పచ్చడి ప్రచారం | Sakshi
Sakshi News home page

పచ్చడి ప్రచారం

Published Tue, Apr 1 2014 12:49 AM

Chutney campaign

  • ఏ పండుగకు.. ఆ గొడుగు
  •  ఉగాది పచ్చడి పంచుతూ ఓట్ల అభ్యర్థన
  •  నేడు జోరుగా ‘వర్ష తొడకు’
  •  ‘కోడ్’ కంట పడకుండా ఏర్పాట్లు
  •  ఆప్తుల ఇళ్లల్లో విందులు
  •  ఉదయం నుంచి రాత్రి దాకా ‘పండుగే’
  •  సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఉగాది పచ్చడిగా బెల్లం, వేపాకును ఇవ్వడం ఆనవాయితీ. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా అన్ని పార్టీల అభ్యర్థులు చిన్నపాటి కవర్లలో వీటిని ఓటర్లకు పంచుతూ ఓట్లను అర్థించారు. బెంగళూరు ఉత్తర కాంగ్రెస్ అభ్యర్థి సీ. నారాయణస్వామి, శివమొగ్గలో జేడీఎస్ అభ్యర్థి గీతా శివ రాజ్ కుమార్‌లు ఓటర్లకు ఉగాది శుభాకాంక్షలు చెబుతూ, ఉగాది పచ్చడిని పంచుతూ ప్రచారాన్ని కొనసాగించారు. ఇంకా పలు నియోజక వర్గాల్లో కూడా అభ్యర్థులు ఈ తరహా ప్రచారాన్నే ఎంచుకున్నారు.

    పండుగ పూట ఇలా చేయడం ద్వారా ప్రజల ఆచార, వ్యవహారాల్లో తాము భాగస్వాములనే అభిప్రాయాన్ని కలిగించడానికి ప్రయత్నించారు. దీని కోసం రెండు, మూడు రోజులు ముందుగానే ఉగాది పచ్చడిని సిద్ధం చేసుకున్నారు. మరో వైపు మంగళవారం వర్ష తొడకు (మాంసాహార విందు)ను కూడా పెద్ద ఎత్తున ఆచరిస్తున్నందున, కొన్ని నియోజక వర్గాల్లో అభ్యర్థులు తమ అనుయాయుల ద్వారా విందు ఏర్పాట్లు చేశారు.

    ఎన్నికల నియమావళి ఉల్లంఘించామనే అపవాదు రాకుండా సకల జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో తమకు అత్యంత ఆప్తులైన నాయకుల ఇళ్ల వద్ద ఇలాంటి విందులను ఏర్పాటు చేశారు. పండుగ కనుక ఎన్నికల కమిషన్ కూడా అంత సులభంగా తమను గుర్తించలేదని పలువురు నాయకులు ఈ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి ఇలాంటి విందులకు కొదవ ఉండదు.
     

Advertisement
Advertisement