అఖిలపక్షం! | Sakshi
Sakshi News home page

అఖిలపక్షం!

Published Sun, Oct 23 2016 3:06 AM

Cauvery issue: DMK convenes all-party meet on October 25

 సాక్షి, చెన్నై: రాష్ర్ట ప్రభుత్వంలో స్పందనలేని దృష్ట్యా, ఇక తాను సిద్ధం అన్నట్టుగా అఖిలపక్షం ఏర్పాటుకు ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ కదిలారు. ప్రతి పక్ష పార్టీల నాయకులు అందరికీ ఆయన శనివారం లేఖ రాశారు. కావేరి హక్కుల పరిరక్షణలో అఖిల పక్షంతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఈ నెల 25న డీఎంకే రాష్ట్ర కార్యాలయం అన్నా అరివాలయం వేదికగా జరగనున్న ఈ భేటీలో భాగస్వాములం అవుదామని విన్నవించారు. డీఎంకే పిలుపునకు కాంగ్రెస్ తక్షణం స్పందించింది. బీజేపీ విమర్శలు గుప్పించే పనిలోపడగా, మిగిలిన పార్టీలు ఏ మేరకు స్పందిస్తాయో! కావేరి జలాల మీద ఉన్న హక్కుల్ని కాలరాసే విధంగా కేంద్రం కొత్త కుట్రలకు సిద్ధం కావడం తమిళనాట ఆగ్రహాన్ని రేపి ఉన్న విషయం తెలిసిందే.
 
 కర్ణాటకలో జరగనున్న ఎన్నికల్లో రాజకీయ మనుగడను చాటుకునేందుకుగాను, తమిళులకు ద్రోహం తలబెట్టే పనిలో కేంద్రం నిమగ్నమైనట్టు సంకేతాలు వచ్చాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా కావేరి అభివృద్ధి బోర్డు, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు విషయంలో కేంద్రం తీరు ఏమిటో తేటతెల్లమైంది. ఆ బోర్డు, కమిటీ ఏర్పాటును అడ్డుకునే విధంగా కేంద్రం వ్యవహరించిన తీరుతో రాష్ట్రంలో జ్వాల రగిలింది. ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, రాజకీయ పక్షాలు వేర్వేరుగా కేంద్రం తీరును దుయ్యబడుతూ నిరసనల్ని సాగిస్తూ వస్తున్నారు. ప్రధాన ప్రతి పక్షం డీఎంకే సైతం అన్నదాతలకు మద్దతుగా ముందుకు దూసుకెళుతున్నది.

 అఖిల పక్షంతో అన్ని పార్టీలను ఒకే వేదిక మీదకు తెచ్చి కేంద్రంపై ఒత్తిడి పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే పదే డీఎంకే విజ్ఞప్తి చేసినా ఫలితం శూన్యం. ఏకంగా ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్ ఆర్థిక మంత్రి ఓ పన్నీరుసెల్వంతో భేటీ సాగించినా అందుకు తగ్గ చర్యల మీద ప్రభుత్వ వర్గాలు దృష్టి పెట్టలేదని చెప్పవచ్చు. ప్రభుత్వంలో చలనం లేని దృష్ట్యా, ఇక అఖిల పక్షానికి నేతృత్వం వహించేందుకు తాను సిద్ధం అని ప్రకటిస్తూ, అందుకు తగ్గ చర్యల్లో ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్ నిమగ్నమయ్యారు.
 
 అఖిలపక్షం: అన్నదాతలతో కలిసి ఓ వైపు పోరాడుతూ అఖిల పక్షానికి పట్టుబడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ఇన్నాళ్లు ముందుకు సాగినా ఫలితం శూన్యం. ఇక, గత వారం డీఎంకే ఎంపీలు రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీతో సైతం భేటీ అయ్యారు. అలాగే, ఎవరికి వారు అన్నట్టుగా ఆయా పార్టీలు ముందుకు సాగుతుండడంతో, ఇకనైనా అందరం ఒకే వేదికగా ప్రజల పక్షాన పోరాడుదామని పిలుపునిస్తూ అఖిలపక్షం ఏర్పాటుకు స్టాలిన్ నిర్ణయించారు. ఇందుకు తగ్గట్టు ఆయా పార్టీల నాయకులకు శనివారం లేఖాస్త్రం సంధించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచే విధంగా ముందుకు సాగుదామని, కావేరి హక్కుల్ని పరిరక్షించుకుందామని పిలుపునిస్తూ ఆయా లేఖల్లో నేతలకు వివరించారు. ప్రతి పక్ష పార్టీల నాయకులందరికీ ఈ లేఖల్ని పంపించారు.
 
 ఈనెల 25వ తేదీ ఉదయం పదిన్నర గంటలకు డీఎంకే రాష్ట్ర కార్యాలయం అన్నాఅరివాలయం వేదికగా జరగనున్న ఈ సమావేశంలో భాగస్వాములు కావాలని, వారి వారి అభిప్రాయాల్ని ముందు ఉంచాలని విన్నవించారు. ఇక, స్టాలిన్ పిలుపుకు కాంగ్రెస్ స్పందించింది. టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ మీడియాతో మాట్లాడుతూ ఆ సమావేశానికి తాను స్వయంగా హాజరు కానున్నట్టు ప్రకటించారు. మిగిలిన పార్టీల నుంచి స్పందన ఏ మాత్రం అన్నది ఆదివారం నాటికి తేలే అవకాశాలు ఉన్నాయి. కాగా, బీజేపీ మాత్రం విమర్శల్ని ఎక్కుబెట్టే పనిలో పడ్డాయి. ఏ అర్హతతో ప్రధాన ప్రతి పక్షం ఈ సమావేశానికి పిలుపునిచ్చిందో అని కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ మండిపడ్డారు. కావేరి విషయంలో పరిస్థితి జఠిలం అయ్యేందుకు ప్రధాన కారకులు డీఎంకే, కాంగ్రెస్ వర్గాలేననని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే పిలుపునకు స్పందించేవాళ్లెవ్వరూ రాష్ట్రంలో ఉండరని ఎద్దేవా చేశారు.
 
 బీజేపీ విమర్శలు గుప్పించే పనిలో పడడంతో, ఇక, తాము సైతం అంటూ మక్కల్ ఇయక్కం డీఎంకేపై విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టే పనిలో పడ్డాయి. మక్కల్ ఇయక్కంలోని ఎండీఎంకే, సీపీఎం, సీపీఐ, వీసీకేలు అభిప్రాయంగా పేర్కొంటూ కన్వీనర్ వైగో చేసిన ప్రకటన డీఎంకేకు షాక్కే. డీఎంకే అఖిల పక్షం పిలుపునకు తాము స్పందించబోమని, ఆ సమావేశానికి దూరం అని వైగో ప్రకటించేశారు.

 

Advertisement
Advertisement