అసంతృప్తి సెగ | Sakshi
Sakshi News home page

అసంతృప్తి సెగ

Published Sat, Jan 7 2017 3:51 AM

CM waiting  for Shashikala

అన్నాడీఎంకేలో  మాజీల వేరుబాట
దుష్టశక్తులను తరిమికొట్టాలని శశికళ పిలుపు

శశికళ కోసం సీఎం పడిగాపులు


సాక్షి ప్రతినిధి, చెన్నై : అన్నాడీఎంకే పార్టీ అసంతృప్తితో రగిలిపోతోంది. శశికళ సారథ్యాన్ని సహించలేని సీనియర్‌ నేతలు నిరసన వ్యక్తం చేసేందుకు వేరుబాట లేక పోరుబాటగా లోలోన సన్నాహాలు చేస్తున్నారు.  జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిపై చర్చోపచర్చలు సాగాయి. పశ్చిమ మండలాల్లో ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉన్నందున తమ ప్రాంతానికి చెందిన వ్యక్తినే ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవాలని నేతలు పట్టుబట్టారు. ఇంతలో పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్, సెంగొట్టయ్యన్, పొన్నయ్యన్, చెన్నై కార్పొరేషన్  మాజీ మేయర్‌ సైదై దొరైస్వామి పోయెస్‌గార్డెన్ కు వెళ్లి శశికళను కలిశారు. ఈ సందర్భంలో మిగిలిన వారంతా చిన్నమ్మ అనగా సైదై దొరస్వామి మాత్రం శశికళ ముఖ్యమంత్రి కావాలని పేరుపెట్టి తన అభిష్టాన్ని వ్యక్తం చేశారు. శశికళ అని పేరుతో చెప్పడం ఆమెకు, ఆమె కుటుంబీకులకు రుచించలేదని తెలుస్తోంది.

దీంతో ఇకపై సైదై దొరస్వామి గార్డెన్ వైపు రావడానికి వీల్లేదని పొన్నయ్యన్  ద్వారా హెచ్చరించారు. ఆనాటి నుంచి పోయెస్‌గార్డెన్ కు సైదై రావడం మానివేశారు. గత నెల 29వ తేదీన జరిగిన సర్వసభ్య సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. చెన్నై మండల ముఖ్యనేతలతో ఈనెల 5వ తేదీన శశికళ సమావేశమైనపుడు సైదైకి పిలుపులేదు. సైదై రావడానికి వీల్లేదని సీనియర్‌నేతలతో శశికళ చెప్పారు. శశికళ తన  పట్ల పక్షపాతధోరణిని అవలంభిస్తున్నట్లు తెలుసుకున్న సైదై తానుగానే దూరంగా ఉండిపోయారు. పార్టీలో తనకు నష్టం జరిగినపుడు ప్రతీకారంగా ఏదైనా చేయడం సైదైకి అలవాటు. అన్నాడీఎంకే రెండుగా చీలినపుడు జానకిరామచంద్రన్  వైపు ఉన్నారు.

నటుడు భాగ్యరాజ్‌ పార్టీ పెట్టినపుడు సహకరించారు. అలాగే శివాజీ గణేషన్  పార్టీని స్థాపించినపుడు సైదై అండగా నిలిచిన చరిత్ర ఉంది. జయలలితను ధిక్కరిస్తూ 1996లో రజనీకాంత్‌ మాట్లాడినపుడు పార్టీ పెడతాడని ఆశించి కోడంబాక్కంలో పార్టీ కార్యాలయం సిద్ధం చేసుకున్నాడు. అయితే రజనీ పార్టీ పెట్టలేదు. మేయర్‌గా తన చివరి రోజుల్లో జయలలిత సైదైని దూరం పెట్టింది. ఇందుకు శశికళే కారణమని సైదై భావిస్తున్నారు. జయలలిత మృతి తరువాత సైతం శశికళ తనను దూరం పెట్టడాన్ని సహించలేని సైదై మరోసారి తన ప్రతిఘటనను చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. జయలలిత అన్న కుమార్తె దీపతో రహస్య మంతనాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు.

అన్నాడీఎంకేలోని అసంతృప్తివాదులను ఏకతాటిపైకి తెచ్చి దీపవైపు నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో సైదై పార్టీ బహిష్కరణ వేటుకు గురికావడం లేదా వేరే పార్టీ పెట్టడం జరగవచ్చని గుసగుస లాడుతున్నారు. ఇదిలా ఉండగా, అసెంబ్లీ మాజీ స్పీకర్‌ పీహెచ్‌ పాండియన్  సైతం జయ మరణం తరువాత శశికళను కలవకపోవడమేగాక పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో ఇతన్ని కూడా పార్టీ దూరంగా పెట్టింది. 1991–96లో జయలలితకు వ్యతిరేకంగా సుబ్రహ్మణ్యస్వామి నేతృత్వంలో సైదై, పీహెచ్‌ పాండియన్, తిరునావుక్కరసర్‌ కూటమిగా ఏర్పడిన సంగతిని పార్టీనేతలు గుర్తు చేసుకుంటున్నారు.

దుష్టశక్తులను తరిమికొట్టండి: శశికళ
ఇదిలా ఉండగా, పార్టీలో తనపై ఉన్న వ్యతిరేకతను చల్లార్చేందుకు ఈనెల 4వ తేదీ నుంచి మండలాల వారీగా నేతలతో శశికళ సమావేశం అవుతున్నారు. అన్నాడీఎంకేను ప్రతిష్టను దెబ్బతీసేందుకు సిద్ధమవుతున్న దుష్టశక్తులను తరిమికొట్టాలని శుక్రవారం నాటి సమావేశంలో శశికళ కార్యకర్తలకు పిలుపు నివ్వడం ప్రత్యేకంగా పేర్కొనదగింది.

సీఎం పడిగాపులు:
అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో మూడురోజులుగా జరుగుతున్న పార్టీ సమావేశాల్లో పాల్గొనేందుకు సీఎం పన్నీర్‌సెల్వం, కొందరు మంత్రులు హాజరవుతున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు శశికళ వస్తారనే సమాచారంతో సీఎం కూడా అదే సమయానికి వచ్చారు. అయితే 10.45 గంటలకు శశికళ రాగా సమావేశం ప్రారంభమైంది. శశికళ కోసం సీఎం సైతం 45 నిమిషాలు వేచి ఉండడం గమనార్హం.

Advertisement

తప్పక చదవండి

Advertisement