ఆన్‌లైన్‌లో పాస్‌పోర్‌‌ట పరిశీలన | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో పాస్‌పోర్‌‌ట పరిశీలన

Published Fri, Jul 17 2015 3:10 AM

Checking passports in online

 చెన్నై, సాక్షి ప్రతినిధి: పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు శుభవార్త. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులను పరిశీలించే విధానం ఈ ఏడాది నవంబర్ నుంచి అమల్లోకి రానుంది. దేశంలోని మహానగరాల్లో ఒకటైన చెన్నైలో అమెరికన్ ఎంబసీ, శ్రీలంక రాయబార కార్యాలయం, అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. తమిళనాడుకు చెందిన ఎందరో పారిశ్రామిక వేత్తల ద్వారా విదేశీ మార్కెట్‌తో ఎగుమతులు, దిగుమతులు సాగుతుంటాయి. ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం వేలాది మంది విద్యార్థులు చెన్నై నుంచి వెళుతుంటారు. గతంలో విదేశాలకు వెళ్లదలిచిన వారు మాత్రమే పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకునేవారు. ఇలాంటి వారి సంఖ్య స్వల్పంగా ఉండేది. కానీ సాఫ్ట్‌వేర్ కంపెనీల పుణ్యమా అని భారత్‌కు ప్రపంచ దేశాలకు మధ్య దూరం తగ్గిపోయింది. రెండు దశాబ్దాలుగా పాస్‌పోర్టుల సంఖ్య పెరిగిపోయింది. చెన్నై నగరం నుంచి సగటున రోజుకు వెయ్యి మంది వరకు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. గత ఏడాది చెన్నై నుంచి రెండు లక్షల పాస్‌పోర్టులు మంజూరయినాయంటే వీటి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
 
 పోలీస్ తనిఖీలు తప్పనిసరి
 పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోగానే అధికారికంగా పడే తొలిఅడుగు పోలీస్ వెరిఫికేషన్ (పోలీస్ తనిఖీలు). జిల్లా స్థాయిలో ఎస్పీలు, నగరంలో పోలీస్ కమిషనర్లు స్వయంగా పాస్‌పోర్టు దరఖాస్తుల వ్యవహారాన్ని పరిశీలిస్తుండగా, పోలీస్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా పాస్‌పోర్టు పరిశీలన విభాగాలే ఉన్నాయి. సంబంధిత విభాగానికి చెందిన పోలీసులు దరఖాస్తు దారుడి నివాసం , ఆపరిసరాల్లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అతనిపై ఏమైన కేసులు, రౌడీషీట్లు వంటివి ఏమైనా ఉన్నాయాని తనిఖీ చేస్తారు. ఆ తరువాత ఇంటికి వచ్చి చిరునామాను నిర్ధారణ చేసుకుని ఇతర వివరాలపై విచారణ జరుపుతారు. అన్నీ సంతృప్తికరంగా ఉన్న పక్షంలో మాత్రమే పాస్‌పోర్టు మంజూరుకు సిఫార్సు చేస్తారు. చె న్నై నగరంలో రోజు రోజుకూ పాస్‌పోర్టు దరఖాస్తుల సంఖ్య పెరిగిపోతుండగా, వాటి పరిశీలనకు నేరుగా వెళ్లడంలో జాప్యం జరుగుతోంది. సిబ్బంది కొరత, దరఖాస్తు దారుడు ఇంటిలో లేకపోవడం వంటి అనేక కారణాలతో ఒక్కో దరఖాస్తు పరిశీలనకు కనీసం వారం నుండి 20 రోజులు పడుతోంది.
 
 ఇక ఆన్‌లైన్‌లోనే పోలీస్ తనిఖీలు
 పాస్‌పోర్టు దరఖాస్తులపై పోలీస్ పరిశీలనలో జాప్యాన్ని నివారించేందుకు ఆన్‌లైన్ విధానం అమలులోకి తెస్తున్నారు.  జనాభా జాబితా, ఆధార్ కార్డు, ఓటరు కార్డు తదితర వివరాలను పొందుపరుస్తారు. క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్ పేరుతో దరఖాస్తులను అనుసంధానం చేస్తారు. ఈ రకమైన్ ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు దారునిపై ఏమైనా కేసులు ఉన్నాయా అనే సంగతి పోలీస్ కార్యాలయం నుండే పసిగట్టేస్తారు. కేసులు లేని పక్షంలో వెంటనే పాస్‌పోర్టు మంజూరుకు సిఫార్సు చేస్తారు. ఈ విధానం వల్ల దరఖాస్తు దారుని ఇంటికి, పరిసరాల్లోని పోలీస్ స్టేషన్లకు పోలీసు సిబ్బంది తిరిగే బాధ తప్పుతుంది. అంతేగాక జాప్యానికి తావులేకుండా పాస్‌పోర్టు మంజూరవుతుంది. చెన్నైకు సంబంధించి పోలీస్ కమిషనర్ జార్జ్ స్వియ పర్యవేక్షణలో పాస్‌పోర్టు విభాగం పనిచేస్తోంది. పోలీసు తనిఖీలు ముగిసిన దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారానే పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి పాస్‌పోర్టు కార్యాలయానికి పంపే విధానం ఇప్పటికే అమలులో ఉండటం విశేషం.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement