Sakshi News home page

నేతల్లో ‘నివేదిక’ గుబులు !

Published Wed, Jun 8 2016 1:39 AM

CD conversations examining the Central Election Commission

‘స్టింగ్ ఆపరేషన్’ సీడీ సంభాషణలను పరిశీలిస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్
ఢిల్లీకి మారిన సీన్
నాయకుల్లో ఉత్కంఠ

 

బెంగళూరు : రాజ్యసభ ఎన్నికల వ్యవహారం కొత్తమలుపు తిరుగుతోంది. ఓ టీవీ చానల్ స్టింగ్ ఆపరేషన్‌లో చిక్కిన జేడీఎస్, స్వతంత్య్ర ఎమ్మెల్యేల వ్యవహారంపై వచ్చిన నివేదికను కేంద్ర ఎన్నికల కమిషన్ నిశితంగా గమనిస్తోంది. దీంతో రాజకీయం మొత్తం ఢిల్లీవైపు మరలింది. ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ  అత్యుత్సాహంతో మూడో అభ్యర్థి గెలుపు కోసం కొంతమంది జేడీఎస్, స్వతంత్ర ఎమ్మెల్యేలతో బేరం పెట్టడంతో ఓ టీవీ చానల్ స్టింగ్ ఆపరేషన్ చేసిన విషయం సంచలనం రేగింది. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్న కేఎస్ మూర్తి నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ నివేదికను తెప్పించుకుంది. క్లిప్పింగులతో పాటు సంభాషణలను కూడా నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.  సదరు క్లిప్పింగుల్లో కే.సీ రామమూర్తి సహా ఏడుగురు నాయకుల సంభాషణలు ఉన్నట్లు తెలుస్తోంది. వారు ఏ విషయం మాట్లాడారు... వారి మధ్య ఎలాంటి సంభాషణలు జరిగాయి... ఏమైన నగదు లావాదేవీలు జరిగాయా ? అనే విషయాలపై ఎన్నికల కమిషన్ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.


ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో అవినీతి జరిగినట్లు స్టింగ్ ఆపరేషన్‌లో తేటతెల్లమైతే వీటిని రద్దు చేయాలని ఇప్పటికే జేడీఎస్ కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరింది. ఒకసారి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక ఈ కారణాలతో ఎన్నికలను వాయిదా వేయడానికి లేదా రద్దు చేయడానికి అవకాశం ఉందా లేదా అన్న విషయంపై కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. మొత్తంగా ఓటుకు నోటు ఉదంతంతో కర్ణాటక శాసనసభ నుంచి రాజ్యసభకు జరిగే ఎన్నికల విషయంపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటోందని రాష్ర్టంలోని ప్రతి ఒక్కరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

 
తలో దిక్కుకు

రాజ్యసభ ఎన్నికల్లో మూడో అభ్యర్థి కే.సీ రామమూర్తి గెలుపునకు వీలుగా స్వతంత్ర అభ్యర్థుల ఓట్లను పొందడానికి వీలుగా దాదాపు ఆరుగురిని ముంబైలోని ఓ స్టార్‌హోటల్‌కు  తీసుకువెళ్లిన కాంగ్రెస్‌నాయకులు ఒక్క రోజు కూడా గడవక ముందే వారిలో నలుగురిని వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. ఇక ముంబైకు వెళ్లిన వారిలో కూడ్లిగి ఎమ్మెల్యే నాగేంద్ర, బాగేపల్లి ఎమ్మెల్యే సుబ్బారెడ్డిలు వారి నియోజక వర్గాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని తాము వ్యక్తిగత పనుల నిమిత్తం బెంగళూరుకు వెళ్లినట్లు తెలిపారు. ఇక ముంబై వెళ్లిన బీదర్ దక్షిణ ఎమ్మెల్యే అశోక్‌ఖైనీ అక్కడి ఓ మహిళా రిపోర్టర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి తిరిగి బెంగళూరు మీదుగా హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. ఏదీ ఏమైనా కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ వ్యవహారాలన్నింటిని నిశితంగా గమనిస్తుండటంతో రాజకీయ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement