీ కార్యదర్శి ఆర్.మోహన్‌రాజ్, ఎమ్మెల్యేలు వెంకటేశన్, పార్దిబన్‌లు పోటీ వద్దని తెగేసి చెబుతున్నారు.
 
 అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థులను ఎదుర్కొనే ఆర్థిక స్థోమత పార్టీలో ఎవరికీ లేదని పేర్కొంటున్నారు. అంతేగాక రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు పెట్టుకునే అవకాశాలను కోల్పోతామని కెప్టెన్‌కు నచ్చజెబుతున్నారు. మరోవైపు పార్టీ కోశాధికారి ఇళంగో తదితరులు ఉప ఎన్నిక బరిలోకి దిగాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నారు. పోటీ పెట్టడం వల్ల డీఎండీకే సత్తా చాటవచ్చని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విజయకాంత్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఏర్కాడులో దీటుగా పోటీనిచ్చే నలుగురు అభ్యర్థుల పేర్లను ఎంపిక చేయాల్సిందిగా సేలం పార్టీ నేతలను విజయకాంత్  ఆదేశించారు. సొంత గడ్డపై ప్రతిష్టాత్మకమైన ఉప ఎన్నిక ముంచుకొస్తుండగా ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విజయకాంత్ ఉత్సాహం చూపుతున్నారు. తొలి విడతగా ఐదుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటిం చారు. తాజాగా మరో ఆరుగురి పేర్లను ఖరారు చేశారు. ఏర్కాడులో ఒక్క స్థానంపై ఎటూ తేల్చుకోలేని కెప్టెన్ ఢిల్లీలో 11 స్థానాల్లో పోటీకి సిద్ధమవడం గమనార్హం.
 
 కలెక్టర్‌పై ఫిర్యాదు: జిల్లా ఎన్నికల అధికారి అరుున కలెక్టర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ డీఎంకే నేత శివలింగం ఎన్నికల కమిషన్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశా రు. ఓమలూరు పాత కోర్టు సమీపంలో రూ.2.52 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న తాలూకా కార్యాలయ భవనానికి కలెక్టర్ మకరభూషణం భూమి పూజ చేశారని పేర్కొన్నారు. నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిన కలెక్టరే ఇలా వ్యవహరిస్తే ఏమిటని ప్రశ్నించారు. వెంటనే కలెక్టర్‌ను బదిలీ చేసి నిజాయితీ గల అధికారిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలావుండగా నామినేషన్ల ప్రక్రియ శనివారం ప్రారంభం కానుంది. భద్రత నిమిత్తం కేంద్రం నుంచి 258 మంది సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది శుక్రవారం సేలం చేరుకున్నారు.

Advertisement
Advertisement