అక్రమ మైనింగ్‌పై సీబీఐ దర్యాప్తు | Sakshi
Sakshi News home page

అక్రమ మైనింగ్‌పై సీబీఐ దర్యాప్తు

Published Wed, Aug 28 2013 2:43 AM

cbi investigation on illegal mining

 సాక్షి ప్రతినిధి, బెంగళూరు :రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్‌పై సీబీఐ దర్యాప్తు చేయించడానికి సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఢిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీబీఐతో దర్యాప్తు చేయించే విషయమై న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాతే తదుపరి నిర్ణయం ఉంటుందన్నారు. అక్రమ మైనింగ్‌పై గతంలో తాను వెలిబుచ్చిన అభిప్రాయాలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిపై కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవడానికి వెనుకాడేది లేదన్నారు.
 
  అక్రమ మైనింగ్ వల్ల ఖజానాకు వాటిల్లిన నష్టాన్ని వసూలు చేయడానికి ఉన్నత స్థాయి సమితి ఏర్పాటు చేసే విషయమై న్యాయ నిపుణులతో సమాలోచనలు జరిపి సత్వరమే నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా కేపీసీసీ అధ్యక్షుడు జీ. పరమేశ్వర, మాజీ మంత్రి డీకే. శివ కుమార్‌కు మంత్రి వర్గంలో స్థానం కల్పించే విషయమై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రభుత్వాన్ని సజావుగా నడపడానికి అవసరమైన సంఖ్యా బలం ఉన్నందున ‘ఆపరేషన్ హస్తం’ ఆవశ్యకత ఉండబోదన్నారు.  లోక్‌సభ ఎన్నికల్లో 20 నుంచి 22 స్థానాలను గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. మడె స్నానను ఆది నుంచీ వ్యతిరేకిస్తున్నామని, మూఢ నమ్మకాలను ప్రోత్సహించడానికి  అవకాశం ఇవ్వబోమని  తేల్చి చెప్పారు.
 
 ఎంపీలతో సమావేశం:కర్ణాటక భవన్‌లో ముఖ్యమంత్రి రాష్ర్ట ఎంపీలకు ఉదయం అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర పథకాలకు కేంద్రం అనుమతిని పొందడంలో అనుసరించాల్సిన వైఖరిపై చర్చించారు. అవసరమైతే కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని  ఎంపీలను కోరారు. ఎంపీ లాడ్ నిధులను సద్వినియోగం చేయాలని కోరారు. ఇదే సందర్భంలో ఎంపీ లాడ్ నిధుల వినియోగంపై జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసే విషయమై చర్చించారు. వెంకయ్య నాయుడు, అనంత కుమార్ సహా బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు సమావేశానికి హాజరయ్యారు. మాజీ ప్రధాని దేవెగౌడ గైర్హాజరయ్యారు.
 
 ఖర్గే అసంతృప్తి :రాష్ర్టంలో రైల్వే ప్రాజెక్టులను  పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సహకరించడం లేదని రైల్వే మంత్రి  ఖర్గే ఆరోపించారు. భూసేకరణ ఫైళ్లను పరిష్కరించడంలో జాప్యం చేస్తున్నా రన్నారు. భూమిని ఇవ్వకపోతే నిర్ణీత సమయంలో ప్రాజెక్టులను పూర్తి చేయడం అసాధ్యమన్నారు. దీనిపై జోక్యం చేసుకోవాలని కోరినప్పుడు సీఎం స్పందిస్తూ, ఆరు నెలల్లో అన్ని పనులు పూర్తి చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
 
 

Advertisement
Advertisement