తీవ్రవాదుల తిష్ట | Sakshi
Sakshi News home page

తీవ్రవాదుల తిష్ట

Published Sun, May 4 2014 12:00 AM

Chennai blasts: CB-CID team rushes to Bangalore

సాక్షి, చెన్నై:చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న బెంగళూరు - గువాహటి ఎక్స్‌ప్రెస్ రైల్లో వరుస పేలుళ్ల కేసు ఛేదించడం సీబీసీఐడీకి సవాల్‌గా మారింది. ఏడీజీపీ కరణ్ సిన్హా పర్యవేక్షణలో, ఐజీ మహేశ్‌కుమార్ పర్యవేక్షణలో ఎస్పీలు అన్భు, జయ గౌరి నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఓ బృందం బెంగళూరులో తిష్ట వేసింది. అక్కడి రైల్వే స్టేషన్లో లభించిన సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా ఇద్దరు అనుమానితులను గుర్తించినట్టు సమాచారం. దీంతో కరణ్ సిన్హా శనివారం హుటాహుటిన బెంగళూరు బయలుదేరి వెళ్లారు. అక్కడ విచారణను మరింత వేగవంతం చేశారు.
 
 రెహ్మాన్ ఎక్కడ?: బెంగళూరు నుంచి బయలుదేరిన ఎక్స్‌ప్రెస్‌లో ఎస్ 4, ఎస్ 5 బోగీల్లో రెహ్మాన్ అనే ఒకే వ్యక్తి పేరిట గువాహటికి బెర్త్‌లు రిజర్వు అయ్యాయి. అయితే, ఆ వ్యక్తి చెన్నై వరకు ప్రయాణించలేదని విచారణలో వెలుగు చూడడంతో అతడి కోసం అన్వేషణ ఆరంభం అయింది. టికెట్ బుకింగ్ సందర్భంగా ఇచ్చిన చిరునామాలు నకిలీవిగా తేలడంతో రెహ్మాన్ మీద అనుమానాలు బలపడుతున్నాయి. ఇక, బాంబ్‌లో టైమర్‌ను ఒంటి గంట, రెండు గంటల మధ్యలో అమర్చి ఉండొచ్చని విచారణలో తేలింది. టైమర్‌ను సెట్ చేసినానంతరం అతడు తదుపరి రైల్వే స్టేషన్లో ఎక్కడైనా దిగి ఉడాయించాడా?  అన్న కోణంలో ఆయా స్టేషన్లలో బుధ, గురువారం నమోదైన సీసీ కెమెరా పుటేజీలను క్షుణ్ణంగా పరిశీ లిస్తున్నారు. రైలు అరక్కోణం సమీపంలో సిగ్నల్ దొరక్క ఆరు నిమిషాలు ఆగినట్టు తేలింది. చీకట్లో ఇక్కడ దిగినా, దిగి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో చెన్నై సెంట్రల్‌కు ఆ రైలు చేరుకోగానే, ఎస్ 3 నుంచి దిగి  హడావుడిగా పరుగులు తీసిన వ్యక్తే రెహ్మానా? అన్న దిశగా విచారణ బృందం ఆరా తీస్తున్నది.
 
 నిఘా సమాచారం: రాష్ర్టంలో ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్ర వాదులు తిష్ట వేసి ఉన్నట్టుగా కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. వీరి ఆచూకీ కోసం జల్లెడ పట్టే పనిలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం నిమగ్నం అయింది. గువాహటి పేలుడును పరిశీలించిన కేంద్ర బృందం బీహార్ చెరలో ఉన్న తీవ్రవాదుల్ని విచారించినట్టు తెలిసింది. ఆ తీవ్రవాదులు ఇచ్చిన సమాచారం మేరకు తమిళనాడులోని ప్రధాన నగరాల్లో ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులు తిష్ట వేసి ఉన్నట్టు, తమిళనాడు మీద వారి గురి తీవ్రంగానే ఉన్నట్టుగా తేలింది. దీంతో అక్కడ నుంచి వచ్చిన సమాచారంతో ఆయా జిల్లాల ఎస్పీలు, ఆయా నగరాల్లో కమిషనర్లు అలర్ట్ అయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేస్తూ, తనిఖీలను ముమ్మరం చేశారు. అలాగే, అనుమానితులు ఎక్కడైనా నివాసం ఉన్నా, సంచరిస్తున్నా, తమకు సమాచారం అందించాలని ప్రజలకు సూచిస్తున్నారు.
 
 
 అష్రాఫ్ అలీ అరెస్టు:  కడలూరు జిల్లా పరింగి పేట్టైలో తిష్ట వేసిన అష్రాఫ్ అలీని అక్కడి పోలీసుల సహకారంతో రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. నిషేధిత ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్ర వాద సంస్థకు చెందిన అష్రాఫ్ అలీ రాజస్థాన్‌లోని జోద్‌పూర్ వాసి. ఇతడి మీద అక్కడ అనేక కేసులు ఉన్నాయి. అజ్ఞాతంలోకి వెళ్లిన అష్రాఫ్ అలీ కడలూరు తూక్కనాంబాక్కంలో తిష్ట వేశాడు. ఇతడిని స్థానిక పోలీసులు తొలుత అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద జరిపిన విచారణతో రాజస్థాన్ పోలీసులు రంగంలోకి దిగారు. స్థానిక పోలీసుల సహకారంతో అష్రాఫ్ అలీని అరెస్టు చేసిన రాజస్థాన్ పోలీసులు కోర్టులో హాజరు పరిచి శనివారం తమ రాష్ట్రానికి తీసుకెళ్లారు. జోధ్‌పూర్  కోర్టులో ఇతడిపై వారెంట్ ఉన్న దృష్ట్యా, అక్కడ హాజరు పరిచినానంతరం విచారణ నిమిత్తం మళ్లీ కడలూరుకు తీసుకురాబోతున్నారు. ఇతడి అరెస్టుతో రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఈ సంస్థ సానుభూతిదారులు తిష్ట వేసి ఉన్నారో? అన్న ఆందోళన నెలకొంది.
 
 ముజాహిద్దీన్ హస్తం : గువాహటి పేలుడు వ్యవహారంలో ఇండియన్ ముజాహిద్దీన్ హస్తం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జరిగిన రైలు బాంబు పేలుడు ఘటనలో, తాజా కేసుకు లింక్ ఉన్నట్టుగా సీబీసీఐడీ భావిస్తోంది. అయితే, భారీ ఎత్తున విస్ఫోటనం లక్ష్యంగా కుట్ర పన్నినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైలు సకాలంలో చెన్నై సెంట్రల్‌కు వచ్చి వెళ్లి ఉన్న పక్షంలో, మార్గమధ్యలో రైలు వేగానికి భారీ ప్రమాదం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్ 3, 4, 5 బోగీలు పూర్తిగా దగ్ధం అయ్యేవని, మిగిలిన బోగీలు బొల్తా కొట్టి ఉండేవని, భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేదని విచారణ బృందం పేర్కొంటున్నది. బాంబులను బెర్త్ కింద నిలబెట్టిన ఆకారంలో, దాని మీద రవ్వ ప్యాకెట్లు పేర్చినట్టుగా అమర్చినట్టుందని చెబుతున్నారు. అందు వల్లే బోగి కింది భాగం దెబ్బతిని ఉందని ఓ అధికారి పేర్కొన్నారు. రైలు కింది భాగం టార్గెట్ చేసి ఉన్న దృష్ట్యా, రన్నింగ్‌లో పేలుడుకు వ్యూహ రచన చేసి ఉండటం స్పష్టం అవుతోందన్నారు. ఇలాంటి కుట్రలు, వ్యూహ రచనల్లో ఇండియన్ ముజాహిద్దీన్ దిట్ట అని పేర్కొనడం గమనార్హం.
 
 యాడ్‌కు బోగీలు : తొమ్మిదో నెంబర్ ఫ్లాట్ ఫాం మీదున్నప్పుడు పేలుడుతో దెబ్బ తిన్న ఎస్ 3, 4, 5 బోగీల్ని 11వ నెంబర్ ప్లాట్‌ఫామ్‌కు తరలించారు. ఆ బోగిల్లో తనిఖీలు పూర్తి అయ్యాయి. కేంద్ర బలగాలతో పాటుగా, రాష్ట్ర సీబీసీఐడీ, వేలి ముద్ర నిపుణులు పరిశీలన ముగించారు. శనివారం ఉదయం జీహెచ్ వైద్య బృందం సైతం అక్కడ తనిఖీలు, పరిశీలన జరిపింది. ప్రధానంగా మృతి చెందిన స్వామి బెర్త్ వద్ద క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఈ బోగీలను బేషిన్ బ్రిడ్జి యార్ట్‌కు ఓ ఇంజన్ సాయంతో తరలించారు. ఇక, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతున్నది. విశాఖ పట్నంకు చెందిన మురళి, బెంగళూరుకు చెందిన సికిందర్, అస్సోంకు చెందిన ఉమారాణి, మణిపూర్‌కు చెందిన అల్తాఫ్ ఖాన్‌ను డిశ్చార్జ్ చేశారు.
 
 బూచీలు : బాంబు బూచీలు, అనుమానాస్పద బ్యాగ్, సూట్ కేసులు బాంబ్, డాగ్‌స్క్వాడ్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఉదయం 11వ నెంబర్ ఫ్లాట్‌ఫాంలో ఓ బ్యాగ్ కలకలం సృష్టించింది. చివరకు అందులో దుస్తులు మాత్రమే ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. కడలూరు జిల్లా చిదంబరం సమీపంలోని మారియప్ప నగర్‌లో ఓ ఇంట్లో నాటు బాంబులు పేలడంతో ఆందోళన నెలకొంది. పన్నీరు సెల్వం అనే ప్రొఫెసర్‌కు చెందిన ఇంట్లో చిదంబరం అన్నామలై వర్సిటీకి చెందిన సిబ్బంది అరుణ్ నివాసం ఉంటున్నారు. ఉదయం 11.30 గంటల సమయంలో అరుణ్ ఇంట్లో నుంచి భారీ పేలుడు శబ్ధం రావడంతో ఆ పరిసరాల్లో కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆ ఇంట్లో గాయాలతో పడి ఉన్న ఓ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆ సమయంలో అరుణ్‌తో పాటుగా మరొకరు అదృశ్యం కావడంతో అనుమానాలు నెలకొన్నాయి. విచారణ వేగం పుంజుకుంది.  

 

Advertisement
Advertisement