బిగిసిన ఉచ్చు | Sakshi
Sakshi News home page

బిగిసిన ఉచ్చు

Published Mon, Apr 24 2017 3:04 AM

బిగిసిన ఉచ్చు

► అరెస్టుకు చాన్స్‌
► నేడు నిర్ణయం


సాక్షి, చెన్నై :రెండాకుల చిహ్నం కోసం లంచం వ్యవహారం టీటీవీ దినకరన్‌ను చుట్టుముట్టింది. ఆయన్ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.ఇందుకు అద్దం పట్టే  రీతిలో ఆదివారం ఢిల్లీలో పరిణామాలు సాగాయి. చిహ్నం కోసం ఎన్నికల కమిషన్‌కు రూ. 50 కోట్లు ఎరగా వేసినట్టు అన్నాడీఎంకే (అమ్మ) బహిష్కృత ఉపప్రధాన కార్యదర్శి టీటీవి దినకరన్‌ ఆరోపణల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. శనివారం ఏడెనిమిది గంటల పాటు టీటీవీని ఢిల్లీ పోలీసులు విచారించారు. ఆదివారం కూడా ఆయన వద్ద విచారణ సాగడంతో ఇక,  ఉచ్చు మరింతగా బిగిసినట్టేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. పలు కోణాల్లో టీటీవీని ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు విచారించారు.

సెల్‌ఫోన్‌ నంబర్లు, సంభాషణల ఆధారంగా పలు రకాల ప్రశ్నలతో టీటీవీని ఉక్కిరి బిక్కిరి చేయడంతో పాటు పట్టుబడ్డ బ్రోకర్‌ ఇచ్చిన వివరాల ఆధారంగా మరి కొందరి పేర్లను వివరిస్తూ టీటీవీకి ప్రశ్నల్ని పోలీసులు సం««ధించారు. అనేక ప్రశ్నలకు తెలియదు, సంబంధం లేదు, చూడలేదు అన్న సమాధానాల్నే టీటీవీ ఇచ్చినట్టు సమాచారం. సోమవారం సాగే తుది విచారణ మేరకు టీటీవీని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.

ఆయన్ను అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచి కటకటాల్లోకి నెట్టే అవకాశాలు ఉన్నట్టు ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారాలు టీటీవీ మద్దతుదారుల్ని ఆందోళనలో పడేస్తున్నది. అయితే, ఆయన నిర్ధోషిగా చెన్నైకు వస్తారన్న నమ్మకాన్ని ఆయన మద్దతు ఎమ్మెల్యే ఒకరు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. టీటీవీని ఇరకాటంలో పెట్టి, కేసు బలపడే విధంగా మరో పది మంది పేర్లను జాబితాలోకి ఢిల్లీ పోలీసులు ఎక్కించినట్టు తెలిసింది. ఇందులో టీటీవీ సన్నిహితులు ఇద్దరుతో పాటు, ఎన్నికల కార్యాలయంలో పనిచేసిన మాజీ ఉద్యోగులు, ప్రస్తుతం ఉన్న కింది స్థాయి సిబ్బంది కూడా ఉన్నట్టు సమాచారం.

Advertisement
Advertisement