పోలీసులు, చైన్ స్నాచర్లు డిష్యూం డిష్యూం | Sakshi
Sakshi News home page

పోలీసులు, చైన్ స్నాచర్లు డిష్యూం డిష్యూం

Published Wed, Sep 17 2014 10:10 AM

సీఐని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే, పోలీసు కాల్పుల్లో గాయపడిన దొంగ

యలహంక : నగరంలోని యలహంక పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఓ చైన్ స్నాచింగ్ ఘటనకు సంబంధించి పోలీసులు సకాలంలో స్పందించారు. తాము ఏ సమయంలోనైనా అప్రమత్తంగా ఉంటామని ఉద్యాన నగరి పోలీసులు చాటి చెప్పారు. చైన్ స్నాచింగ్‌కు పాల్పడి పారిపోతున్న స్నాచర్లను పట్టుకునే క్రమంలో వారు ఎదురుదాడికి దిగడంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో స్నాచర్ అప్పి అలియాస్ అప్పు అలియాస్ రాజు (27) అనే నిందితుడి ఎడమకాలి తొడలో బుల్లెట్ గాయమైందని బెంగళూరు అడిషనల్ కమిషనర్ రవి తెలిపారు. నిందితుడి దాడిలో గాయపడిన యలహంక సీఐ రాజీవ్‌గౌడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు.  
 
 వివరాలు... మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఇక్కడి కెంపేగౌడ విమానాశ్రయంలో పనిచేసే స్వాతి విధులకు వెళ్లడానికి వెంకటాల బస్టాప్ వద్ద వేచి ఉంది. అదే సమయంలో స్నాచర్ అప్పుతో పాటు మరో వ్యక్తి బైక్‌పై వచ్చి స్వాతి మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. అప్రమత్తమైన బాధితురాలు వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చింది. గస్తీలో ఉన్న యలహంక సీఐ రాజీవ్ గౌడ, చిక్కజాల సీఐ మురళీధర్ స్నాచర్లను వెంటాడారు. కొత్తనూరు సమీపంలోని కేఎన్‌ఎస్ కళాశాల సమీపంలోని నీలగరి తోటలో స్నాచర్లను పోలీసులు అడ్డగించారు.
 
 దీంతో స్నాచర్లు కత్తితో సీఐ రాజీవ్ గౌడ చేతిపై దాడి చేశారు. అప్రమత్తమైన ఆయన తన సర్వీస్ రివాల్వర్‌తో ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. దీంతో ఒక బులెట్ అప్పు కాలిలో దూసుకుపోవడంతో అతను కుప్పకూలిపోయాడు. సిబ్బంది హుటాహుటిన రాజీవ్‌తో పాటు నిందితుడిని కూడా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమిషనర్ రవి, యలహంక  ఎమ్మెల్యే ఆర్. విశ్వనాథ్ సీఐ రాజీవ్‌గౌడను పరామర్శించారు. స్నాచర్ అప్పుపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయని, పారిపోయిన మరో స్నాచర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement
Advertisement