‘టీడీపీ నేతలతో శేఖర్‌ రెడ్డికి సంబంధాలు’ | Sakshi
Sakshi News home page

‘టీడీపీ నేతలతో శేఖర్‌ రెడ్డికి సంబంధాలు’

Published Mon, Dec 12 2016 4:31 PM

‘టీడీపీ నేతలతో శేఖర్‌ రెడ్డికి సంబంధాలు’ - Sakshi

హైదరాబాద్‌: గిరిజన సంక్షేమంపై చంద్రబాబు సర్కారుకు చిత్తశుద్ధి లేదని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. ఏపీ ప్రభుత్వం తక్షణమే స్పందించి గిరిజన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. గిరిజన సలహా మండలి వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. పోలవరం నిర్వాసితుల పునరావాసానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.

వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తూర్పు గోదావరి జిల్లా విలీన మండలాల్లో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని కన్నబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాళ్లవాపు బాధితులు, నవజాత శిశు మరణాలు, రంపచోడవరం, చింతూరులో మరుగుదొడ్లు లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల గురించి వైఎస్‌ జగన్‌ చర్చించారని చెప్పారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎంపీ నిధులతో తక్షణమే మరుగుదొడ్లు, ఆర్వో ప్లాంట్లు నిర్మించాలని వైఎస్‌ జగన్‌ ఆదేశించినట్టు తెలిపారు. త్వరలోనే ఈ ఏర్పాట్లన్నీ పూర్తిచేస్తామని చెప్పారు.

టీడీపీ ముఖ్యనేతలతో టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్‌ రెడ్డికి సంబంధాలున్నాయని కన్నబాబు ఆరోపించారు. శేఖర్‌ రెడ్డి ఆర్థిక  వ్యవహారాలపై ఐటీ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరారు. తమిళనాడులోని శేఖర్‌ రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం పట్టుబడిన సంగతి తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement