ప్రతిపక్ష పార్టీలకు పచ్చకామెర్లు | Sakshi
Sakshi News home page

ప్రతిపక్ష పార్టీలకు పచ్చకామెర్లు

Published Sat, May 14 2016 3:24 AM

ప్రతిపక్ష పార్టీలకు పచ్చకామెర్లు - Sakshi

అందుకే అభివృద్ధి కనిపించడంలేదు
నాపై నిరాధార ఆరోపణలు
ఏమీ దొరక్క చేతి వాచీపై రాద్ధాంతం
మూడేళ్లలో ఒక్క కుంభకోణం,అవినీతి లేకుండా పాలన-సీఎం సిద్ధరామయ్య

 
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీలకు పచ్చకామెర్ల రోగం పట్టుకుందని, అందుకే వారికి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడంలేదని, తనపై చేసినవన్నీ నిరాధార ఆరోపనలేనని, చివరకు ఏమీ దొరక్క చేతివాచీపై  రాద్ధాంతం రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దుయ్యబట్టారు. దేవనహళ్లిలోని భీరసంద్ర గ్రామంలో శుక్రవారం బెంగళూరు గ్రామీణ జిల్లాకు జిల్లా కలెక్టర్ కార్యాలయం నిర్మాణం, పలు  అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.  మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 165 హామీలలో ఇప్పటికే 120 హామీలు నేరవేర్చిందన్నారు. మూడేళ్ల పాలనలో ఒక్క కుంభకోణం లేకుండా పాలించిన ఘటన తమదేనన్నారు.

బీజేపీ పాలనలో ముఖ్యమంత్రితో పాటు అందరూ జైలుపాలయినవాళ్లేనన్నారు. అలాంటి వారు తమకు అభివృద్ధి పాఠాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను మైనారిటీ, వెనుకబడిన వర్గాల పరంగా పనిచేస్తానని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయని, అందులో సందేహమేమీ లేదన్నారు. అలాగని మిగతా వర్గాల వారికి అన్యాయం చేయడంలేదన్నారు. అభివృద్ధిలో రాజకీయాలు చేయరాదని ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు.

ఎత్తినహొళె పథకానికి రూ. 13 వేల కోట్ల నిధులు మంజూరు చేసానని, ఇంకా ఎంతకావాలన్నా ఇస్తానని చెప్పారు. రాష్ట్రంలో కరువు పరిస్థితిని ప్రభుత్వం విజయవంతంగా నిభాయిస్తోందన్నారు. విద్యుత్ శాఖమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడడానికి గత బీజేపీ ప్రభుత్వం అనుసరించిన విద్యుత్ విధానాలేనన్నారు. హోం మంత్రి పరమేశ్వర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అవినీతిరహిత పాలన అంందించిందన్నారు. కార్యక్రమంలో పలు ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారులకు ఆదేశపత్రాలు, చెక్కులు అందజేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కృష్ణభైరేగౌడ, మంత్రులు శ్రీనివాసప్రసాద్, హెచ్‌కే పాటీల్, ఖమర్ ఉల్ ఇస్లాం, అంబరీష్, ఆంజనేయ, ఉమాశ్రీ, ఎంపీ వీరప్పమొయిలీ, ఎమ్మెల్సీ ఎస్ రవి, ఎమ్మెల్యేలు వెంకరటమణయ్య, ఎంటీబీ నాగరాజు, పిళ్లమునిశామప్ప, శ్రీనివాసమూర్తి, జిల్లా కలెక్టర్ పాలయ్య, ఎస్పీ రమేశ్‌బానోత్, జిల్లా,తాలూకా,గ్రామ పంచాయ్తీల ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement