ఘోరం | Sakshi
Sakshi News home page

ఘోరం

Published Mon, Sep 15 2014 12:40 AM

ఘోరం - Sakshi

 సాక్షి, చెన్నై: జిల్లా లాల్గుడి సమీపంలోని తిరుమంకుడికి చెందిన వెంకటాచలం(37), గీత(35) దంపతులకు కుమారులు శ్రీరాం(12), శ్రీ బాలాజీ(11) ఉన్నారు. శ్రీరాం దిండుగల్ జిల్లా పన్నైకాడులోని ప్రైవేటు స్కూల్లో చదువుతున్నాడు. హాస్టల్లో ఉంటూ ఏడో తరగతి చదువుతున్న శ్రీరాంను చూడడానికి తల్లిదండ్రులు బయల్దేరారు. తమతో పాటుగా బంధువులు భాను(46), శాంతి(47)ని వెంటబెట్టుకెళ్లారు. డ్రైవర్ మోహన్ కారు నడిపారు. వీరు ప్రయాణిస్తున్న కారు వేగంగా హైవేలో దూసుకెళ్లింది. మరి కాసేపట్లో దిండుగల్ చేరుకుని తనయుడిని చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న ఆ తల్లిదండ్రుల్ని, బంధువుల్ని మృత్యువు కబళించింది. తవరపట్టి వద్ద వీరి కారు అదుపు తప్పింది. కారును అదుపు చేయలేక మోహన్ చేతులెత్తేశాడు. అతి వేగంతో దూసుకొచ్చిన కారు రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీని ఢీకొంది.
 
 విగత జీవులు : అతి వేగంగా వచ్చి ఢీ కొనడంతో కారు సగం భాగం లారీ కిందకు దూసుకెళ్లింది. ఆ కారులో కూర్చుని ఉన్నట్టుగానే అందరూ విగత జీవులయ్యారు. తీవ్ర రక్త స్త్రావంతో కారు శిథిలాల్లో చిక్కి మరణించిన వెంకటాచలం, గీత, శ్రీ బాలాజీ, భాను, శాంతి, మోహన్‌ల మృత దేహాల్ని బయటకు తీయడానికి శ్రమించాల్సి వచ్చింది. అగ్నిమాపక అధికారి పురుషోత్తమన్ నేతృత్వంలో సిబ్బంది అతి కష్టం మీద మృతదేహాల్ని వెలికి తీశారు. సమాచారం అందుకున్న ఆ జిల్లా ఎస్‌పీ జయచంద్రన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
 
 మృత దేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం దిండుగల్ ఆస్పత్రికి తరలించారు. ఆ వాహనంలో ఉన్న సెల్ ఫోన్ల ఆధారంగా సమాచారాన్ని ఆప్తులు, కుటుంబీలకు పంపించారు. తనను చూడటానికి వచ్చిన తల్లిదండ్రులు, సోదరుడు, బంధవులు కానరాని లోకాలకు వెళ్లడంతో శ్రీరాం వెక్కివెక్కి ఏడ్చాడు. అతడ్ని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. మృత దేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. మృతుడు వెంకటాచలం తిరుమయం కుడిలో హోటల్ నడుపుతుండడంతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. మృతురాలు గీత ఓ ప్రయివే టు కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తుండడంతో ఆ కళాశాల వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement