చెలరేగుతున్న ఇసుక మాఫియా | Sakshi
Sakshi News home page

చెలరేగుతున్న ఇసుక మాఫియా

Published Mon, Aug 10 2015 2:14 AM

చెలరేగుతున్న ఇసుక మాఫియా - Sakshi

బళ్లారి : రాష్ట్రంలో ఇసుకకు ఉన్న డిమాండ్‌ను గమనించిన పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన తెలుగు దేశం పార్టీ ప్రముఖ నాయకులు బరితెగించారు. అక్రమంగా కర్ణాటక ప్రాంతానికి ఇసుక తరలిస్తూ రాష్ట్ర ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. బళ్లారి జిల్లా ఎస్పీగా ఆర్.చేతన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు సాగిస్తున్న ఇసుక అక్రమ తవ్వకాలను కొందరు నిలిపి వేశారు. దీంతో ఇసుక లభ్యం కాక బళ్లారి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నూతన కట్టడాలు, పలు అభివృద్ధి పనుల్లో జాప్యం చోటు చేసుకుంది. ఇదే అదనుగా భావించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వచీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు అనుచరులు పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తూ రూ. లక్షలకు లక్షలు ఆర్జిస్తున్నారు.

అక్కడ అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమే కావడంతో బొమ్మనహాల్ మండలానికి చెందిన టీడీపీ ప్రముఖులు ఇసుక తవ్వకాలను యథేచ్ఛగా కానిస్తున్నారు. పగలంగా భారీ జేసీబీలతో ఇసుక తవ్వి ట్రాక్టర్లు, లారీల ద్వారా రాష్ట్ర సరిహద్దులో డంప్ చేసుకుని రాత్రికి రాత్రే బళ్లారికి రవాణా చేస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులోని బొమ్మనహాల్ మండలంలోని వేదవతి, హగరి, చిన్న హగరి వాగులు, వంకలలో ఇసుక తవ్వకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. తాము సాగిస్తున్న అక్రమ వ్యాపారం బయటపడకుండా ఉండేందుకు ఇసుక లోడుపై కంకరలో నుంచి వచ్చే వైట్ డస్ట్‌ను కప్పేసి తరలిస్తున్నారు. ఇటీవల రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతల ఇసుక దందాపె మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పట్లో  కణేకల్లు మండలం రచ్చుమర్రి శివార్లులో టీడీపీ నేతలు సాగిస్తున్న ఇసుక తవ్వకాలపై పోలీసులు తనిఖీ చేసి పలువురిని అరెస్ట్ చేశారు. అయినా అక్రమ సంపాదనకు అలవాటు పడిన టీడీపీ నేతలు ఇసుక తవ్వకాలు ఆపడం లేదు. బళ్లారిలో ఎవరైనా కిందిస్థాయి పోలీసులు అడ్డు వస్తే వారికి అంతో ఇంతో ముడుపులు చెల్లించి అనుకున్న ప్రాంతానికి ఇసుకను తరలిస్తున్నారు. బొమ్మనహళ్ నుంచి బళ్లారికి ఇసుకను తరలించి ఇక్కడి నుంచి బెంగళూరుకు కూడా రవాణా చేస్తున్నట్లు టీడీపీ నేతలు పేర్కొంటుండడం గమనార్హం. ఒక్కొక్క లారీ, టిప్పర్  ఇసుక రూ.20 వేల నుంచి రూ.25 వేల దాకా అమ్ముతూ ప్రతినిత్యం లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు.

 రాత్రి 10 గంటల తర్వాత బొమ్మనహాల్ నుంచి నేరుగా బళ్లారి రింగ్ రోడ్డుకు చేరుకుని అక్కడ నుంచి విడిపోయి ఒప్పందం కుదుర్చుకున్న ప్రాంతాలకు ఇసుకను లిఫ్ట్ చేస్తున్నారు. అటు రాయదుర్గం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి ప్రముఖ టీడీపీ నాయకులు తమ అంగబలంతో సాగిస్తున్న ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవడంతోపాటు, కర్ణాటక ఆదాయానికి గండి కొడుతూ అక్రమంగా ఇసుక దందా చేస్తున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని బళ్లారి వాసులు కోరుతున్నారు.
 
 

Advertisement
Advertisement