మూతబడుతున్న సినిమా హాళ్లు... | Sakshi
Sakshi News home page

మూతబడుతున్న సినిమా హాళ్లు...

Published Wed, Jun 22 2016 1:35 AM

మూతబడుతున్న సినిమా హాళ్లు... - Sakshi

బరంపురం : నిత్యం పలు ఒత్తిళ్లతో సతమతమయ్యే ప్రజలకు మానసికానందాన్ని ఇచ్చేది కళ. తొలుత రంగ స్థలం.. తర్వాత వెండి తెర ప్రజలను కష్టాలు మరిపించి సేదతీర్చేవి.. కాలక్రమంలో ఆ రంగాలకు ఆదరణ తగ్గింది. గతంలో సినిమా హాళ్లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోయేవి.. కానీ ప్రస్తుతo  సినిమా హాళ్లు మూతబడుతున్నాయి.. మారుతున్న ప్రేక్షకాభిరుచితో పాటు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ విధానాలు సినిమా హాళ్ల పాలిట గుదిబండలా తయారయ్యాయి.

నిర్వహణ వ్యయం ఎక్కువ కావడంతో థియేటర్లను మూసివేస్తున్నారు. వాటి స్థానంలో వాణిజ్య కేంద్రాలు వెలుస్తున్నాయి. బరంపురం.. దక్షిణ ఒడిశాలో కీలకమైన నగరం. కొన్ని దశాబ్దాల కిందట సినిమా చూడాలంటే చాలా దూరం నుంచి కూడా ఇక్కడి వచ్చేవారు. మూకీ సినిమాలు కూడా ఇక్కడ ప్రదర్శించిన ఖ్యాతి ఉంది. రాష్ర్టంలోనే తొలి సినిమా హాలు ఇక్కడ నిర్మించారు. 1927లో ఆత్మకూరి వంశీకులు ఎస్‌ఎస్‌వీటీ సినిమా హాల్‌ను ప్రారంభించారు.

 సుమారు ఆరేళ్ల కిందటి వరకు నగరంలో 12 సినిమా హాళ్లు ప్రేక్షకులతో కళకళలాడేవి. వాటిలో ఏడు మూతబడగా, మరో ఐదు అదే బాటలో ఉన్నాయి. జ్యోతి సినిమా హాల్ త్రీస్టార్ హోటల్‌గా మారింది. విజయ టాకీస్ కల్యాణ మండపంగా మారింది. ఉత్కళ్ సినిమా హాల్ అపార్ట్‌మెంట్‌గా మారింది. కుటుంబ వివాదాలతో ఎస్‌ఎస్‌వీటీ సినిమా హాలు శిథిలావస్థకు చేరింది. లింగరాజ్ సినిమా హాల్ పాఠశాలగా మారితే, పద్మిని సినిమా హాల్ వాహనాల షోరూంగా మారింది.  ఫైలిన్ తుపాను తాకిడికి కూలిన పరంజ్యోతి సినిమా హాల్ తలుపులు మళ్లీ తెరవలేదు. కాగా, కొమ్మాపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న సినిమా హాల్ అర్ధంతరంగా నిలిచిపోయింది.

 ‘పన్ను’లూడగొడుతున్నారు
 రాష్ర్టంలో సినిమా హాళ్లను ప్రభుత్వం నాలుగు కేటగిరీలుగా విభజించింది. కార్పొరేషన్ పరిధిలో 25 శాతం, మున్సిపాల్టీ పరిధిలో 20 శాతం, ఎన్‌ఏసీ పరిధిలో 10 శాతం, పంచాయతీ పరిధిలో 5 శాతం చొప్పున సినిమా హాళ్ల నుంచి వినోదపు పన్ను వసూలు చేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో వినోద పన్ను చాలా తక్కువగా ఉంది. ఒడిశాలో 25 శాతం వసూలు చేస్తున్నారు.  ప్రేక్షకుల రాక తగ్గడం, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎక్కువగా ఉండడంతో సినిమా థియేటర్ నిర్వాహకులకు భారమైంది. దీంతో సినిమా హాలు నిర్వహణ కన్నా ఇతర వ్యాపారాలు లాభదాయకంగా కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో 200 సినిమా హాళ్లలో వందపైగా మూతబడినట్లు అంచనా. దీనికి తోడు పైరసీ సీడీలు, టీవీల్లో తెలుగు, హిందీ, ఇతర భాషల కొత్త చిత్రాలు ప్రసారం కావడం కూడా సినిమా హాళ్ల మూసివేతకు ఒక కారణంగా చెబుతున్నారు.
 
 వినోదపు పన్ను ఎత్తేస్తేనే..
 రాష్ట్రంలో వినోదపు పన్ను సినిమా హాళ్లకు భారమైందని స్థానిక గౌతం సినిమా హాల్ యజమాని కోట్‌ని శివ ప్రసాద్ అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో వినోద పన్ను ఎక్కువగా ఉందని  చెప్పారు. తెలుగు, హిందీ చిత్రాలకు ఆదరణ తగ్గింది. ఒడియా చిత్రాలకు ఆదరణ పెరిగిందన్నారు. ఒడియా చిత్రాల నిర్మాణ వ్యయం తక్కువ కావడంతో సినిమా హాలు యజమానులకు నాలుగు పైసలు మిగులుతున్నాయని తెలిపారు. నగరంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉండడంతో రాత్రి రెండో ఆటకు ప్రేక్షకులు రావడం లేదన్నారు. దీంతో ప్రేక్షకులు లేక నెలలో సుమారు పది రోజులు సెకండ్ షో వేయడం లేదని చెప్పారు. బ్యాంక్ రుణాలతో థియేటర్లు నిర్మిస్తే కొన్నాళ్లకు మూసేయాల్సిన పరిస్థితి నెలకొంటోందన్నారు. దీనికితోడు సినిమా హాళ్లను ఒడిశా ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆదుకోవడం లేదని చెప్పారు.
 
 పైరసీ అరికట్టకపోతే అంతే..
 పైరసీ సీడీలు సినిమా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఒడిశా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సంఘం అధ్యక్షుడు పెల్లిబాబు అన్నారు.  సినిమా రిలీజైన మర్నాడే పైరసీ సీడీలు విచ్చలవిడిగా చలామణి కావడం థియేటర్ల ఆదాయాన్ని దెబ్బ కొడుతున్నాయి. పైరసీ సీడీలను అరికట్టకపోతే ఉన్న అరకొర సినిమా హాళ్లు కూడా మూతబడే ప్రమాదం ఉందని చెప్పారు. పైరసీ సీడీలను అరికట్టేందుకు కొత్త చట్టం రూపొందించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిపారు.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement