సెంట్రల్ మ్యూజియంకు మహర్దశ | Sakshi
Sakshi News home page

సెంట్రల్ మ్యూజియంకు మహర్దశ

Published Tue, May 27 2014 10:51 PM

central government funds released to central museum

సాక్షి, ముంబై: రాష్ట్రానికి శీతాకాల రాజధాని అయిన నాగపూర్‌లో ఉన్న బ్రిటిష్ కాలం నాటి సెంట్రల్ మ్యూజియం(అజబ్ బంగ్లా)కు మహర్దశ రానుంది. మ్యూజియం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.14 కోట్లు విడుదల చేసింది. నగర నడిబొడ్డున ఈ మ్యూజియం ఉంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన సాంస్కృతిక శాఖ తరఫున ‘మ్యూజియం గ్రాండ్ స్కీం’ ద్వారా ఏటా భారత దేశంలోని మూడు మ్యూజియాలను ఎంపిక చేసి వాటి మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తారు.

ఆ మేరకు 2013 సెప్టెంబర్ 13న సాంస్కృతిక శాఖ నిపుణుల కమిటీ సమావేశం నిర్వహించింది. వీరు ఎంపిక చేసిన మూడు మ్యూజియంలలో నాగపూర్‌లోని సెంట్రల్ మ్యూజియం కూడా ఉంది. దీని మరమ్మతులకు రూ.14 కోట్ల నిధులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సదరు నిధులు మంజూరయినట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ నుంచి డెరైక్టర్‌కు ఇటీవల సమాచారమందింది. ఈ మ్యూజియంను 1857-1860 మధ్య కాలంలో అప్పటి జిల్లాధికారి సర్ రిచర్డ్ టెంపల్ నిర్మించారు. యాంటిక్ కలెక్షన్ సొసైటీ ద్వారా సేకరించిన దేశ, విదేశాలకు చెందిన అనేక అద్భుతమైన వస్తువులను ఇందులో ఉంచారు.

 సిబ్బంది నిర్లక్ష్యంతో నిధుల లేఖ మాయం..
 ఇదిలా ఉండగా అజబ్ బంగ్లా) మరమ్మతులకు నిధులు విడుదల చేస్తున్నట్లు ఆరు నెలల కిందట కేంద్రం పంపించిన లేఖ అదృశ్యమైంది. నిధులు మంజూరు విషయాన్ని 2013 డిసెంబర్ తొమ్మిదో తేదీన సాంస్కృతిక శాఖ కార్యదర్శి సంజయ్‌కుమార్‌కు అందిన లేఖను ఆయన మ్యూజియం బాధ్యుడు మధుకర్ కఠాణేకు పంపించారు. కాగా మ్యూజియం డెరైక్టర్‌కు ఈ లేఖకు సంబంధించిన సమాచారం లేకపోవడం గమనార్హం.

 ఆరు నెలల నుంచి ఆ లేఖ విషయం తెలియని డెరైక్టర్‌కు నిధుల విడుదల విషయం తెలిసి అవాక్కయ్యారు. లేఖ గురించి మధుకర్‌ను ప్రశ్నించగా తనకు తెలియదని ఆయన దాటవేశాడు. ఇదిలా ఉండగా, మ్యూజియంను సందర్శించేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ బృందం త్వరలో రానుండటంతో ఇప్పుడు మ్యూజియం అధికారులందరూ ఆ లేఖ వేటలో పడ్డారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement